నెసెసరీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కొత్త నిర్వచనం నిన్న ఎల్కతుర్తి..నేడు డాలస్! అక్కడా ఇక్కడా సభాస్థలి చాలనంత జనం. లోపలా బయటా అదే ఉరకలెత్తే ఉత్సాహం. దిక్కులు ప్రతిధ్వనించే నినాదాలు. ఉద్వేగం ముప్పిరిగొన్న రోమాంచిత సన్నివేశాలు. ఒక మహాఖండంలో దూరాభారం మరిచి ఎక్కడెక్కడినుంచో ఒక జాతరకు వచ్చినట్టు.. జన సముద్రం అలలు ఉరకలెత్తినట్టు.. సమూహాలు సమూహాలుగా తరలివచ్చిన జనం. ఒక పండుగ చేసుకున్నట్టు ఆత్మీయ ఆలింగనాలు. ప్రేమపూరిత కరచాలనాలు.
ఇదీ తెలంగాణ అంటే. ఇదీ ఉద్యమం నాటి స్ఫూర్తి చెక్కు చెదరలేదనే సంకేతం. ఇదీ నివురుగప్పిన నిప్పు మళ్లీ జ్వలించబోతున్న సూచన. ఇక్కడ రాష్ట్రంలో ఆత్మలేని అవతరణ ఉత్సవాలు పేలవంగా బేలతనాన్ని సంతరించుకుంటే, ఖండాతరాల అవతల అవే ఉత్సవాలు మహోత్సాహంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఇంటి పార్టీ ఎక్కడుంటే అక్కడే తెలంగాణ అని కుండబద్దలు కొట్టాయి. నిన్న ఎల్కతుర్తి ..నేడు డాలస్.. తెలంగాణ అంటే.. ఏ పార్టీయో..విస్పష్టంగా తేల్చి చెప్పాయి. చరిత్ర సరళరేఖ కాదు, కాలగమనం శిలాసదృశం కాదు. నిత్య నిరసనకారులకు, మేధోపైత్య ప్రవాచకులకు , పచ్చప్రచార విదూషకులకు మింగుడు పడని నిజమిది!!
కేసీఆర్ మాట ఇస్తే నెరవేర్చి తీరుతారనే విశ్వాసం తెలంగాణ ప్రజల్లో అచంచలంగా ఉన్నది. కేసీఆర్ అంటేనే విశ్వాసానికి చిరునామా! కేసీఆర్ నినాదం ఇస్తే అది సంచలనం.. కేసీఆర్ విధానాన్ని ప్రకటిస్తే అది విప్లవం.
-కేటీఆర్
తెలుగువారికి రెండు రాష్ర్టాలు కాదు.. మూడు ఉన్నాయని టెక్సాస్‌ను చూస్తే అనిపిస్తున్నది. బీఆర్ఎస్ రజతోత్సవాలు నిర్వహించాలన్న చర్చ జరుగుతున్న సందర్భంలో ఎన్నారైలంతా ఏకగ్రీవంగా సూచించిన నగరం డాలస్. ఓ వైపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, మరోవైపు పార్టీ రజతోత్సవ వేడుకలను చూస్తుంటే నాకు అమెరికాలో ఉన్నట్టు లేదు.. తెలంగాణలోనే ఉన్నట్టున్నది.
-కేటీఆర్
KTR | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : పొజిషన్లో ఉన్నా.. అపొజిషన్లో ఉన్నా తమకు తెలంగాణే ఫస్ట్ అని, ఇండియానే ఫస్ట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పునరుద్ఘ్ఘాటించారు. ‘బీఆర్ఎస్ అధికారంలో ఉండొచ్చు.. ప్రతిపక్షంలో ఉండొచ్చు కానీ.. అక్కడ ఉన్నది మన తెలంగాణే’ అని పేర్కొన్నారు. పదేండ్ల పాలను బరువుగా భావించలేదని, బాధ్యతగా స్వీకరించామని స్పష్టంచేశారు. తెలంగాణ విడిపోతే విఫల రాష్ట్రమవుతుందని హేళన చేసిన చోటే విజయకేతనం ఎగురవేశామని చెప్పారు. ‘మిమ్మల్ని పరిపాలించే నాయకులున్నారా?’ అని గేలి చేసిన వారితోనే ‘మాకూ మీ లాంటి నాయకులుంటే బాగుండు’ అనేలా పాలన సాగించామని గుర్తుచేశారు.
స్వరాష్ర్టాన్ని నంబర్ వన్‌గా నిలపటంతో పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినవాళ్లెవరమూ వెనకడుగు వేయలేదని చెప్పారు. ఎన్నికలన్న తర్వాత కూడికలు తీసివేతలు ఉంటాయని, ఈ క్రమంలోనే 2023 ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు. ‘ఎన్నికల్లో ఓడిపోవచ్చు గాని, తెలంగాణను ప్రేమించడంలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు..వేయబోము’ అని స్పష్టంచేశారు. అమెరికాలోని డాలస్‌లో డాక్టర్ పెప్పర్ ఎరీనాలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
‘జననీ జన్మభూమిశ్చా ..స్వర్గాదపీ గరీయసీ’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేటీఆర్, ‘కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లండి.. జన్మభూమి రుణం కూడా తీర్చుకోండి’ అంటూ ఎన్నారైలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఉద్భోదించారు. సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిదేదీ లేదని దేశానికి తెలంగాణ చాటిచెప్పిందని సగర్వంగా ప్రకటించారు. 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో, 10 ఏండ్ల తెలంగాణ ఉజ్వల ప్రయాణంలో, అడుగడుగునా కేసీఆర్ వేసిన చారిత్రక ముద్రను అమెరికాలోని అనేక రాష్ర్టాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఎన్నారైల హర్షధ్వానాల మధ్య వివరించారు. సమైక్యపాలకుల వివక్షతో దశాబ్దాలపాటు పడావుబడ్డ తెలంగాణ దీనస్థితిని, కేసీఆర్ హయాంలో కేవలం పదేండ్లకాలంలోనే సుజలం, సుఫలం, సస్యశ్యామల తెలంగాణగా ఎదిగిన తీరును కేటీఆర్ ఆవిషరించారు. ట్రంప్ విధానాలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటించారు. అవసరమైతే అమెరికాలో లీగల్‌సెల్ ఏర్పాటుచేసి తెలుగు విద్యార్థులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
‘మూడేండ్లలో మళ్లీ అధికారంలోకి వస్తం.. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతరు’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘ఓవైపు తెలంగాణ పార్టీకి రజతోత్సవం, మరోవైపు తెలంగాణ రాష్ర్టానికి పుషర సంవత్సరం. తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాకు పాతికేళ్లు నిండాయి.
స్వీయ రాజకీయ అస్తిత్వానికి సిల్వర్ జూబ్లీ జరుగుతున్నది’ అని పేర్కొన్నారు. 2001, ఏప్రిల్ 27న తెలంగాణ గర్వించే కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకున్నదని పార్టీ ప్రస్థానాన్ని వివరించారు. ఒక యోధుడు వేసిన ఒక అడుగుతో జలదృశ్యంలో మొదలైన జర్నీ రెండున్నర దశాబ్దాల మైలురాయి అందుకొని అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించిందని చెప్పారు. ఆత్మగౌరవ పోరాటాల వీరగాథల్లో శిథిలాల నుంచి శిఖరాన్ని చేరిన తెలంగాణ గెలుపు కథ తప్పకుండా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని తెలిపారు.
ఇంత విలక్షణమైన, విశిష్టమైన ప్రయాణం ప్రపంచంలో ఏ పార్టీకీ లేదని చెప్పారు. ‘ఆటుపోట్లకు అదరలేదు. ఎదురుదెబ్బలకు బెదరలేదు. పని అయిపోయిందని ప్రచారం జరిగిన ప్రతిసారీ బూడిద నుంచి లేచిన ఫీనిక్స్‌లాగా పైకి లేచి గమ్యాన్ని ముద్దాడింది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్సేనని స్పష్టంచేశారు. ‘మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు బరువులా భావించలేదు. బాధ్యతలా భావించినం. ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినందుకు అనితర సాధ్యమైన ఎన్నో విజయాలు సొంతమయ్యాయి. స్వరాష్ర్టాన్ని నంబర్ వన్‌గా నిలపడంలో ఏ ఒక అవకాశాన్నీ కేసీఆర్ వదులుకోలేదు’ అని గుర్తుచేశారు.
‘జీవితంలో చాలా మంది కలలు కంటారు.. కానీ కొందరే వాటిని సాకారం చేసుకుంటారు.. మార్టిన్ లూథర్, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో గుండెనిండా ఆత్మవిశ్వాసం, గుండె నిబ్బరంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణను 2001లో కలగని 14 ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసి దాన్ని సాధించారు’ అని కేటీఆర్ వివరించారు. 2001లో ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు ‘ఉద్యమ బాట నుంచి తప్పుకొంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారని, ఆమరణ నిరాహార దీక్షకు దిగే సందర్భంలో ‘కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ శవయాత్రో.. కేసీఆర్ జైత్రయాత్రో’ అని పేర్కొనడమే కాకుండా 2014లో ‘నేను ఢిల్లీకి ఏపీ నుంచి వెళ్తున్న.. తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతా’ అని ప్రకటించి రాష్ర్టాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్ అని గుర్తుచేశారు. ‘
శూన్యం నుంచి సునామీ సృష్టించి, తెలంగాణ మిషన్ ఇంపాజిబుల్ నుంచి మిషన్ పాజిబుల్’ అనే పరిస్థితిని సృష్టించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను తెచ్చిన నాయకుడు కేసీఆర్’ అని పేర్కొన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు సకలజనులు ఏకమై అపూర్వ పోరాటాలు ఆవిష్కరించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాధించుకున్నామని వివరించారు. అమెరికా సహా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు మాతృభూమి కోసం జై తెలంగాణ అని నినదించారని గుర్తుచేశారు. ‘కుట్రలను ఛేదించి, కుతంత్రాలను ఎదిరించి, అవమానాలను అధిగమించి అవరోధాలను కూకటి వేళ్లతో పెకిలించి ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో సుదీర్ఘ ప్రయాణం సాగించి దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలకమైన రాజకీయ అధ్యాయంగా నిలిచింది తెలంగాణ’ అని తెలిపారు.
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ గడ్డమీద ఎలాంటి ఉత్సాహం కనిపించిందో డాలస్‌లోనూ అదే జోష్ కనిపిస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. డాలస్‌లో జరుగుతున్నది ఒక వేడుక మాత్రమే కాదని, అది అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒకరి గురించి మాట్లాడే సందర్భమని కేటీఆర్ ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. అభివృద్ధి, ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వ లక్ష్యాల సాధన కోసం రెండున్నర దశాబ్దాల క్రితం ఒక స్వప్నం చిగురించిందని, తెలంగాణ ప్రజల పోరాటాలతోనే చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు.
ఒక యోధుడు వేసిన అడుగుతో జలదృశ్యంలో మొదలైన జర్నీ రెండున్నర దశాబ్దాల మైలురాయిని అందుకొని అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఆత్మగౌరవ పోరాటాల వీరగాథల్లో శిథిలాల నుంచి శిఖరాన్ని చేరిన తెలంగాణ గెలుపు కథ తప్పకుండా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇంత విలక్షణమైన, విశిష్టమైన ప్రయాణం ప్రపంచంలోని ఏ పార్టీకీ లేదు.
-కేటీఆర్
తెలంగాణ జనజీవన నేపథ్య సోయితో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. 12 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మితో పెండ్లి చేసి కేసీఆర్ మేనమామ అయ్యారని, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు, మాతాశిశు మరణాల రేటును తగ్గించేందుకు కేసీఆర్ కిట్ అనే విప్లవాత్మకమైన పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు. ఒకప్పుడు ‘నేను రాను బిడ్డో సరారు దవాఖానకు’ అనే దుస్థితిని కేసీఆర్ రూపుమాపారని ఉదహరించారు.
