హైదరాబాద్: రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు అక్రమార్కులతో చేతులు కలిపి ఇసుక దందా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. దొరికినకాడికి దోచుకో, అందినంత దండుకో అన్నట్లుగా దందా నడుస్తున్నదని విమర్శించారు. అక్రమార్కులు, కాంగ్రెస్ గ్యాంగులు కలిసి సహజ వనరులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. చీకటి వాటాలు, సీక్రెట్ ఒప్పందాలు చేసుకుని యథేచ్ఛగా ఇసుకను, మట్టిని బుక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారని ఫైరయ్యారు. ఇది ఇసుకాసుర, బకాసుర, భస్మార రాజ్యమన్నారు. తెలంగాణలో ఇప్పుడిదే దందా నడుస్తున్నదని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.
‘దొరికినకాడికి దోచుకో.. అందినంత దండుకో !
తెలంగాణలో ఇప్పుడిదే దందా నడుస్తున్నది !
అక్రమార్కులు-కాంగ్రెస్ గ్యాంగ్‌లు చెట్టాపట్టాలేసుకొని సహజ వనరులను కొల్లగొడుతున్నారు..!
చీకటి వాటాలు.. సీక్రెట్ ఒప్పందాలు చేసుకొని యథేచ్ఛగా ఇసుకను మట్టిని బుక్కేస్తున్నారు..!
ప్రజా పాలనలో దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారు !
ఇసుకాసుర.. బకాసుర.. భస్మాసుర రాజ్యం ఇది..!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.