హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అసమర్థ, అవినీతి పాలనకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గే వంటి కాంగ్రెస్ అగ్రనేతలు డిక్లరేషన్ల పేరుతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెసోళ్లకు రానున్న ఉప ఎన్నికల్లో కర్రు కాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. 20 నెలల కాంగ్రెస్ మోసాన్ని చూసిన తర్వాత కూడా కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో ఆదివారం నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలు, యూసుఫ్‌గూడ డివిజన్ బూత్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌కు ప్రజలు ఇవ్వలేదని, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాగంటి గోపినాథ్ అన్ని స్థానాలను గెలిపించారని, అడ్డిమారు గుడ్డి దెబ్బలా గోషామహల్ సీటును బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు రేపే అన్నట్టుగా సీరియస్‌గా తీసుకొని గోపినాథ్‌కు కానుకగా, అశ్రునివాళిగా జూబ్లీహిల్స్ స్థానాన్ని తిరిగి గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో గుడిసెలు, రేకులు వేసుకున్న సుమారు లక్షమంది పేదలకు జీవో నంబర్ 58 ద్వారా పట్టాలు ఇచ్చి, వారి జీవితాలను నిలబెట్టిన నాయకుడు మన కేసీఆర్ అని కేటీఆర్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను అగ్రగామి నగరంగా తీర్చిదిద్దిందని చెప్పారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి అనేక సంక్షేమ పథకాలను అందించినట్టు తెలిపారు. కేసీఆర్ ఎప్పుడూ మతం పేరుతో రాజకీయాలు చేయలేదని, అందుకే పదేండ్ల్లలో హిందూ..ముస్లిం, అంధ్రా తెలంగాణ గొడవలు జరగలేదని అన్నారు.
హైదరాబాద్‌లో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదవాడు ప్రభుత్వ స్థలంలో చిన్నగూడు కట్టుకుంటే దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని, కానీ, ధనికుల ఇండ్లకు మాత్రం హైడ్రా పోవడం లేదని విమర్శించారు. ‘రెడ్డికుంటలో కట్టిన రేవంత్‌రెడ్డి ఇల్లును కూల్చరు. దుర్గంచెరువు ఎఫ్టీఎల్ లోపల కట్టిన సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి ఇంటి జోలికి హైడ్రా వెళ్లదు. చెరువు బఫర్‌లో కట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు ఇండ్లను ముట్టకోరు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదవాళ్ల ఇండ్లను మాత్రం ఎలాంటి నోటీసులు లేకుండా సెలవు దినాల్లో కూల్చి వేస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లిలో ఇల్లు కూలుస్తారని భయంతో ఒక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తడా?’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.2,500 ఇవ్వలేని రేవంత్‌రెడ్డి కోటిమంది మహిళలను కోటేశ్వరులను చేస్తామనడం పెద్ద బోగస్ అని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ బంగారం కాదు కదా, రోల్‌గోల్డ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ‘స్కూటీలు అన్నరు.. తులం బంగారం అన్నరు.. 2,500 ఇస్తమన్నరు. కానీ, ఇప్పుడు కనీసం కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదు’ అని మండిపడ్డారు.
కరోనా వచ్చినప్పుడు రూపాయి ఆదాయం లేకపోయినా బీఆర్ఎస్ సర్కారు పెన్షన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపాడుతున్నదని, అందుకే మోదీ ఇప్పటివరకు ఒక కేసు కూడా పెట్టలేదని విమర్శించారు. ఈ రెండు పార్టీల ఏకైక అజెండా తెలంగాణ పార్టీని ఓడించడమేనని అన్నారు. తమ పాలనలో జరుగుతున్న మోసాలు, కుంభకోణాలను ప్రజలు అంగీకరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ భావించి, అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిలిపివేస్తుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సేవలను కేటీఆర్ కొనియాడారు. ఆయన అకాల మరణం కారణంగా వచ్చిన ఉపఎన్నికను మనం సీరియస్‌గా తీసుకొని గెలుపు కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. మాగంటి గోపినాథ్‌కు నివాళిగా, మరోసారి జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగురవేద్దామని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త 100 ఓట్లకు ఒకరు, 25 ఇండ్లకు ఒకరు చొప్పున పనిచేసి, కేసీఆర్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలన మధ్య తేడాను ప్రజలకు వివరించాలని సూచించారు. కుల, మత సంఘాలు, ఎన్జీవోలు, రిటైర్డ్ ఉద్యోగులు, సినిమా కార్మికులను కలిసి మద్దతు కోరాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేత శ్రీ ధర్‌రెడ్డి, నాయకులు మాగంటి సునీత, రాజ్‌కుమార్ పటేల్, దినేశ్, అబ్దుల్లా సోహైల్, ఆజామ్, దేదీప్య, సంతోష్ పాల్గొన్నారు.
‘రామన్నా.. నీవే మాకు రక్ష.. మీ వల్లే మళ్లీ మన దేశానికి వచ్చాము. మా బిడ్డలను చూసుకుంటున్నాము. బీఆర్ఎస్, ఆ పార్టీ నేతలు లేకుంటే ఇంకా మస్కట్లోనే మగ్గిపోయేవాళ్లం’ అంటూ కన్నీంటి పర్యంతమయ్యారు రామగుండానికి చెందిన అఫ్రిన్. మాస్కట్కు బతుకుదెరువు కోసం వెళ్లిన ఆమె అక్కడే చిక్కుకుపోయింది. అధికార కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల నేతలతో తమ బాధలు చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆమె వాపోయింది.
కేటీఆర్ ఆదేశం, ఆ పార్టీ నేత హరీశ్‌రెడ్డి చొరవతో ఆఫ్రిన్ కుటుంబం మస్కట్ నుంచి ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నది. నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆమె జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ప్రారంభానికి ముందు తాను అనుభవించిన బాధలు, కేటీఆర్ ఆదుకున్న తీరును వివరించారు. తన ఇద్దరు బిడ్డలను చూస్తాననుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సోదరిని అన్నగా ఆదుకున్న కేటీఆర్‌కు రాఖీ కట్టి స్వీటు తినిపించి ఆనందబాష్పాలు రాల్చారు.