హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా రేవంత్ సర్కారు ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, ఒక్క గొప్ప పథకం అమలు చేయలేదని, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భవనాలు, ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లకు రిబ్బన్ కట్ చేసేందుకు రేవంత్‌రెడ్డి కత్తెర పట్టుకొని తిరుగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దెప్పిపొడిచారు. ఓయూలో ఈ రోజు ప్రారంభించిన భవనాలు కూడా కేసీఆర్ హయాంలో నిర్మించినవేనని గుర్తుచేశారు. బడా మోదీ.. చోటా మోదీ కలిసి లోపాయికారి ఒప్పందంతో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ర్టానికి ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ పరస్పర సహకారంతో తెలంగాణ ప్రజలకు ధోకా చేస్తున్నారని, ఇందులో భాగంగానే అదానీకి రేవంత్‌రెడ్డి అండగా నిలుస్తుంటే రాహుల్‌గాంధీ మాత్రం అమాయకంగా ఆటలో అరటిపండులా నిస్సహాయ స్థితిలో చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు.
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ పోరాటం చేస్తుంటే.. ఇక్కడేమో రేవంత్‌రెడ్డి మోదీకి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీకి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఫోర్త్‌సిటీ కాంట్రాక్ట్ కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమని స్పష్టంచేశారు. రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ర్టానికి ఒరిగింది శూన్యమని నిప్పులు చెరిగారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆర్మూర్‌కు చెందిన బీజేపీ నేత ఆలూరు విజయభారతి పెద్దసంఖ్యలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రం నుంచి రూ.3 వేల కోట్ల విలువైన కేన్స్, రూ.8 వేల కోట్ల విలువైన మైక్రాన్ పరిశ్రమలను కేంద్రంలోని బీజేపీ గుజరాత్‌కు తన్నుకుపోయి తెలంగాణ నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. మహేశ్వరంలో ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమల పార్క్‌ను తన భాగస్వామి పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తరలించిందని, నవోదయ పాఠశాలల మంజూరులోనూ అన్యాయం చేసిందని, జిల్లాకోటి ఇవ్వాలని అడిగితే మొండిచెయ్యి చూపిందని నిప్పులు చెరిగారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు ఒక్కటీ ఇవ్వకుండా ఇక్కడి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిందని, ఐఐఎం, కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ ఇవ్వకుండా మోదీ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు.
బడే భాయ్-చోటే భాయ్ ఫెవికాల్ బంధంతో తెలంగాణ ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నదని వాపోయారు. ఇక్కడి బీజేపీ నేతలు రేవంత్ సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుతూ రక్షణ కవచంలా నిలుస్తున్నారని తూర్పారబట్టారు. అంతర్గత ఒప్పందంతోనే కంచ గచ్చిబౌలి భూ కుంభకోణం, యూరియా సంక్షోభంపై రైతుబంధు కోత.. రుణమాఫీ ఎత్తివేత, తులంబంగారం ఎగ్గొట్టడంపై మాట్లాడటం లేదని, కానీ కేసీఆర్‌పై మాత్రం ఒంటికాలితో లేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరతకు ఆపరేషన్ సిందూర్ కారణమని బీజేపీ ఎంపీ వింత వాదనను తెరపైకి తెచ్చారని, అదే నిజమైతే దేశంలోని అన్ని రాష్ర్టాల్లో కొరత ఎందుకు లేదని ప్రశ్నించారు.
తెలంగాణపై మొసలికన్నీళ్లు కారుస్తున్న మోదీ సర్కారు విచిత్రమైన ప్రతిపాదన తెచ్చింది. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దట..ఈ నీళ్లను ఆంధ్రాకు, తమిళనాడుకు తరలిస్తరట..తెలంగాణకేమో హిమాలయాల్లో కరిగే మంచు కొండల ద్వారా నీళ్లిస్తరట..పదకొండేండ్లలో పైసా ఇవ్వలేనోళ్లు మంచుకొండల నీళ్లు తెచ్చిస్తామంటే మనం నమ్మాలట! నదుల అనుసంధానం చేపట్టిన మోదీకి జేజేలు పలుకుతూ మన కంటిని మనమే పొడుచుకోవాలట!
