కేసీఆర్ దృఢ సంకల్పం, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తి.. జయశంకర్ సార్ మార్గదర్శనంలో సాగించిన అసమాన పోరాటం, అమరుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది. ఈ గడ్డపై ప్రజలందరూ ఆత్మగౌరవంతో బతికిండ్రు.. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మళ్లీ ఢిల్లీ పెత్తనం మొదలైంది.
-కేటీఆర్
తెలంగాణ కోసం ఓ పార్టీని పెట్టి..ప్రజల ఓట్లను ఆయుధంగా మలుచుకొని.. శూన్యం నుంచి సునామీని సృష్టించి.. లక్షలాది మంది అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ కలను సాకారం చేసిన కారణజన్ముడు కేసీఆర్. తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని ప్రజాకవి గోరటి వెంకన్న చెప్పిన మాటల్లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
-కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలం గాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఢిల్లీ పెత్తనం మొద లైందని, పరాయి పాలన పోయి కిరాయి పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. అతి చిన్న వయసున్న తెలంగాణ.. పదేండ్ల కేసీఆర్ ఏలుబడిలో అభివృద్ధి, సంక్షేమం, తలసరి ఆదాయం, వ్యవసాయ విస్తరణ, ఐటీ, పరి శ్రమలు, పల్లె, పట్టణ ప్రగతి ఇలా అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధించి దేశా నికే దీపస్తంభంలా నిలిచిందని గుర్తుచేశారు. ఉమ్మడి పాలనలో ధాన్యం ఉత్పత్తిలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ పంజాబ్, హర్యానాను తలదన్ని నంబర్ వన్ స్థానంలో నిలిచి ‘జై జవాన్..జై కిసాన్’ అనే నినాదాన్ని నిజం చేసిందని స్పష్టంచేశారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో రైతే రాజు అన్న స్ఫూర్తి పక్కకుపోయిందని వాపోయారు. ఇప్పుడు ఏ ఊరికెళ్లినా యూరియా కోసం బారెడు లైన్లు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
తలసరి ఆదాయం పడిపోతున్నదని, ఐటీ, ఇండస్ట్రీ రంగాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. భారతీయులందరికీ కేసీఆర్, బీఆర్ఎస్ తరఫున స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వేలాది మంది యోధులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేసీఆర్‌పై మహేంద్ర తోటకూరి రాసిన ప్రజాయోధుడు పుస్తకాన్ని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, రెడ్యానాయక్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తుల ఉమ తదితరులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అనేక ఆటుపోట్లు, రాజకీయ అవరోధాల మధ్య మీడియా, ధన, కండ బలం లేకున్నా గుండె బలంతో 47 ఏండ్ల వయస్సులోనే ‘ప్రత్యేక’ పోరాటానికి అంకుర్పారణ చేశారని చెప్పారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎంతమంది అవహేళన చేస్తున్నా కేసీఆర్ ఆత్మస్థయిర్యంతో అడుగు ముందుకేశారని చెప్పారు. 2001 కరీంనగర్ సింహగర్జన సభలో ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టిచంపండని పిలుపునిచ్చిన దమ్మున్నఏకైక నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు.
600 రోజుల హస్తం పార్టీ పాలనలో రాష్ట్రం ఐటీలో వెనుకబడ్డది..పరిశ్రమ రంగం దెబ్బతిన్నది..సాగు రంగం తిరోగమిస్తున్నది..సంక్షేమం చిక్కిపోయింది..అభివృద్ధి పక్కకు పోయింది..వెరసి పాత కాలం దాపురించింది. పదే పదే ఢిల్లీకి వెళ్తూ సంచులు అప్పజెప్పి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి తీరుతో తెలంగాణ ఆత్మగౌరవం మంట గలుస్తున్నది.
-కేటీఆర్
దేశంలోనే తొలిసారిగా, ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచిన గొప్పవ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను శాశ్వతంగా తుడిచిపెట్టిన గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. ‘తలసరి ఆదాయంలో దేశంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా? మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించి ఆరోగ్యరంగంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను మూడో స్థానానికి చేర్చింది కేసీఆర్ కాదా? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే అపనమ్మకాన్ని పోగొట్టి, ఆడబిడ్డలు సర్కారు దవాఖానల్లో కేసీఆర్ కిట్లను తీసుకొని పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది వాస్తవం కాదా? ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు పథకం తెచ్చి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు జమచేసింది నిజంకాదా? ’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ రాగానే తెలంగాణలో మళ్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం నడుస్తున్నదని కేటీఆర్ దుయ్యబట్టారు. చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సి వస్తున్నదని విమర్శించారు. 20 నెలల్లో 51 సార్లు ఢిల్లీకి వెళ్లిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కోల్పోయి మళ్లీ బానిసత్వంలోకి వెళ్తున్నదని వాపోయారు.
