అధికార పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ప్రభుత్వ నిర్వాకం కారణంగా పల్లెల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు పల్లె జనులను ఆలోచింపజేసినట్టు ఎన్నికల ఫలితాలను చూస్తే తేటతెల్లమవుతున్నది. లోకల్‌బాడీ ఎన్నికలు ఆరంభం మాత్రమే.. ఈ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం సమీప భవిష్యత్తులో పాతాళానికి పడిపోవడం ఖాయం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఎన్నిక ఏదైనా గులాబీ జెండా ఎగరడం తథ్యం. -కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తేతెలంగాణ): పల్లెల నుంచే కాంగ్రెస్‌కు (Congress) కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే (Election Results) ఇందుకు నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ అరాచకాలు, హత్యారాజకీయాలకు ఎదురొడ్డి గెలిచిన గులాబీ సైనికులకు శుక్రవారం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ మద్దతుదారుల విజయానికి రాత్రింబవళ్లు శ్రమించిన శ్రేణులను హృదయపూర్వకంగా అభినందించారు. స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా, రేవంత్ సర్కారు పాలనా వైఫల్యాలను చూసి అధికార పార్టీ మద్దతుదారులకు ప్రజలు ఓటేయలేదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలే ఇందుకు సజీవసాక్ష్యమని పునరుద్ఘాటించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన పేరిట పంచాయతీ ఎన్నికల కోసం ప్రచారం చేసినా కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదని తెలిపారు. కాంగ్రెస్ మద్దతుదారులు పోటీ చేసిన చోట 44 శాతం సీట్లను ఆ పార్టీ కోల్పోవడం చూస్తే రేవంత్ పాలనపై ప్రజలు పూర్తిగా విసిగిపోయి ఉన్నారనే విషయం అర్థమవుతున్నదని పేర్కొన్నారు. వచ్చే మూడేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పల్లెల్లో పైసా అభివృద్ధి జరగదని గ్రామీణులు నిర్ధారణకు వచ్చారని, అందుకే అధికారపార్టీకి ఇంతటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే
తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని తొలి విడత పంచాయతీ ఫలితాలు కుండబద్దలు కొట్టాయని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదనే విషయం కూడా రూఢీ అయిందని తెలిపారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని దొడ్డిదారిలో గెలిచేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. అనేకచోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే పల్లెల నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభమైనట్లు స్పష్టంగా అర్థమవుతున్నదని పేర్కొన్నారు. యూరియా బస్తాల కోసం నెలల తరబడి పడిన అగచాట్లు, వడ్లకు రూ.500 బోనస్ పేరిట ఇచ్చిన బోగస్ హామీ, చివరికి పండించిన పంటను అమ్ముకోలేక పడ్డ కష్టాలను రైతులు గుర్తుపెట్టుకొన్నారనే విషయం లోకల్‌బాడీ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతున్నదని తెలిపారు.
భవిష్యత్తులో గులాబీ ప్రభంజనం ఖాయం
కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు ప్రగతి పథంలో సాగిన పల్లెల్లో రెండేండ్లుగా పాలనపడకేసిందని కేటీఆర్ విమర్శించారు. పంచాయతీలను పట్టించుకొనే నాథుల్లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం గాడి తప్పింది..చివరికి ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయించలేని దుస్థితి నెలకొన్నది. కరెంట్ బుగ్గలు కూడా పెట్టని దయనీయ పరిస్థితి ఏర్పడ్డది’ అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం సమీప భవిష్యత్తులో పాతాళానికి పడిపోవడం ఖాయమని చెప్పారు.
రెండేండ్లు గడిచినా ఆరు గ్యారెంటీల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసం..పింఛన్ల పెంపు పేరిట అవ్వాతాతలు, దివ్యాంగులకు చేసిన ద్రోహం.. ప్రతినెలా రూ. 2,500 ఇస్తానని మహిళలను నమ్మించిన వైనం.. ఆడబిడ్డల పెండ్లిండ్లకు తులం బంగారం పేరిట చేసిన ధోకాను గ్రామీణ ప్రజలు మరిచిపోలేదనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పినయ్. -కేటీఆర్