హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ): ‘ఒకే దేశం.. ఒకే పన్ను.. ఒకే దేశం.. ఒకే ఎన్నిక..’ ఇలా అనేక అంశాల్లో ఏకరూపతను కోరుకునే బీజేపీ.. పోక్సో కేసు విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. పోక్సో కేసు నమోదైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్, హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.
ఈ మేరకు ఆంగ్ల పత్రికల్లో వచ్చిన కథనాలను తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. వన్ నేషన్-వన్ ట్యాక్స్ అంటూ ఊదరగొట్టే కాషాయ పార్టీ పోక్సో కేసు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కొడుకుకు ఒక న్యాయం? సామాన్యుడికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు.