హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మహిళా రైతు బర్రెల కోసం తీసుకున్న బ్యాంకు రుణం చెల్లించలేదంటూ వారి ఇంటి గేటును తీసుకెళ్తారా? ఇంత దారుణమా? అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పు కింద ఆడబిడ్డల పుస్తెలతాళ్లను కూడా జమచేయించిన దుష్టచరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. ఆ దరిద్రపు ఆనవాయితీనే రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని విమర్శించారు.
బ్యాంక్ లోన్ కట్టలేదని జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన పాడి రైతు ప్రేమలత ఇంటి గేటును బ్యాంకు సిబ్బంది ఎత్తుకుపోవడంపై గురువారం ఒక ప్రకటనలో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమైక్యరాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులు ఎంతటి అరిగోస పడ్డరో, అలాంటి పరిస్థితే మళ్లీ తెలంగాణలో దాపురించిందని విమర్శించారు. ఒకనాటి కాంగ్రెస్ పాలనలో రైతులు అప్పులు కట్టకపోతే ఇండ్ల దర్వాజలు, కరెంటు మోటర్లు, స్టార్టర్లను అధికారులు ఎత్తుకుపోయేవారని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులను కడుపులో పెట్టుకుని సాదుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. లోన్ కట్టకపోతే ఇంటి గేటును తీసుకురావాలని చెప్పిన అధికారులకు, దొంగలకు పెద్ద తేడా లేదని మండిపడ్డారు. పేదలపై చూపిస్తున్న ఈ ప్రతాపాన్ని పెద్దలపై చూపించగలరా? అని ప్రశ్నించారు. బడాబాబులకు కోట్ల రూపాయల రుణాలను రైట్ఆఫ్ (మాఫీ) చేస్తున్న బ్యాంకులు.. పేదల విషయంలో మాత్రం వడ్డీ వ్యాపారుల్లాగా వారి రక్తం తాగుతున్నాయని ఆరోపించారు.
పరిస్థితుల ప్రభావంతోనే రైతులు లోన్లు కట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి మాత్రం పదవిని కాపాడుకోవడానికి అడ్డమైన పనులు చేస్తున్నారని విమర్శించారు. రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీదనే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తమను పీకుతింటున్న కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకరాలను రైతులు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులను తమ ఇంటి గేటు కూడా తొకనీయరని తెలిపారు.