మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గద్వాల : గద్వాల జిల్లా కేంద్రానికి శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంతో పోటీచేసి గెలిచాక పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా.. అధికార పార్టీకి పెద్ద ఎత్తున పలువురు నాయకులు గుడ్‌బై చెప్పి కేటీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో జరిగే గద్వాల గర్జన సభ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. సభకు జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులను తరలించే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు, సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ నేతృత్వంలో పార్టీ నేతలు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రం గులాబీమయమైంది. ఎర్రవల్లి చౌరస్తా నుంచి గద్వాల వరకు గులాబీ జెండాలు బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు.
ఎమ్మెల్యే బండ్ల అధికార పార్టీలోకి చేరడంపై స్థానిక పార్టీ కార్యకర్తలంతా తిరుగుబాటుచేశారు. ముఖ్యమైన నేతలతోపాటు ఎవరూ ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్‌లో చేరలేదు. సొంత క్యాడర్‌ను కాపాడుకుంటున్న గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడుకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ గద్వాలలో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇటీవల పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వేటు తప్పదన్న నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులంతా తిరిగి బీఆర్ఎస్లోకి వస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ఎవరికి వారే గ్రూపులుగా మారిపోయి, తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో చాలా మంది పార్టీని వీడుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. గద్వాలలో కేటీఆర్ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రకటించారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యే సభను విఫలం చేసేందుకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ప్రారంభించినా ఎక్కడికక్కడే గులాబీ కార్యకర్తలు కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్ పర్యటన వివరాలు
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్ నుంచి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు గద్వాలకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు గద్వాలకు వచ్చి, ధరూర్ మెట్ నుంచి ర్యాలీగా తేరు మైదానానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.