e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home తెలంగాణ కంగుతిన్న విపక్షాలు

కంగుతిన్న విపక్షాలు

కంగుతిన్న విపక్షాలు
  • ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాల సెల్ఫ్‌గోల్‌
  • ప్రజల్లోకి బలంగా వెళ్లిన కేటీఆర్‌ ప్రకటన
  • 1.32 లక్షల నియామకాలపై యువత సానుకూల స్పందన
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడచూచినా ఇదే చర్చ
  • సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నేతల అగచాట్లు
  • వ్యర్థ ప్రకటనలతో ప్రజల్లో మరింత పలుచన

వరంగల్‌, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై గాయిగాయి చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకొన్న విపక్షాల కథ అడ్డం తిరిగింది. ప్రభుత్వమే స్వయంగా గత ఆరేండ్లలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా ప్రకటించటంతో విపక్షాల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి తయారయ్యింది. దిక్కుతోచని స్థితిలో కొందరు విపక్ష నేతలు బహిరంగ చర్చల, బహిరంగ లేఖలంటూ అడ్డదిడ్డ వాదన మొదలుపెట్టారు.

నియామకాల విధానంపై రాద్ధాంతం 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునుంచి భర్తీచేసిన పోస్టులపై ప్రభుత్వం పక్కా లెక్కలను వెల్లడించడంతో ప్రతిపక్ష పార్టీల్లోని కొందరు నేతలు వింత వాదనలు తెరపైకి తెస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ కాకుండా మిగిలిన నియామక సంస్థలు భర్తీచేసిన పోస్టులపై రాద్ధ్దాంతం చేసే కుట్రలకు తెరలేపారు. వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్పీతోపాటు వేర్వేరు సంస్థలు ఉంటాయి. పోస్టులను వేగంగా భర్తీచేసేందుకు వీలుగా డీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తదితర బోర్డులు ఉమ్మడి రాష్ట్రంనుంచే ఉన్నాయి. వీటిద్వారా భర్తీచేసిన పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు కావంటూ విపక్ష నేతలు విచిత్ర వాదన మొదలుపెట్టడంపై యువత మండిపడుతున్నది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా పోలీస్‌శాఖలో 31,972 పోస్టులు భర్తీ అయ్యాయి. తెలంగాణ స్టేట్‌ రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 3,623 పోస్టులను భర్తీచేసింది. మైనారిటీ వెల్ఫేర్‌ డైరెక్టరేట్‌, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, హార్టికల్చర్‌ వర్సిటీ కలిపి 259 పోస్టులను భర్తీచేశాయి. 

ప్రభుత్వరంగ సంస్థలపై వింత వాదన

ప్రభుత్వరంగ సంస్థల్లో భర్తీచేసిన పోస్టులను లెక్కలోకి తీసుకోవద్దంటూ విపక్ష నేతలు చిత్రమైన వాదన వినిపిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం సింగరేణి, ఆర్టీసీ, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌, హైదరాబాద్‌ జలమండలి, డీసీసీబీ వంటి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటుచేసింది. ఈ సంస్థలను ఆర్థికంగా ఆదుకొనేదీ ప్రభుత్వమే. ప్రభుత్వ నిర్ణయంతోనే సింగరేణిలో 12,500, ఆర్టీసీలో 4,768, విద్యుత్తుశాఖలో 22,637 పోస్టులను భర్తీచేశారు. 

కొత్త ఉద్యోగాలపై యువత ఆసక్తి..

ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ఇప్పటికే భారీగా ఉద్యోగాలు భర్తీచేయటంతోపాటు త్వరలోనే మరో 50 వేల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు వేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించటంతో నిరుద్యోగ యువతలో ఆసక్తి పెరిగింది. చాలామంది ఉద్యోగాల కోసం ప్రిపరేషన్‌ మొదలుపెట్టారు. విపక్షనేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నమ్మే పరిస్థితిలో యువత లేదు. దాంతో ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక విపక్ష అభ్యర్థులు తలలు పట్టుకొంటున్నారు. ఉద్యోగాల భర్తీపై అతిగా స్పందించి భంగపడ్డామని ప్రతిపక్ష పార్టీల్లోనే కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. అర్థంపర్థంలేని చర్చలపేరిట ఉద్యోగాల అంశా న్ని ఇంకా సాగదీస్తే ప్రజల్లో మనమే పలుచన అవుతామని ప్రతిపక్ష పార్టీల అధిష్ఠానాలకు ఆ పార్టీల నేతలు కొందరు సూచించినట్టు సమాచారం. 

పసలేని వాదనతో అభాసుపాలు

రాష్ట్రంలో ఆరేండ్ల పాలనలో తాము వివిధ శాఖల్లో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీచేశామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాను ఇచ్చిన ఉద్యోగాల జాబితాపై సందేహాలుంటే శాఖలవారీగా చెక్‌చేసుకోవాలని విపక్షాలకు సూచించారు. మంత్రి ప్రకటన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతున్నది. దాంతో ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం ప్రకటించాలని ఇంతకాలం డిమాండ్‌ చేసిన ప్రతిపక్ష నేతలు కంగుతిన్నారు. మండలి ఎన్నికల ప్రచారంలో పట్టభద్ర ఓటర్లంతా మంత్రి కేటీఆర్‌ ప్రకటన నిజమే కదా అని చెప్తుండటంతో విపక్షాలకు ఏం బదులివ్వాలో అర్థంకావటంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అబద్ధాలు, అర్ధసత్యాలను పటాపంచలు చేస్తూ ఉద్యోగాల భర్తీ అంశం సామాన్యులకూ చేరటంతో విపక్ష నేతలు కొత్తపల్లవి ఎత్తుకొంటున్నారు. బహిరంగ చర్చలకు రావాలంటూ ప్రజల ముందు అభాసుపాలవుతున్నారు.

పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ 

రాష్ట్రప్రభుత్వం చెప్తున్న ఉద్యోగాల భర్తీ లెక్కలు వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. పోలీస్‌శాఖలో వేల ఉద్యోగాల భర్తీ కండ్లముందు కనిపిస్తున్నది. ప్రభుత్వ ఇచ్చిన రాయితీలతో రాష్ర్టానికి అనేక ప్రైవేటు కంపెనీలు వచ్చాయి. వాటిలో మన యువతకు లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 

– మాచర్ల కిషన్‌, వరంగల్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే ఉద్యోగావకాశాలు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు ఎక్కువగా జరిగాయి. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీచేసిన దాఖలాలు లేవు. తెలంగాణలో సొంతపాలన మొదలైన తర్వాత 1.30 వేల ఉద్యోగాలు భర్తీచేసింది వాస్తవం. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చొరవతో హైదరాబాద్‌తోపాటు వరంగల్‌లో కూడా నూతన కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ఉద్యోగ అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. 

– వలుస గోపి,ఎంటెక్‌, కొత్తవాడ, వరంగల్‌ అర్బన్‌ జిల్లా 

రాజకీయాలకోసమే విమర్శలు 

తెలంగాణ ఏర్పడ్డాకే ఉద్యోగాల భర్తీ ఎక్కువగా జరుగుతున్నది. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్‌ కంపెనీల్లో అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో వరంగల్‌లో ఏర్పాటుచేసిన ఐటీ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నాయి. నా క్లాస్‌మేట్‌కు ప్రభుత్వ పోస్టు వచ్చింది. 

– కే రాహుల్‌సాయి, బీఎస్సీ కంప్యూటర్స్‌, వరంగల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కంగుతిన్న విపక్షాలు

ట్రెండింగ్‌

Advertisement