KTR | హైదరాబాద్, జనవరి 17 (నమస్తేతెలంగాణ):ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. రేవంత్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల దోపిడీముఠా రాష్ట్రంలో భూదందాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. రేవంత్ సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డితోపాటు వేం నరేందర్‌రెడ్డి, ఫహీం ఖురేషీ, ఏవీరెడ్డి, రోహిన్‌రెడ్డితో కూడిన అలీబాబా అరడజన్ దొంగల గ్యాంగ్ రాష్ట్రంలో సంచరిస్తూ అనేక దురాగతాలకు దిగుతున్నదని మండిపడ్డారు.
శుక్రవారం షాబాద్‌లో నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. రేవంత్ గ్యాంగ్ బ్లాక్మెయిల్ వ్యవహారాలను తప్పుదోవ పట్టించేందుకే రోజుకో డ్రామా తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. మొదట హైడ్రా, తర్వాత మూసీ, ఆ తర్వాత అల్లు అర్జున్‌పై కేసు, ఆ తర్వాత ఫార్ములా-ఈ రేసు కేసు.. ఇలా పూటకో నాటకమాడుతున్నారని దుయ్యబట్టారు.
రేవంత్ అక్రమ వ్యవహారాలు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలకు తెలిసినా పట్టించుకోవడంలేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కంటే ముందు ఆరు గ్యారెంటీల పేరిట అబద్ధాలు చెప్పిన రాహుల్‌గాంధీ, సోనియాగాంధీని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కాదని, బీఆర్ఎస్ఎస్ అని ముఖ్యమంత్రి ఢిల్లీలో వ్యాఖ్యానించారంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ.. హేగ్డేవార్ గురించి గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి నిఖాైర్సెన ఆరెస్సెస్ వాది అని చెప్పారు. ఆయన వేసుకున్న నెక్కర్ కూడా ఖాకీదేనని, ఈ విషయం అసదుద్దీన్ ఒవైసీ కూడా చెప్పారని గుర్తుచేశారు.
హైదరాబాద్ నగర ఖ్యాతిని పెంచేందుకే ఫార్ములా-ఈ రేసును తీసుకొచ్చానని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకొని, ఎఫ్ఈవో కంపెనీకి రూ.55 కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ వ్యవహారంలో అవినీతి ఎంతమాత్రంలేదని పునరుద్ఘాటించారు. ఏవైనా ప్రొసీజర్ ల్యాప్స్ ఉంటే ఉండొచ్చని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ నగదును ఎందుకు వెనక్కి తీసుకొనిరాలేదని ప్రశ్నించారు. తనపై ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేసిందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని తనపై ఏసీబీ, ఈడీ కేసులు పెట్టించాయని ఆరోపించారు. తాను ఏసీబీ, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు నిర్భయంగా, నిస్సంకొంచంగా సమాధానాలు చెప్పానని వెల్లడించారు.