రైతుల కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం..
యూరియా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలోని 71 లక్షల మంది రైతులను అరిగోస పెడుతున్నయి. అందుకే రైతుల కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటది. పార్టీ అధినేత కేసీఆర్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు, పార్టీ ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నం. ఎన్నికల బహిష్కరణ మంచిదికాకున్నా నోటా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దూరంగా ఉండాల్సి వస్తున్నది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకంటే బీఆర్ఎస్కు రైతుల ప్రయోజనాలే ముఖ్యం.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట రేవంత్‌రెడ్డి సర్కార్ ఇన్స్టాల్మెంట్ల వారీగా దోపిడీకి, మూటల వేటకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆరోపణలు చేశారు. తక్కువ వ్యయంతో పూర్తి చేసేలా నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు చేసుకుని వాటి అంచనాలను పెంచిందని మండిపడ్డారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతూ, కూలిందని ప్రచారం చేస్తూ, మరోవైపు ఆదే ప్రాజెక్టు ద్వారా వచ్చే గోదావరి జలాలతో హైదరాబాద్ దాహార్తి తీరుస్తామనడం ప్రభుత్వ నీచ రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఏమాత్రం సిగ్గున్నా తక్షణం రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ బీళ్లకు గోదావరి నీళ్లను మళ్లించిన బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. అధికారంలోకి రావడానికి ముందునుంచే ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్ముతూ వస్తున్నదని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికీ అదే రీతిలో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లేందుకు పీసీ ఘోష్ కమిషన్‌ను వేసిందని, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని విమర్శించారు. ఆ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు మళ్లీ సీబీఐ ఎంక్వయిరీ అంటూ కొత్త డ్రామాకు తెరతీసిందని ధ్వజమెత్తారు. సీబీఐ, ఐటీ, ఈడీ తదితర కేంద్ర సంస్థలు బీజేపీ జేబు సంస్థలంటూ తెల్లారి లేస్తే రాహుల్‌గాంధీ దుమ్మెత్తిపోస్తారని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాత్రం అదే సంస్థకు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తారని ఎద్దేవా చేశారు. దానిని బట్టే సీఎంకి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంత కక్ష ఉన్నదో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఒకవైపు, కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతలా విషం చిమ్ముతూ, మరోవైపు అదే ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తున్నట్టు పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనలు ఇచ్చారని చెప్పారు. సరిగ్గా వారం క్రితం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశించి, వారం తిరగకముందే మూసీ అనుసంధానమంటూ శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సిగ్గు, ఇంగితం, సోయి ఉన్నదా? అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇన్ని రోజులు చెత్త వాగుడు వాగినా, తుదకు కాళేశ్వరమే దిక్కయిందని చురకలంటించారు.
కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు గోదావరి నీళ్లు అందిస్తామని చెప్పడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు, కామధేనువు అనేది అక్షర సత్యమని ఇప్పుడు ప్రభుత్వమే చెప్పకనే చెప్పిందని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా గతంలోనూ భువననగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టారని, గంధమల్లకు సైతం కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మసాగర్ నుంచే నీళ్లు వస్తాయని కేటీఆర్ గుర్తుచేశారు. గండిపేటకు తీసుకువస్తున్నది కాళేశ్వరం జలాలో కాదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మూసీలో రేవంత్‌రెడ్డి సర్కార్ మూటల వేటకు తెరతీసింది. ఒకవైపు కాళేశ్వరంపై విషం చిమ్ముతూ, కూలిందని ప్రచారం చేస్తూ, మరోవైపు ఆదే ప్రాజెక్టు ద్వారా వచ్చే గోదావరి జలాలతో హైదరాబాద్ దాహార్తి తీరుస్తామనడం నీచ రాజకీయాలకు నిదర్శనం. ఏమాత్రం సిగ్గున్నా అబద్ధాలు ప్రచారం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
-కేటీఆర్
