KTR | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా 13 నెలల్లో 400 మందికిపైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయకపోవడం, రైతుభరోసా ఇవ్వకపోవడం నిరాశ, నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక రైతు బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం.. రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితికి నిదర్శనమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సంఘటన తాము అధ్యయన కమిటీ వేయడానికి పురిగొల్పిందని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం మంచిరేవులలోని మాజీ మంత్రి, అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాసంలో బుధవారం కమిటీ తొలి సమావేశమైన తరువాత కమిటీ సభ్యులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశం మేరకు ఏర్పాటైన ఈ కమిటీ శుక్రవారం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పని ప్రారంభిస్తుందని చెప్పారు. నెలరోజులపాటు అన్ని జిల్లాల్లో అన్ని వర్గాలను కలుస్తుందని, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటుందని, వారిలో భరోసా నింపుతుందని వివరించారు.
రాష్ట్రంలో 2023 డిసెంబర్ వరకు ఉన్న పరిస్థితులను, 13 నెలల కాలంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తుందని వెల్లడించారు. తుది నివేదిక పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందజేస్తామని, క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై పలు సూచనలు చేస్తామని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలపై వేసిన తమ కమిటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవని, రైతాంగానికి అండగా నిలబడాలనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదని స్పష్టంచేశారు. ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది? ఏం చేస్తే బాగుంటుంది? అని నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు.
రైతుల పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమ, ఆర్తి ప్రస్తుత పాలకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న పెద్దల మాటను వందకు వంద శాతం నమ్మి అందుకు తగ్గట్టుగానే 65% మంది ప్రజలు ప్రత్యక్షంగా ఆధారపడిన వ్యవసాయరంగ సంక్షేమానికి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలను అమలుచేశారని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసిందని చెప్పారు.
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, భూమి శిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేసిందని గుర్తుచేశారు. సాగునీటి పథకాలు కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులను నిర్మించారని చెప్పారు. రైతుబంధు, రుణమాఫీ పేరుతో లక్ష కోట్లు నేరుగా 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో కేసీఆర్ ఒకరేనని ప్రశంసించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల్లో ఆత్మవిశ్వాసం అపారంగా ఉం డేదని తెలిపారు.
స్వతంత్ర భారత చరిత్రలో ఎవరూ చేయని విప్లవాత్మక పనులను రైతుల కోసం కేసీఆర్ చేశారని చెప్పారు. రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రశంసించిందని గుర్తుచేశారు. రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి అధికారం అప్పగిస్తే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ సర్కారు దారుణంగా విఫలమైందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌కు రైతుల పట్ల ఉండే ఆవేదన, ఆర్తి ఈ రాష్ట్ర పాలకులకు లేదని దుయ్యబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి మొదలైన గ్రామసభల్లో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని కేటీఆర్ చెప్పారు. గ్రామసభల్లో ప్రజలు మర్లబడుతున్నరని, టెంట్లు కూలగొడుతున్నరని, రేపు ఇదే తీరుగా కొనసాగితే ఏదో దశలో ప్రజలు ప్రభుత్వాన్ని తిరస్కరిస్తరని హెచ్చరించారు. రాష్ట్రమంతా వెల్లువెత్తుతున్న ఆందోళల్లో ఎకడా తమ పార్టీ నేతలు లేరని, ప్రజలే స్వచ్ఛందంగా నిలదీస్తున్నారని తెలిపారు. రుణమాఫీ, రైతుబంధు గురించి గ్రామసభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని ఎద్దేవా చేశారు.
నేతలు ఇచ్చిన హామీలకు అధికారులు బలవుతున్నారని, సీఎం విదేశాల్లో, మంత్రులు రాహుల్ టూర్లో తరిస్తున్నారని మండిపడ్డారు. ‘అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరిట కోటీ ఆరు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నరు?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వివరించారు. ఎవరి తప్పు ఇది? ఆ దరఖాస్తులు ఎకడ? ఉన్నాయని నిలదీశారు. ప్రభుత్వం పరిపాలనలో నిమగ్నం కావాలని, ఇతర కార్యక్రమాలు బంద్ చేయాలని హితవుపలికారు.
ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందన్న అపోహలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. తమ హయాంలో 6.47 లక్షల పైచిలుకు రేషన్‌కార్డులను మీ-సేవ కేంద్రాల ద్వారా ఇచ్చామని చెప్పారు. హోంశాఖ మంత్రి లేకపోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పడకేశాయని కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలను పరిషరించకుండా ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు బనాయించడం, సోషల్‌మీడియా పోస్టులకు భయపడి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఫార్ములా కేసైతే, తమ ప్రాధాన్యం ఫార్మర్ అని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 13 నెలల పాలన తిరోగమనం దిశగా వెళ్తున్నదని, తెలంగాణ రైతాంగం సంక్షోభంలోకి నెట్టబడిందని రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కమిటీ తొలి సమావేశంలో రైతు ఆత్మహత్యలు, రైతుభరోసా, రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిన దగా, సాగునీటి కష్టాలు, రైతులు ఎదురొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించినట్టు తెలిపారు.
ప్రభుత్వానికి ఇచ్చే సూచనలపై చర్చించామని, వ్యవసాయ కమిషన్‌కు కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పారు. రైతుల సమస్యలపై చిత్తశుద్ధితో అధ్యయనం చేయాలని నిర్ణయించామని, నివేదిక తయారుచేసి జాతీయ స్థాయికి తీసుకువెళ్తామని వెల్లడించారు. సమావేశంలో కమిటీ సభ్యులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్ధన్, అంజయ్యయాదవ్, రసమయి బాలకిషన్, యాదవరెడ్డి, కోటిరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ రాష్ట్రమంతటా విసృ్తతంగా రాబోయే నెలరోజులపాటు పర్యటిస్తుంది. రైతు సంఘాలు, రైతులతో ఎకడికకడ కలుస్తారు. రుణమాఫీ ఎంత మేరకు జరిగింది? కరెంటు సరఫరా ఎలా ఉన్నది? సాగు పరిస్థితి ఎలా ఉన్నది? మద్దతు ధర దొరకుతున్నదా? బోనస్ ఏమైంది? కొనుగోలు కేంద్రాలు ఏమయ్యాయి? రైతు వేదికలు పనిచేస్తున్నాయా? వంటి అంశాలను కమిటీ సభ్యులు అధ్యయనం చేస్తారు. రైతుల్లో భరోసా నింపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఒక మంచి ఆలోచనతో, రైతాంగానికి అండగా నిలబడే ఉద్దేశం మాది.
-కేటీఆర్
సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ నేతలతో పెద్ద ఎత్తున ధర్నా చేయవచ్చు.. కానీ, తాము మాత్రం నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్ వద్ద రైతు సమస్యలపై ధర్నా చేయవద్దా? అని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్‌వారు చేస్తే ట్రాఫిక్ స్తంభించదు.. బీఆర్ఎస్ చేస్తే ట్రాఫిక్ స్తంభిస్తదా? అని ప్రశ్నించారు. నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని, ఈ నెల 28న 11 గంటల నుంచి 2 గంటల వరకు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చిందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నదని, నిరసన తెలువచ్చని ప్రకటించిన అని సీఎం రేవంత్‌రెడ్డి.. చిన్న ధర్నాకే ఆగమాగం అయిపోయి.. చివరికి అనుమతి నిరాకరించారని ఎద్దేవా చేశారు. చివరకు హైకోర్టు న్యాయం చేసిందని, రైతు మహాధర్నాకు అనుమతి ఇచ్చినందుకు హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుని రైతుల ఆవేదన, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టంచేశారు.