కేసీఆర్ నాయకత్వంలో 1022 గురుకులాలు ఏర్పాటు చేసి 6 లక్షల మంది నిరుపేద బిడ్డలకు నెలకు రూ.10 వేలు ఖర్చుచేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వకున్నా ఒక్క మెడికల్ కాలేజీని తెలంగాణకు మంజూరు చేయకపోయినా జిల్లాకో మెడికల్, నర్సింగ్ కాలేజ్‌ని ఏర్పాటు చేసిన చరిత్ర కేసీఆర్‌దని కొనియాడారు. అలాగే ఓవర్సీస్ స్కీమ్‌తో రాష్ట్రం నుంచి 8 వేల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 20 లక్షల చొప్పున అందజేసి విదేశీ విద్యను అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
ఏదేశంలో ఉన్నా.. ఏ స్థానంలో ఉన్నా.. పుట్టిన గడ్డ పేరు వినగానే ఎవరైనా పులకించిపోతారని కేటీఆర్ పేర్కొన్నారు. డాలస్‌లో ‘జై తెలంగాణ’ అని అందరూ నినదిస్తుంటే గుండెలనిండా ఆత్మగౌరవం ఆకాశమే హద్దుగా ఉప్పొంగిపోతున్నదని చెప్పారు. అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తున్నదని, తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరని ఎన్నారైలను కొనియాడారు. ఖండాలను దాటి వచ్చి తెలంగాణ జెండాను రెపరెపలాడిస్తున్న ఎన్నారైల నైపుణ్యాన్ని కీర్తించారు. ‘ తెలంగాణ రత్నాలు మీరు.. భరతజాతి ముద్దుబిడ్డలు మీరు. తెలుగు తేజాలు మీరు’ అంటూ అభినందించారు.
ఉద్యమంలో అయినా పదేండ్ల ఉజ్వల ప్రయాణంలో అయినా తెలంగాణ ఎన్నారైలు పోషించిన పాత్ర అద్వితీయమని కొనియాడారు. బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. కేసీఆర్ సుదీర్ఘ ఉద్యమాల స్ఫూర్తితో పురోగమించిన తెలంగాణ స్ఫూర్తితో రాణించాలని ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ‘ఎన్నారైలంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు.. నెసెసరీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని కేటీఆర్ పేర్కొన్నప్పుడు సభా ప్రాంగణం కేరింతలతో మార్మోగింది.
‘వలవల ఏడుస్తూ.. వలసెళ్లిపోయిన పాలమూరుకు విముక్తి. బొక్కలు వంగి బతుకులు కుంగిన నల్లగొండకు ఫ్లోరైడ్ విషం నుంచి విముక్తి. సాలెల మగ్గం ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నుంచి విముక్తి. ఆదివాసీ బిడ్డల విష జ్వరాల నుంచి విముక్తి. కటిక చీకట్లతో కరెంట్ కోతలతో కాలిన మోటర్లతో.. అల్లాడిపోయిన అంధకారం నుంచి విముక్తి. నీళ్లు లేక బోర్ల మీద బోర్లువేసి బొక్క బోర్లాపడి చేను గట్లకాడ శవాలై వేలాడిన అన్నదాతలకు చావుల నుంచి విముక్తి. బొంబాయి.. బొగ్గుబాయి.. దుబాయి బతుకుల నుంచి విముక్తి. ఈనాటి అద్భుతాలన్నీ ఆనాటి కేసీఆర్ ఆలోచనలే’ అని కేటీఆర్ వివరించారు.
రైతుబంధు, రైతుబీమా వంటి అనేక విప్లవాత్మక పథకాలతో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. ‘కేసీఆర్ కలలు, ఊహలు, ఆలోచనలు, కొంతమందికి అతిశయంగా అనిపించేవి.. అయితే, బలమైన సంకల్పం..దృఢమైన కార్యాచరణ, అద్భుతమైన దార్శనికతతో కేసీఆర్ తెలంగాణను నడిపించారు.. ఫలితంగానే తెలంగాణ అద్భుతంగా పురోగమించింది’ అని కేటీఆర్ వివరించారు.