-కేటీఆర్
ఉత్తర, దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో కేసీఆర్ కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేశారని గుర్తుచేశారు. 2014లో పాలమూరుకు జాతీయ హోదా ఇస్తామని అప్పటి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మహబూబ్‌నగర్ గడ్డపై మాటిచ్చారని, కానీ పదేండ్లు దాటినా జాతీయ హోదా గానీ, నయాపైసా గానీ ఇవ్వకుండా కేంద్రం నయవంచన చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ వందలసార్లు విజ్ఞప్తులు చేసినా మోదీకి మనసురాలేదని, బీజేపీకి మన రాష్ట్ర రైతులపై ప్రేమలేదని, భవిష్యత్తులోనూ ఉండబోదని స్పష్టంచేశారు.
ఢిల్లీలోనేమో రేవంత్‌రెడ్డి బావమరిదికి కాంట్రాక్టులిస్తరు..ఇక్కడ రేవంత్‌రెడ్డి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కల్వకుర్తి నియోజకవర్గంలో రోడ్ల టెండర్లు అప్పజెప్పుతరు..అక్కడేమో రేవంత్ బావమరిదిని బీజేపీ కాపాడుతది..ఇక్కడేమో బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్ర తివాచీ పరిచి కాంట్రాక్టులు కట్టబెడుతది. రెండు పార్టీల దోస్తానాకు ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి?
-కేటీఆర్
తెలంగాణ ప్రజలపై మొసలి కన్నీళ్లు కారుస్తున్న మోదీ ప్రభుత్వం విచిత్ర ప్రతిపాదన తెరపైకి తెచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. ‘గోదావరి నీళ్లను బనకచర్ల ద్వారా ఆంధ్రాకు తరలించి అక్కడి నుంచి కర్ణాటక మీదుగా కావేరీ ద్వారా తమిళనాడుకు తరలిస్తరట..తెలంగాణకేమో హిమాలయాల్లో కరిగే మంచు కొండల ద్వారా నీళ్లు ఇస్తరట.. పైసా ఇవ్వలేనోళ్లు మంచుకొండల నీళ్లు తెచ్చిస్తామంటే మనం నమ్మాలట! మళ్లీ బీజేపీకి ఓట్లేసి గద్దెనెక్కించాలట’ అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న చందంగా రెండు పార్టీల నుంచి గెలిచిన పదహారు మంది ఎంపీలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రూ.1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్‌ను రేవంత్‌రెడ్డి తన బావమరిదికి అక్రమంగా కట్టబెట్టారని ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఎన్నిసార్లు అడిగినా దున్నపోతు మీద వాన పడ్డ చందంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్ట్.. ఢిల్లీలోనేమో రేవంత్ బావమరిదికి కాంట్రాక్టులు.. రెండు పార్టీల దోస్తానాకు ఇంతకుమించిన నిదర్శనం ఇంకేం కావాలి?’ అంటూ దుయ్యబట్టారు. సివిల్ సప్లయ్‌లో టెండర్ల కుంభకోణం జరిగిందని ఈడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. హెచ్‌సీయూ భూముల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెట్లను నరికేసి వన్యప్రాణులను వధిస్తుంటే కేంద్రం పట్టించుకోలేదని, సుప్రీంకోర్టు కమిటీ వేసి 10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని తేల్చినా మోదీ ప్రభుత్వం ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడంలోని ఆంతర్యమేమిటని నిలదీశారు.
హామీలు ఇవ్వడం.. ఎగ్గొట్టడంలో కేంద్రంలోని బడా మోదీ.. రాష్ట్రంలోరి చోటా మోదీ పరస్పరం పోటీపడుతున్నారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘మోదీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తా అన్నరు..చిన్నోడు కాబట్టి ఇక్కడ రేవంత్ ఏటా రెండు లక్షలు అన్నడు.. అక్కడ ఆయన ఇయ్యరు..ఇక్కడ ఈయన ఇవ్వరు..ఆయన పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నరు.. ఈయనేమో రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తా అన్నరు.. ఆయనవి రావు..ఈయనవి పడవు..ఇద్దరూ విమర్శిస్తే ఊరుకోరు. ఆయన ఈడీని పంపుతడు..ఈయన ఏసీబీని పంపుతడు.. గట్టిగ మాట్లాడినోళ్లను జైలుకు పంపుతరు’ అని చురకలంటించారు. హామీలు అడిగితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కేసులతో భయపెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, సర్కారు వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మరోసారి తేల్చిచెప్పారు.