హుస్సేన్‌సాగర్ శుద్ధి కోసం ప్రణాళికలను కేసీఆర్ సర్కార్ రూపొందించిందని కేటీఆర్ తెలిపారు. గండిపేట నుంచి బుల్కాపూర్ నాలా ద్వారా హుస్సేన్‌సాగర్‌కు కూడా గోదావరి జలాలను తీసుకొనిరావాలని నాడు నిర్ణయించినట్టు వెల్లడించారు. రూ.1,100 కోట్లతో ఈ పనిని చేయవచ్చని, కానీ ఈ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి మాత్రం కొండపోచమ్మను తీసేశారని, మల్లన్నసాగర్ నుంచి చేపట్టి రూ.ప్రాజెక్టు వ్యయాన్ని రూ.7,380 కోట్లకు అంటే దాదాపు 7 రెట్లు పెంచిందని మండిపడ్డారు. ఇది ఎవరి కోసం? ఎందుకోసం పెంచారని అడిగితే సమాధానం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన నీటి నిల్వ సామర్థ్యాన్ని 14 నుంచి 141 టీఎంసీలకు పెంచడంతోపాటు అనేక మార్పులు చేసి, సామర్థ్యాలను పెంచి కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించినా రూ.38 వేలకోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.85 వేల కోట్లను పెంచారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారని గుర్తుచేశారు. ‘ప్రాణహిత-చేవెళ్లను డిజైన్ చేసింది 2007లో. పనులు మొదలుపెట్టింది 2016లో. మరి సిమెంట్, స్టీల్ ఖర్చులు పెరుగుతయి కదా? జీఎస్టీ వచ్చింది? అది పెరిగితేనేమో ఘోరం జరిగిపోయింది? కుంభకోణమని ఆరోపణలు చేశారు. మరి ఈరోజు ప్రాజెక్టు వ్యయం ఏడు రేట్లు ఎట్లా పెరిగింది? ఇది కుంభకోణం కాదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రభుత్వం వ్యయం పెంచడంలో మతలబు ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు. ‘రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వ్యయ్యాన్ని రూ.1.5 లక్షల కోట్లతో చేపడుతున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దానిని బీఆర్ఎస్, హైదరాబాద్ ప్రజలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్కామ్‌ను ఇన్స్టాల్మెంట్ల రూపంలో రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రస్తుతం అమలుచేస్తున్నది. విడతలవారీగా దోపిడీకి ప్రణాళికలను సిద్ధంచేసింది. మొత్తంగా మూసీ ప్రాజెక్టును రూ.1.5 లక్షల కోట్లకు తీసుకురావాలనేది సర్కార్ కుతంత్రం’ అని కేటీఆర్ మండిపడ్డారు. తాము ఎప్పుడూ ఆదరాబాదరగా ఏదీ చేయలేదని, మూసీలో మూటల వేట కోసం ప్రయత్నం చేయలేదని వివరించారు.
రూ.16 వేల కోట్లతో సుధీర్‌రెడ్డి చైర్మన్‌గా మూసీ సుందరీకరణ ప్రణాళికలు సిద్ధం చేశామని, రూ.3,866 కోట్లతో ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే 37 ఎస్టీపీల నిర్మాణం పూర్తిచేశామని వివరించారు. 2017లోనే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేశామని, గోదావరి మూసీ అనుసంధానానికి పరిపాలన, క్యాబినెట్ అనుమతులు మంజూరు చేశామని, మూసీ మీద రూ.545 కోట్లతో 15 బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్లు పిలిచామని గుర్తుచేశారు. బ్రిడ్జిల నిర్మాణం కోసం అధ్యయనం చేసేందుకు ఇంజినీర్లను ప్యారిస్, గ్రీస్ తదితర దేశాలకు పంపామని, కానీ సీఎం రేవంత్‌రెడ్డిలా చీకటి ఒప్పందాలు చేసుకోలేదని తెలిపారు.
‘మూసీ పేరిట మరోసారి లూటీకి తెరతీశారు. రూ.16 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టు వ్యయాన్ని అడ్డగోలుగా పెంచుతున్నారు. గ్రావిటీని కాదని పంప్‌హౌస్‌లు ఎవరి లాభం కోసం పెడుతున్నారు? కమీషన్లు దండుకోవడానికా? కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికా? తక్కువ ఖర్చుతో అయ్యే ప్రాజెక్టును పక్కనపెట్టి ఎక్కువ ఖర్చుతో ఎందుకు చేస్తున్నారు? అని సర్కార్‌ను కేటీఆర్ నిలదీశారు. తులం బంగారం ఇవ్వడానికి, ఆరు గ్యారెంటీల అమలుకు, పింఛన్ల పెంపునకు, రైతుబంధుకు పైసల్లేవని చెప్తూ.. రూ.7,400 కోట్లతో ఎవరూ అడగని ప్రాజెక్టును ఎందుకు టేక చేశారో సీఎం బదులివ్వాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి ఫెయిల్ అయినందుకు, కమిషన్ వేసి విఫలమైనందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సొంత రాష్ర్టాన్ని, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం బుద్ధి ఉన్న ఏ ముఖ్యమంత్రీ చేయడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 240 టీఎంసీల నీటి వినియోగం జరిగిందని, 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పుస్తకంలోనే ఉన్నదంటూ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ మిత్రపక్షానికి చెందిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారని గుర్తుచేశారు. ‘కాళేశ్వరం కొట్టుకుపోయిందని అంటున్నారు. కానీ, 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా బరాజ్ నిక్షేపంగా ఉన్నది.
ప్రభుత్వం చెప్పేది తప్పు. 20 నెలలుగా ప్రాజెక్టును ఎందుకు రిపేర్ చేయడం లేదు’ అని ఒవైసీ అసెంబ్లీలో నిలదీశారని కేటీఆర్ గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ నుంచి గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ నేతలు రూ.లక్ష కోట్ల కుంభకోణం అంటూ ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. రూ.94 వేల కోట్లు ఖర్చయిన ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుందంటూ సీఎం రేవంత్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామనే ప్రశ్నించారని కేటీఆర్ తెలిపారు. ‘రూ.94 వేల కోట్లు ఖర్చయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది, అందులో మేడిగడ్డ బరాజ్ ఖర్చు రూ.4వేల కోట్లు. అందులో భూసేకరణ, రిటైనింగ్వాల్స్ నిర్మాణం, సిమెంట్ స్ట్రక్చర్‌కు అయిన లెక్క తీస్తే బరాజ్ ఖర్చు రూ.1,500 కోట్లు.
