ఈ రోజు గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు.. నెర్రెలు బారిన తెలంగాణ నేలను గోదావరి జలాలతో పునీతం చేయాలనే దృఢ సంకల్పంతో కృషిచేసిన ఆర్ విద్యాసాగర్‌రావు, జయశం కర్ సార్.. అద్భుతమైన ప్రాజెక్ట్ రూపకల్పనలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, కార్మికులు. ఓడిపోయింది మాత్రం దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్. గోదావరి ఈ నేలపై పారుతున్నంత కాలం, తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్, కాళేశ్వరం గొప్పతనాన్ని ఎవరూ చెరుపలేరు. ఈ అంగుష్టమాత్రులెవరూ ఆ చరితను తాకలేరు.
– కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ‘అభాండాలు వేసి.. అబద్ధాల ప్రచారం చేసి.. కాళేశ్వరం కూలేశ్వరమైందని.. కుంగిందని.. కూలిందని కేసీఆర్‌పై కక్ష గట్టి మూడేండ్లుగా నిర్లజ్జగా దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పిట్టల దొరల, రాజకీయ రాబందుల చెంప చెల్లు మనిపించేలా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు చెప్పింది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వ్యాఖ్యానించారు. ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ వేసింది ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికీ ట్రాష్ కమిషన్నని హైకోర్టు తీర్పుతో తేలిపోయింది. అది అబద్ధాల పునాదులపై గాంధీభవన్‌లో పీసీసీ రూపొందించిన నివేదికంటూ బీఆర్ఎస్ చెప్తున్నదే నిజమైంది. నిజం నిటారుగా కాలర్ ఎగరేసి నిలబడింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి బీఆర్ఎస్ పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడుతున్న కార్యకర్తలకు, కేసీఆర్‌పై సర్కార్ పెట్టిన కేసులకు వ్యతిరేకంగా నిబద్ధతతో పనిచేస్తున్న పార్టీ లీగల్ సెల్ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ‘నిజం నిలకడ మీద తేలుతుంది. నిజం గడప దాటేలోగా అబద్ధం అంగీలాగు వేసుకొని ప్రపంచమంతా తిరిగొస్తుందనే నానుడి మరోసారి నిజమైంది. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ఘోరాతిఘోరంగా గోబెల్స్‌ను మించిపోయి చేసిన ప్రచారం పటాపంచలైంది. అబద్ధాలతో అద్భుతాలను ఎక్కువకాలం దాచలేరు.
కాళేశ్వరం మహత్యాన్ని కనిపించకుండా చేయలేరు. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ.. ఆయుష్షు తక్కువ’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీని తీసుకొచ్చి, ఆ బరాజ్ మీద నిలబెట్టి, చిన్నపర్రెను చూపెట్టి కాళేశ్వరం కొట్టుకుపోయిందంటూ కాంగ్రెస్ చేసిన చిల్లర ప్రచారం కొట్టుడుపోయిందని, అంతిమ విజయం సత్యానిదేనని రుజువైందని స్పష్టంచేశారు. గోబెల్స్‌ను మించి దుష్ప్రచారం చేసిన ధూర్తుల గూబగుయ్యి మనిపించే తీర్పును హైకోర్టు ధర్మాసనం వెలువరించిందని పునరుద్ఘాటించారు. ‘ఈ రోజు గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు. నెర్రెలుబారిన తెలంగాణ నేలను గోదావరి జలాలతో పునీతం చేయాలనే దృఢసంకల్పంతో కృషిచేసిన విద్యాసాగర్‌రావు, జయశంకర్‌సార్. అద్భుతమైన ప్రాజెక్ట్ రూపకల్పనలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, కార్మికులు. ఓడిపోయింది మాత్రం దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
ఈ రోజు గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు.. నెర్రలుబారిన తెలంగాణ నేలను గోదావరి జలాలతో పునీతం చేయాలనే దృఢ సంకల్పంతో కృషిచేసిన ఆర్ విద్యాసాగర్‌రావు, జయశం కర్ సార్.. అద్భుతమైన ప్రాజెక్ట్ రూపకల్పనలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, కార్మికులు. కానీ, ఓడిపోయింది మాత్రం దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్.
– కేటీఆర్
హైకోర్టు తీర్పుతో కూలిపోయింది కాళేశ్వరం కాదని, కేసీఆర్‌పై మూడేండ్లుగా చేసిన కుట్రలని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్‌పై చేసిన అబద్ధాల ప్రచారాలన్నీ గోదావరిలో కొట్టుకుపోయాయని కుండబద్ధలు కొట్టారు. ‘కొన్నిరోజులు కొంతమందిని మోసం చేయొచ్చు.. అన్నిరోజులు అందరినీ మోసం చేయలేమనే నానుడి నిజమైంది.. కేసీఆర్, బీఆర్ఎస్పై బురదజల్లిన వ్యవహారాలన్నీ తేలిపోయి నిప్పులాంటి నిజం బయటికి వచ్చింది’ అని చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసేవారు ఎంతటివారైనా ఊరుకోబోమనే విషయం హైకోర్టు తీర్పుతో రూఢీ అయిందని వ్యాఖ్యానించారు. ‘రేవంత్‌రెడ్డి ఎవరిని తెచ్చి వాదింపజేసినా, ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, అబద్ధాన్ని నిజంగా నమ్మించే యత్నం చేసినా.. తెలంగాణలో పారుతున్న ప్రతి నీటిబొట్టూ కేసీఆర్ గొప్పదనానికి సాక్ష్యం. పండుతున్న ప్రతిపంటా ఆయన అకుంఠిత దీక్షతో చేసిన కృషికి నిదర్శనం. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం అజరామరం. గోదావరి ఈ నేలపై పారుతున్నంత కాలం, తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్, కాళేశ్వరం గొప్పతనాన్ని ఎవరూ చెరపలేరు. ఈ అంగుష్టమాత్రులెవరూ తాకలేరు’ అని కేటీఆర్ కుండబద్ధలుకొట్టారు.

హైకోర్టు తీర్పు తర్వాత తెలంగాణభవన్‌లో స్వీట్లు తినిపించుకుంటున్న కేటీఆర్, ఎంపీ వద్దిరాజు. చిత్రంలో నేతలు కాలేరు, పొన్నాల, సంజయ్, కవిత, గెల్లు తదితరులు
కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ వేసింది ఘోష్ కమిషన్ కాదని, పీసీసీ నివేదిక అంటూ తాము మొదటినుంచీ చెప్తున్నదే నిజమైందని కేటీఆర్ పేర్కొన్నారు. గోదావరిలో కనీవిని ఎరుగని రీతిలో 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా మేడిగడ్డ నిటారుగా నిలబడిందని గుర్తుచేశారు. కానీ, కాళేశ్వరం కూలేశ్వరమైందని, రూ.లక్ష కోట్లు కొట్టుకొనిపోయాయని కాంగ్రెస్, బీజేపీ నేతలతోపాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా పార్లమెంట్లో సిగ్గువిడిచి నోటికొచ్చినట్టు మాట్లాడారని ధ్వజమెత్తారు. అరువై ఏండ్లుగా తెలంగాణకు నీరివ్వకుండా ఏడిపించిన, రైతులను అరిగోసపెట్టిన రాబందులకు ఈ తీర్పుతో జ్ఞానోదయంకావాలని అన్నారు. ‘తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం వరం.. తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ శనేశ్వరం’ అంటూ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు రూ.94 వేల కోట్లు అయితే, రాహుల్‌గాంధీ అనే తెలివిలేని దద్దమ్మ, మరో తెలివిలేని దద్దమ్మ కలిసి రూ.లక్ష కోట్ల కుంభకోణమంటూ నోటికొచ్చినట్టు ప్రచారం చేశారని మండిపడ్డారు.
కాళేశ్వరంలోని 100 కంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. మేడిగడ్డకు పెట్టిన ఖర్చు రూ.3,800 కోట్లు. మొత్తం 85 పియర్స్ ఉంటే రెండు మాత్రమే కుంగాయి. వాస్తవానికి, ఆ రెండు కూడా కుంగలేదు. దుష్ప్రచారం చేసిన దుర్మార్గులే ఏదో చేసి ఉంటారు. భవిష్యత్తులో ఈ విషయం కూడా తేలిపోతుంది.
