KTR | హైదరాబాద్, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని, తాము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ‘ఒకవైపు అమరవీరుల స్థూపం, మరోవైపు సచివాలయం ఉన్నాయి.
ఈ రెండింటి మధ్య రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. అసలు అమరవీరుల స్థూపంతోగానీ, సచివాలయంతోగానీ రాజీవ్‌గాంధీకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు అక్కడే ఎందుకు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కరెక్ట్’ అని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం పేరును తొలగించి తెలంగాణ మహనీయుల పేరు పెడుతామని కేటీఆర్ వెల్లడించారు.