ఎన్నికల ముందు డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరిట హామీల జాతరకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తర్వాత చెప్పుల జాతరకు తెరలేపిందని కేటీఆర్ దెప్పిపొడిచారు. ‘ఇప్పుడు ఎక్కడికెళ్లినా యూరియా కోసం కిలోమీటర్ల పొడవునా చెప్పుల లైన్లు దర్శనమిస్తున్నయి. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు యువకులు ఉరికినట్టు ఇప్పుడు యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు క్యూలో నిల్చుంటున్నరు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన మార్పు’ అని దుయ్యబట్టారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని, ఓట్ల ముందర ఆదమరిచినం కాబట్టే ఇప్పుడీ దుస్థితి దాపురించిందని వాపోయారు.
తెలంగాణకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీకి స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. లేకుంటే తమకే ప్రజాబలం ఉన్నదని 2 పార్టీలు రెచ్చిపోయే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ అంటే కేసీఆర్ అని.. కేసీఆర్ అంటే తెలంగాణ అని పునరుద్ఘాటించారు. తెలంగాణపై ఆయనకున్న కడుపునొప్పి ఇతర పార్టీల నేతల కూ ఉండదని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సంఘటితమై ఊరూరా గులాబీ జెండా ఎగరేయాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌కు వంతపాడుతున్న కొందరు అధికారులు, పోలీసులను వదిలిపెట్టబోమని, మళ్లీ వచ్చేది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. కార్యకర్తలు సైతం అతిచేసే అధికారుల వివరాలను పింక్ బుక్కో, రెడ్ బుక్కో దేంట్లోనైనా నోట్ చేసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ పాలనలో అనేక గొప్ప పనులు చేసినా తాము చెప్పుకోలేదని, ఇదే అదనుగా అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అబద్ధాల జాతరకు తెరలేపారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు అనరాని మాటలన్నారని చెప్పారు. ‘కేసీఆర్ కట్టిన ప్రగతి భవన్లో 150 గదులున్నయి.. బంగారు బాత్రూంలున్నయి.. అని పచ్చి అబద్ధాలు చెప్పిండ్రు. ఇదే విషయాన్ని ఇటీవల ఎదురుపడ్డ భట్టి విక్రమార్కను 150 రూంలల్లో ఏ రూంలో పడుకుంటున్నవని అడిగినా.. ఆయన సమాధానం చెప్పకుండా వెకిలి నవ్వులు నవ్వుతున్నరు’ అని ఎద్దేవాచేశారు. ‘అధికారంలోకి వస్తం వంద రోజుల్లో పథకాల వరద పారిస్తం..అని ఊదరగొట్టిండ్రు.మరి వంద రోజులు కాలేదా?’ అని ప్రశ్నించారు. ‘ఇక ఫ్రీ బస్సు అందం గురించి నేను చెప్పక్కర్లేదు..మీకందరికీ దాని గొప్పతనం తెలుసు’ అని ఎద్దేవా చేశారు.
ఐటీఐఆర్‌ను రద్దు చేసి, నేషనల్ డిఫెన్స్ కారిడార్‌కు మొండి చెయ్యి చూపి..మెడికల్ కాలేజీలు ఎగ్గొట్టి..కేన్స్, మెక్రాన్ లాంటి పరిశ్రమలను తరలించుకెళ్లి మోడీ సర్కారు మోసం చేస్తే.. అవ్వాతాతల రెట్టింపు పింఛన్ హామీకి ఎగనామం పెట్టి, ఆడబిడ్డలకు తులం బంగారం ఎత్తగొట్టి, జాబ్ క్యాలెండర్‌కు తిలోదకాలిచ్చి, రైతుబీమాకు కోతపెట్టి రేవంత్ ప్రభుత్వం దగా చేస్తున్నది.