ఆర్థిక సౌష్టవంతో తెలంగాణ అలరారిందని కేటీఆర్ పేర్కొన్నారు. లక్షల కోట్ల సంపదను సృష్టించి దేశాన్ని సాకే ఐదారు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని వివరించారు. ‘శాస్త్రీయ అవగాహన, ఆర్థిక విజ్ఞానం లేనివాళ్లు తెలివితకువ తనంతో అప్పుల మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అప్పు చేసి తెలంగాణ పప్పుకూడు తినలేదు. అప్పుచేసి ఆర్థిక చక్రాన్ని తిప్పి ఆదాయాన్ని పోగుచేసి సంపద సృష్టించి రాష్ట్రంలోని పేదలకు పంచినం. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదు. మితిమీరి అప్పులు చేయలేదు’ అని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ లెకల ప్రకారం అప్పుల్లో దేశంలో 28 రాష్ర్టాలుంటే అందులో తెలంగాణది 24వ ర్యాంక్ అని గుర్తుచేశారు. ఆర్థిక క్రమశిక్షణను పాటించామని, చేయకూడని అప్పు చేయలేదని, తప్పు అసలే చేయలేదని తేల్చిచెప్పారు. మూస పద్ధతుల్లో ముందుకెళ్లలేదని, ఆలోచనలతోనే వినూత్న పద్ధతుల్లో విప్లవాన్ని సృష్టించామని తెలిపారు. మాంధ్యం ముసురుకున్న కాలంలో పెద్ద నోట్లు రద్దు, కరోనా వంటి కష్టకాలంలోనూ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదని వెల్లడించారు. 2014 నుంచి 2023 దాకా ఆయా రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని కేటీఆర్ వివరించారు.
కేసీఆర్ మాట ఇస్తే నెరవేర్చి తీరుతారనే విశ్వాసం తెలంగాణ ప్రజల్లో అచంచలంగా ఉన్నదని కేటీఆర్ వివరించారు. ‘కేసీఆర్ అంటేనే విశ్వాసానికి చిరునామా. కేసీఆర్ నినాదం ఇస్తే అది సంచలనం. కేసీఆర్ విధానాన్ని ప్రకటిస్తే విప్లవం’ అని తెలిపారు. ఇంటింటికి నల్లా ఇవ్వకుంటే ఓట్ల అడుగ అని చెప్పి నెరవేర్చిన సాహసవంతుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ‘ఓట్లు అడుగనని ప్రకటించిన నాయకుడు భారతదేశంలో కేసీఆర్ ఒకరే. విప్లవాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులతో కేసీఆర్ తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చేసిండ్రు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అంటే.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణగా మార్చిన ఘతన కేసీఆర్‌కే దక్కుతుంది. శివాలయంగా మారిన ఎస్సారెస్పీ.. కాళేశ్వరంతోనే పునరుజ్జీవనం పొందిదని చెప్పారు.