-కేటీఆర్
‘కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు. 80 మీటర్ల కింది నుంచి 618 మీటర్ల ఎత్తుకు దశల వారీగా నీటిని లిఫ్ట్ చేసే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మూడు బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 303 కిలోమీటర్ల సొరంగమార్గం, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్మైన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కలిగిన ప్రాజెక్ట్’ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రాజెక్ట్‌లోని 100 కంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని, ఇందుకు పెట్టిన ఖర్చు రూ.3,800 కోట్లు అని, మొత్తం 85 పియర్స్ ఉంటే కేవలం రెండుపిల్లర్లు కుంగాయని గుర్తుచేశారు. వాస్తవానికి, ఆ రెండు పియర్స్ కూడా కుంగలేదని, దుష్ప్రచారం చేసిన దుర్మార్గులే ఏదో చేసి ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు. భవిష్యత్తులో ఈ విషయం కూడా తేలిపోతుందని పేర్కొన్నారు. కుంగిన పిల్లర్లకు వెంటనే సొంత ఖర్చులతో మరమ్మతు చేసేందుకు ఎల్అండ్టీ ముందుకొచ్చిందని గుర్తుచేశారు. మూడు, నాలుగువందల కోట్లు వెచ్చించేందుకు ఒప్పుకొన్నదని తెలిపారు. కానీ వారిని బెదిరించి, కంపెనీ సీఎఫ్‌వోను జైళ్లో పెడుతానని దబాయించి, ఆఖరికి మెట్రో నుంచి పారిపోయేట్టు చేసిందీ, కాళేశ్వరంపై కుట్రలు చేసిందీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొలిటికల్ మైలేజీ కోసం దారుణమైన దుష్ప్రచారంతో బీఆర్ఎస్ను, కాళేశ్వరాన్ని డ్యామేజ్ చేశారని విమర్శించారు. కసబ్ ఉగ్రవాది.. రేవంత్ దొంగ అనేది కఠోర వాస్తవమని వ్యాఖ్యానించారు.

హైకోర్టు తీర్పు అనంతరం బీఆర్ఎస్ న్యాయవాదుల బృందంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ గద్దెనెక్కినప్పటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి రెండేండ్లుగా డైవర్షన్ డ్రామాలు చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. విద్యుత్తుపై కమిషన్ వేసి ఏం ఉద్ధరించారో, ఎన్ని అక్రమాలు వెలికితీశారో అర్థంకావడంలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ సంగతి కూడా తేలిపోయిందని పేర్కొన్నారు. నిజం నిలకడ మీదనే తేలుతుందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదని, ఏటిగడ్డ అని, ఆ ప్రాజెక్టే తెలంగాణ ప్రజలకు కల్పతరువని స్పష్టంచేశారు. అందుకే కరువు రాబోతున్నదనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ముఖ్యమంత్రి మేడిగడ్డకు పరుగెత్తుకుంటూ వెళ్లారని ఎద్దేవా చేశారు. ఆ ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్‌కు తీసుకొస్తానని చెప్తున్నది రేవంత్‌రెడ్డేనని గుర్తుచేశారు. అక్కడి నుంచే ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు బస్వాపూర్, గంధమల్ల నుంచే నీళ్లు వెళ్తాయని స్పష్టంచేశారు. ఒకవైపు, కాళేశ్వరం కంపోనెంట్లను వాడుకొంటూనే కూలిపోయిందని దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని ఖండించారు.
తెలంగాణలో పారుతున్న ప్రతి నీటిబొట్టూ కేసీఆర్ గొప్పతనానికి సాక్ష్యం. పండుతున్న ప్రతి పంటా ఆయన అకుంఠిత దీక్షతో చేసిన కృషికి నిదర్శనం. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం అజరామరం. గోదావరి ఈ నేలపై పారుతున్నంత కాలం, తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్, కాళేశ్వరం గొప్పతనాన్ని ఎవరూ చెరుపలేరు. ఈ అంగుష్టమాత్రులెవరూ ఆ చరితను తాకలేరు.
2014లో కేసీఆర్ రాకముందు పండిన వరి ఎంత? ఈ రోజు పండుతున్నదెంత? ఆనాడు సాగు విస్తీర్ణమెంత? ఈరోజు ఎంత? రైతులు ఆలోచన చేయాలని విజ్ఞప్తిచేశారు. ‘నాడు 24 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, బీఆర్ఎస్ దిగిపోయే నాడు కోటిన్నర కోట్ల టన్నుల ధాన్యం సేకరించింది వాస్తవంకాదా? నాడు సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాలు ఉంటే, 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరుగలేదా? ఇది కేసీఆర్ కాళేశ్వరం ఘనత కాదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం పనికిరాదని చెప్తున్నవారే, తమ్మిడిహట్ట్టి నుం చి సుందిళ్లకు నీరు ఎత్తిపోస్తామని వింతగా మాట్లాడుతున్నారని దెప్పిపొడిచారు. ‘ కాంగ్రె స్ పెద్దలు ఒకవైపు కూలిపోయిందంటరు.. మరోవైపు మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీ లు తెస్తామని రూ.10 వేల కోట్లతో పనులు మొదలుపెడుతున్నరు. కాళేశ్వరం గొప్పతనం అర్థమయ్యే గంధమళ్లకు కొబ్బరికాయ కొట్టార’ని చురకలంటించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియడంలేదని విమర్శించారు.