రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం నెలకొన్నది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తరు. వచ్చే వారం పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయం.
-కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి, అన్ని పట్టణాలపై గులాబీ జెండా ఎగరేయాలని గులాబీ శ్రేణులకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు, మున్సిపల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని, ఇచ్చిన హామీల అమల్లో విఫలమై మోసం చేసిన తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం నెలకొన్నదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడి పనిచేస్తేనే భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని సూచించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాలు నిలువలేకపోయాయని, అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ కేవలం ఏడెనిమిది స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తుచేశారు.
సమన్వయం కీలకం
ఎన్నికల వ్యూహంలో సమన్వయం అత్యంత కీలకమని కేటీఆర్ చెప్పారు. చాలాచోట్ల పార్టీ విజ్ఞప్తిని మన్నించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను సాదరంగా ఆహ్వానించాలని కోరారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి త్యాగం చేసిన ప్రతి నాయకుడి ఇంటికీ అభ్యర్థులు స్వయంగా వెళ్లి, వారిని ప్రచారంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. వారికి తగిన గౌరవం ఇచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన బాధ్యత మున్సిపల్ సమన్వయకర్తలపై ఉన్నదని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను వెంట వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు.
ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలి
ఎన్నికల పోరులో చివరి ఘట్టమైన ప్రచారంపై దృష్టి సారిస్తూ, ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయావకాశాలను అంచనా వేసి, గెలుపు గుర్రాలను గట్టెకించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. అభ్యర్థుల గెలుపుతోపాటు పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెంచడంపైనా నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మున్సిపల్ కో ఆర్డినేటర్లు తమకు కేటాయించిన క్షేత్రాల్లోనే అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు.