అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించింది. ఇప్పుడు అమలు చేయలేక ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉదాసీన వైఖరి, మీమాంస వీడాలి. కాంగ్రెస్ నేతలు అప్పుడేం మాట్లాడారో ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలతోపాటు ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, వారిద్దరు బీఆర్ఎస్ను లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అదానీని రాహుల్‌గాంధీ దొంగ అని అంటుంటే రేవంత్‌రెడ్డి మాత్రం దొర అని అంటున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 3న ఆదిలాబాద్‌తో ప్రారంభమైన పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు నల్లగొండతో ముగుస్తున్నాయని చెప్పారు. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయని తెలిపారు. పార్టీకి కార్యకర్తలే కథానాయకులని, కార్యకర్తల వల్లే ఇన్నేండ్లుగా పార్టీ బలంగా ఉన్నదని చెప్పారు. గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని అ న్నారు. నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించింది కానీ ఎకడా ఓటమిపై అనుమానాలు రాలేదని పేర్కొన్నారు.
కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని అన్నారు. సూర్యాపేటలో మాత్రమే గెలిచామని, పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. ఓటమికి అనేక కారణాలున్నాయని, ఈ పార్లమెంటు సన్నాహక సమావేశాలు ఆరంభం మాత్రమేనని తెలిపారు. ఫిబ్రవరి మొదటివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమీక్షలు మొదలవుతాయని వెల్లడించారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని మనం గట్టిగా తిప్పికొట్టలేకపోయామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభూత కల్పనలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని అన్నారు.
సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలి
మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్ వాళ్లు ఉలిక్కిపడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి అని కాంగ్రెస్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ఊహించలేదని, అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించిందని తెలిపారు. ఇప్పుడు అమలుచేయలేక హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు.
హామీలన్నింటినీ నెరవేర్చేదాకా వారిని వదిలిపెట్టొద్దని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్‌రెడ్డి అడ్డమైన మాటలు మాట్లాడారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉదాసీన వైఖరి, మీమాంస వీడాలని, ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారో ఇపుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత నవంబర్లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని, నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా ఆయనకే పంపాలని తెలిపారు.
సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కేంద్రం చేతిలో పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతున్నదని మండిపడ్డారు. అప్పుడే కరెంట్ కోతలు కూడా మొదలయ్యాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడిందని చెప్పారు.
‘రేవంత్ భుజం మీద తుపాకీపెట్టి మోదీ బీఆర్ఎస్ను కాల్చే ప్రయత్నం చేస్తున్నారట.. మైనారిటీ సోదరులకు కాంగ్రెస్, బీజేపి అక్రమ సంబంధం గురించి చెప్పాలి’ అని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉన్నదని, కాంగ్రెస్‌కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని తెలిపారు. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో అనుకూలంగా మలచుకోవాలని సూచించారు. నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గులాబీ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. కాగా, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కేటీఆర్ సోమవారం గుత్తా ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సుఖేందర్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడు గుత్తా అమిత్కుమార్రెడ్డితో పలు అంశాలపై చర్చించారు.
కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కు: జగదీశ్‌రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయని మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ బీఆర్ఎస్ పేరిట దేశవ్యాప్తంగా తిరిగితే బలోపేతం అవుతారని భయపడిన మోదీ కాంగ్రెస్‌కు సహకరించారని ఆరోపించారు. రాహుల్‌ను ఎదురోవడం కన్నా కేసీఆర్‌ను ఎదురోవడం కష్టమని మోదీ అనుకున్నారని, అందుకే బీజేపీ ఓట్లు పద్ధతిగా కాంగ్రెస్‌కు మళ్లించారని అన్నారు. బండి సంజయ్‌ను బీజేపీ అధిష్ఠానమే తప్పించిందని, ఆయనను తప్పించడంలో కేసీఆర్ పాత్ర ఉన్నదని దుష్ప్రచారం చేశారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోతే కేంద్రం నుంచి అధికారులు హుటాహుటిన వచ్చి తప్పుడు రిపోర్టు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌కు మేలు చేసేందుకే ఇలా చేశారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేస్తాయని అన్నారు. ఈ కుట్రను బీఆర్ఎస్ కార్యకర్తలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీ మనదని, ఆ ఉద్యమంలో ఇపుడు పదోశాతం శక్తితో పోరాడినా కాంగ్రెస్‌ను నిలువరించవచ్చని తెలిపారు. ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ వల్ల కాదని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలే రుజువు చేస్తున్నాయని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్. మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మెడలు వంచుదాం
కాంగ్రెస్ మెడలు వంచాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్-బీజేపీ కుమ్మకు రాజకీయాలను ఎండగడదామని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గోబెల్స్‌ను మించి దుష్ప్రచారం చేసిందని, ప్రచారంలో అబ ద్ధం.. పాలనలో అసహనం.. ఇదే ఆ పార్టీ తీరు అని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎండ్రికాయల పార్టీ అని, ఒకరి కాలు ఇంకొకరు పట్టి లాగుతుంటారని ఎద్దేవా చేశారు.
ఆ పార్టీది ఇచ్చే గుణం కాదని, ఎగవేసే గుణమని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లోని 13 హామీలను మరో 20 రోజుల్లో నెరవేర్చాలని, లేకుంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కోడ్ పేరు చెప్పి తప్పించుకునే అవకాశం ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునే ఉంటామని తెలిపారు. కేసీఆర్ హయాం లో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు దాకా నీళ్లిచ్చామని గుర్తుచేశారు. మంత్రి కోమటిరెడ్డి బీఆర్ఎస్ను ముకలు చేస్తామనటం కాదు, కేఆర్ఎంబీలో చేరేందుకు రెండు నెలల్లోనే ఈ ప్రభుత్వం ఎందుకు సంతకం పెట్టిందనే దానిపై సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు.
సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలు మంచి సూచనలు చేశారని, పార్టీకి ద్రోహం చేసినవారిపై చర్యల కోసం డిమాండ్లు వచ్చాయని వివరించారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై సూచనలు వచ్చాయ ని, గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా ముందుకు సాగుదామని అన్నారు. కష్టపడ్డ వారి కి, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే పార్టీ కమిటీలు వేసుకుని, అసెంబ్లీ నియోజకవర్గాలలో స మావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అభిప్రా య భేదాలుంటే పక్కనబెట్టి టీంలా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. తల్లిలాంటి పార్టీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.