తెలంగాణను బాగుచేసి, సాగును సుసంపన్నం చేసి, కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టులను నిర్మించి కాంగ్రెస్‌కు అప్పజెప్తే దిక్కుమాలిన ఆలోచనలు, పనికిరాని విధానాలు, పనికిమాలిన పనులతో రాష్ర్టాన్ని దివాలా తీయిస్తున్నదని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇచ్చిన హామీలు అమలు చేయలేక..కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని బద్నాం చేస్తున్నరు.. కేంద్రం మాత్రం కేసీఆర్ పాలనలో తెచ్చిన అప్పులు రూ. 2.80 లక్షల కోట్లేనని పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టింది’ అని ఉద్ఘాటించారు. రేవంత్‌రెడ్డి ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టకున్నా, ఒక్క కొత్త రోడ్డు వేయకున్నా, ఒక్క ఎకరాకు నీళ్లివ్వకున్నా 20 నెలల్లో రూ. 2 లక్షల కోట్ల అప్పు లు తెచ్చి రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. అప్పులపై కాంగ్రెస్, బీజేపీ నేతల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
60 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ కోసం అనేకసార్లు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి చల్లారిపోయిందని కేటీఆర్ గుర్తుచేశారు. 1971లో తెలంగాణ ప్రజాసమితి నుంచి 11 మంది ఎంపీలు గెలిచి కాంగ్రెస్‌లో విలీనం కావడంతో స్వరాష్ట్ర ఆకాంక్ష సన్నగిల్లిందని చెప్పారు. 370 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలర్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక ఏనాటికీ తెలంగాణ రాదని ఇక్కడి ప్రజానీకంలో నిరాశా నిస్పృహలు అలుముకున్న వేళ కేసీఆర్ స్వరాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. టీడీపీ బలంగా ఉన్న వేళ, చంద్రబాబు చక్రం తిప్పిన సమయంలో కేసీఆర్ పార్టీని స్థాపించారని, ప్రాణాలకు తెగించి పోరాడి తెలంగాణను సాధించారని, తెచ్చిన రాష్ట్రాన్ని పాలనా చతురతతో చక్కదిద్దారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్థిత్వం ప్రశ్నార్థకమవుతున్నదని,ఇలాంటి పరిస్థితుల్లో స్వీయ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు.
కేసీఆర్ గురించి మహేంద్ర తోటకూరి అద్భుతంగా రాశారని కేటీఆర్ ప్రశంసించారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అంబేద్కర్ పుస్తకాన్ని తనకు గిఫ్ట్‌గా ఇచ్చారని..తెలంగాణ చరిత్ర, గొప్పతనం గురించి పుస్తకాలు దొరక్కపోవడంతోనే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చానని చెప్పిన విషయాన్ని ప్రస్తుతించారు. ‘పదేండ్ల పాలనలో ఎంతో కష్టపడ్డం.. మన శక్తియుక్తులన్నీ తెలంగాణ నిర్మాణంపై పెట్టినం..మనం చేసిన పోరాటాన్ని, తెలంగాణ గొప్పదనాన్ని చెప్పులేకపోయినం.. ఇప్పటికైనా కవులు, రచయితలు నడుంకట్టాలి.. తెలంగాణ చరిత్రను పుస్తకాలతో పాటు డిజిటల్ మాధ్యమాల్లో నిక్షిప్తం చేయాలి..సోషల్ మీడియాలోనూ విస్త్రృతంగా ప్రచారం చేయాలి’అని పిలుపునిచ్చారు. కేసీఆర్‌పై పుస్తకం రాసిన మహేంద్ర తోటకూరిని కేటీఆర్‌తో పాటు వినోద్‌కుమార్, రెడ్యానాయక్, మధుసూదనాచారి శాలువా కప్పి సత్కరించారు. కేసీఆర్‌పై పుస్తకం రాస్తానని ఇచ్చిన హామీ మేరకు మధుసూదనాచారి పుస్తకం రాయాలని కేటీఆర్ కోరారు.
2004లో అమెరికా నుంచి తిరిగొచ్చిన తాను జయంశంకర్, కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ గొప్పతనం గురించి తెలుసుకొన్నానని కేటీఆర్ చెప్పారు. సమైక్య పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాటంలో పాలుపంచుకున్నానని గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి పాలనలో పడావుపడ్డ తెలంగాణను పాలనాదక్షత, అకుంఠిత దీక్షతో కేసీఆర్ సుసంపన్నం చేశారని చెప్పారు. తెలంగాణవాళ్లకు పాలన చేతగాదని దెప్పిపొడిచిన వారికి దీటైన సమాధాన మిచ్చిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు. ఇదేమీ తెలియని కొందరు సన్నాసులు కేసీఆర్ తెలంగాణకు ఏమీ చేయలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు.
ఆయన ఏమీ చేయకుంటే తలసరి ఆదాయం, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ ఇలా అన్నిరంగాల్లో అగ్రగామిగా ఎలా నిలిచిందని ప్రశ్నించారు. 79 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేసీఆర్‌లా పాలించిన నాయకుడు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ‘ఉద్యమ నేత మంచి పాలన దక్షుడు కావడం ఎక్కడా చూడలేదు. కానీ మీకు కేసీఆర్ రూపంలో మంచి పాలకుడు దొరికారు అని అప్పటి బీజేపీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు’ అని, తెలంగాణ సిద్ధించిన తర్వాత నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన సందర్భంలో ‘చంద్రశేఖర్’ అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారని గుర్తుచేశారు.