చైనాలోని త్రీ గోర్జెస్ డ్యాం నిర్మాణానికి 16 ఏండ్లు పడితే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని కేసీఆర్ నాలుగేండ్లలోనే పూర్తి చేశారని కేటీఆర్ వివరించారు. కొంతమంది మూర్ఖులు కాళేశ్వరం కూలేశ్వరమైందని అంటున్నారని దుయ్యబట్టారు. 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జల అక్షయపాత్ర కాళేశ్వరమని తెలిపారు. సముద్ర మట్టం నుంచి 80 మీటర్ల నుంచి 618 మీటర్ల పైకి తీసుకపోయే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరమని, కాళేశ్వరం అంటే మూడు బరాజ్‌లు, 19 రిజర్వాయర్లు, 21 పంపు హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 141 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం అని వివరించారు. 371 పిల్లర్లు ఉండే మూడు బరాజుల్లో రెండు పిల్లర్లకు నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్టు కూలిపోయింది, వృథా అయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు జల అక్షయపాత్ర అయిన కాళేశ్వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 140 మెగావాట్ల బాహుబలి పంపులు గర్జించి కృష్ణ, గోదావరి నీళ్లను ఎత్తిపోసి మన బీడు భూములకు మళ్లిస్తున్నాయన్నారు. దక్షిణ తెలంగాణకు వరప్రదాయని అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90 శాతం పూర్తిచేశామని, మిగిలిన 10 శాతం పనులు చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ఆపేసిందని మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు 11 విడుతలుగా రూ. 73 వేల కోట్ల రైతుబంధు వేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
2014లో భూముల విలువ 2023 నాటికి పది రెట్లు పెరిగిందని కేటీఆర్ వివరించారు. బతుకుతెరువు కోసం ఒకనాడు తెలంగాణ బిడ్డలు వలసలు పోతే ఇవ్వాళ బీహార్, జార్ఖండ్, ఒడిశా తదితర 18 రాష్ర్టాల నుంచి వ్యవసాయ కూలీలు వచ్చి తెలంగాణ పొలాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ‘పల్లెల్లో హార్వెస్టర్లు సందడి చేస్తే సిటీలో ఇన్వెస్టర్ల సందడి. గ్రామాల్లో మడి పచ్చగా కళకళలాడుతుంటే పట్టణాల్లో పెట్టుబడి తళతళలాడింది’ అని పేర్కొన్నారు. మూడు శాతం కంటే తకువ జనాభా ఉన్న తెలంగాణ ప్రతి సంవత్సరం 30 శాతం కంటే ఎకువ కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుందని గుర్తుచేశారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా టీఎస్ ఐ-పాస్ విధానంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ ద్వితీయ రాజధానిగా మారిందన్నారు.
టీఎస్ ఐపాస్ విధానంతో 27 వేల పైచిలుకు పరిశ్రమలకు బీఆర్ఎస్ హయాంలో అనుమతులు ఇచ్చామని చెప్పారు. గూగుల్, అమెజాన్, ఊబర్, సేల్స్ ఫోర్స్, ఆపిల్ కంపెనీలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాదులో ఏర్పాటు చేసేలా చేశామని పేర్కొన్నారు. హైదరాబాదులో ఉన్నానా? న్యూయార్లో ఉన్నానా? అని సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆశ్చర్యపోయిన సందర్భాన్ని గుర్తుచేశారు. తెలంగాణకు మాత్రమే కాకుండా దేశానికే హైదరాబాద్ గుండెకాయ లాంటిదని, అలాంటి హైదరాబాద్‌ను అల్లర్లు, అలజడులు లేకుండా చేశామని పేర్కొన్నారు. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్‌ను లివబుల్, మోస్ట్ లవబుల్, సేఫ్ సిటీగా తీర్చిదిద్దామని తెలిపారు. పదేండ్ల కాలంలో రెండు లక్షల 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు అవకాశం కల్పించామని గుర్తుచేశారు. కిటెక్స్ అనే కంపెనీ కేరళలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని భావిస్తున్న విషయం తెలిసి దాన్ని తెలంగాణకు రప్పించామని చెప్పారు.
అమెరికాలో మన విద్యార్థులకు వస్తున్న ఇబ్బందులను తొలగించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ప్రకటించారు. ‘అవసరమైతే లీగల్ సెల్ ఏర్పాటు చేసి కేసీఆర్ దూతగా విద్యార్థులకు అండగా నిలబడుతం’ అని హామీ ఇచ్చారు. విజ్ఞాన ఆధారిత సమాజాలే ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అంతగా భయపడాల్సిన అవసరంలేదని, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను అలవాటు చేసుకొని అందుకు దీటుగా తయారై రాటుదేలాలని సూచించారు.
14 ఏండ్ల అలుపెరగని పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రం, ఉద్యమ రథసారథి కేసీఆర్ పాలనలో కేవలం పదేండ్లలోనే దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా ఎదిగింది. భారతదేశ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టార్టప్ స్టేట్‌గా నిలిచింది. తెలంగాణను అద్భుత అవకాశాల అక్షయపాత్రగా, ఇండియాకే ఎకనామిక్ ఇంజిన్‌గా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌కే దక్కింది.
-కేటీఆర్