-కేటీఆర్
తాము గతంలో అనేక గొప్ప పనులు చేసినా ఏనాడూ గొప్పలు చెప్పుకోలేదని కేటీఆర్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భవనాలు, ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లను ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కత్తెర పట్టుకొని తిరుగుతూ కత్తెర రాజకీయం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ ప్రారంభించిన భవనాలు కేసీఆర్ హయాంలో నిర్మించినవేనని గుర్తుచేశారు. ‘పవిత్రమైన విశ్వవిద్యాలయానికి వెళ్లి రేవంత్‌రెడ్డి మాట్లాడిన వికృత మాటలు విని విద్యార్థులు నవ్వుకుంటున్నరు. గత ముఖ్యమంత్రులతో పోలుస్తూ బూతులు తిడుతున్నరు. చేసిన పనులు చెప్పుకోలేక యూనివర్సిటీలోనూ పదేపదే కేసీఆర్ జపం చేయడం విడ్డూరం’ అని దుయ్యబట్టారు.
గోదావరి నీళ్లను దిగువకు పంపి తమిళనాడుకు తరలించేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టుకు తెరతీశారని కేటీఆర్ చెప్పారు. మోదీ-బాబు కుట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పావుగా మారారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం, పదవిని కాపాడుకొనేందుకు చంద్రబాబుకు వంతపాడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డకు మరమ్మతు చేయకుండా గోదావరి నీళ్లను ఆంధ్రాకు తరలించేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఓవైపు రైతులు యూరియా దొరక్క అష్టకష్టాలు పడుతుంటే రేవంత్ మాత్రం సినిమావాళ్లతో మీటింగ్‌లు పెట్టడం ఎంతవరకు సమంజసం’ అని ప్రశ్నించారు. కేంద్రంతో మాట్లాడి యూరియా సంక్షోభాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 11 ఏండ్లుగా న్యాయం చేయకపోగా తీరని గాయాలు చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకుండా, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయకుండా, నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టకుండా దగా చేసింది. ఐటీఐర్, నేషనల్ డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయకుండా తెలంగాణ నిరుద్యోగ యువత కండ్లలో మట్టిగొట్టింది.
-కేటీఆర్
20 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పదేండ్లు వెనుకబడి పోయిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన రాష్ట్రం రేవంత్ హయాంలో అధోగతి పాలవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఉస్మానియాకు వెళ్లిన రేవంత్‌రెడ్డి, తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను దూషించడం దుర్మార్గమని, హోదామరిచి కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమేదైనా కేసీఆర్‌ను తూలనాడటమే రేవంత్ పనిగా పెట్టుకోవడం బాధాకరమని వాపోయారు.
మళ్లీ బీఆర్ఎస్లోకి రావడం పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉన్నదని విజయభారతి వ్యాఖ్యానించారు. ఆలూరి గంగారెడ్డి కూతురినైన తాను పార్టీని వీడి బీజేపీలో చేరి తప్పు చేశానని మధనపడ్డారు. భవిష్యత్తులో ఆర్మూర్‌లో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరినీ కలుపుకొని వెళ్లి పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం తనవంతు కృషిచేస్తానని ప్రకటించారు. కార్యకర్తలు, నేతలను సమన్వయం చేసుకుంటూ కేసీఆర్, కేటీఆర్ మార్గదర్శనంలో ముందుగుసాగుతానని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, ఆయేషా, తుల ఉమ, ఆయాచితం శ్రీధర్, పటోళ్ల కౌశిక్, విఠల్‌రావు, అర్వింద్ పాల్గొన్నారు.
జిల్లాకో మెడికల్ కాలేజీతో దేశంలో మరే రాష్ర్టానికీ సాధ్యం కాని అరుదైన ఘనతను తెలంగాణ సొంతం చేసుకున్నది. ఎన్ఎంసీ విడుదల చేసిన జాబితాలో ఈ వివరాలను వెల్లడించింది. 2025-26 అకడమిక్ ఇయర్‌కు గాను దేశంలోని అన్ని రాష్ర్టాలు, యూనియన్ టెర్రిటరీ (యూటీ)ల్లో జిల్లా కో మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ విషయాన్ని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అరవింద్ వరైర్ అనే ‘ఎక్స్’ యూజర్ పోస్టును షేర్ చేసి పిడికిలెత్తిన ఎమోజీని ట్వీట్‌కు జతచేసి ‘జై తెలంగాణ’ అని రాసుకొచ్చారు.