ఏడు బ్లాకుల్లో ఒక బ్లాక్‌ను పునరుద్ధరిస్తే సరిపోతుందని ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది. అందుకు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఆ సొమ్మును కూడా సదరు ఏజెన్సీ భరించేందుకు ముందుకొచ్చింది. మరి ప్రజల సొమ్ము వృథా ఎక్కడైంది?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టును పడావు పెడుతున్నదని, బనకచర్లకు నీళ్లను పంపేందుకు తహతహలాడుతున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం సిస్టమ్ మొత్తం సమర్థంగా పనిచేస్తున్నదని చెప్పారు. ఇవన్నీ ఇట్లా ఉంటే కాంగ్రెస్ మాత్రం రూ.లక్ష కోట్ల కుంభకోణం అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా వాడుకుంటూ, దాని ద్వారా కీర్తిపొందే ప్రయత్నం చేస్తూ, మరోవైపు ఆ ప్రాజెక్టును బద్నాం చేస్తున్నారు. ఇంతకంటే అరాచక ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఉండబోదు.
-కేటీఆర్
మూసీకి గోదావరి జలాల తరలింపు కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు వెనుక భారీ కుంభకోణం కూడా ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. అదేమీ కొత్త ప్రాజెక్టు కాదని స్పష్టంచేశారు. భాగ్యనగరానికి గోదావరి జలాలను తరలించేందుకు నాడు కేసీఆర్ నేతృత్వంలో 18 మే 2023న జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించిందని కేటీఆర్ గుర్తుచేశారు. కేవలం రూ.1,100 కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న కొండపోచమ్మసాగర్ ద్వారా భాగ్యనగరానికి జలాలను తరలించాలని ఆ భేటీలోనే ఖరారు చేశారని వివరించారు. హైదరాబాద్ దేశంలో అతిపెద్ద నగరంగా మారబోతున్నదని, భవిష్యత్తులో మరింత విస్తరించనున్నదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసినప్పుడే రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా రూపొందించారని వివరించారు.
అందులో ఒక టీఎంసీని నిత్యం ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నదని, భవిష్యత్తు తరాలకు ఇబ్బంది ఉండకూడదనే ముందుచూపుతోనే మూడు టీఎంసీలను మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు ఎత్తిపోసి అక్కడినుంచి హైదరాబాద్‌కు తీసుకురావాలని నాడు భావించారని వెల్లడించారు. కొండపోచమ్మ సాగర్ 618 మీటర్లపైన, మల్లన్నసాగర్ 557 మీటర్లపైన ఉంటుందని, గండిపేట 540 మీటర్లపైన ఉంటుందని తెలిపారు. కాబట్టి, కొండపోచమ్మ నుంచి గ్రావిటీ ద్వారానే నీళ్లను తీసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. అందులోభాగంగానే అదే క్యాబినెట్ భేటీలో 111 జీవోను ఎత్తివేశారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 17 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మసాగర్ నుంచి సంగారెడ్డి కాలువను నిర్మిస్తున్నారు.
ఆ గ్రావిటీ కాలువ 27 కిలోమీటర్ వద్ద హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు నీళ్లను మళ్లించే ఏర్పాటుచేయాల్సి ఉంటుందని తెలిపారు. మొత్తంగా 5,054 క్యూసెక్కుల జలాల్లో 4,354 క్యూసెక్కులు సాగు కోసం, మిగతా 700 క్యూసెక్కుల జలాలను జంట జలాశయాలకు తరలించి మూసీ ప్రక్షాళనకు కేటాయించారని వివరించారు. ఆ కాలువ ద్వారా కాళేశ్వరం జలాలను రావల్కోల్ చెరువుకు, అక్కడినుంచి కాలువ లేదంటే పైప్‌లైన్ ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి, అక్కడినుంచి హిమాయత్‌సాగర్‌కు తరలించాల్సి ఉంటుందని, తద్వారా ఏడాది పొడవునా జంట జలాశయాలు కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రవహించేలా కేసీఆర్ ప్రణాళికలను సిద్ధం చేశారని కేటీఆర్ వివరించారు.
ఒకవైపు, కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతలా విషం చిమ్ముతూ, మరోవైపు అదే ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తున్నట్టు పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనలు ఇచ్చారు. సరిగ్గా వారం క్రితం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశించి, వారం తిరగకముందే మూసీ అనుసంధానమంటూ శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సిగ్గు, ఇంగితం, సోయి ఉన్నదా?
-కేటీఆర్
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో అవినీతే కాదు, భారీ క్రిమినల్ కోణం కూడా ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి రిటైనింగ్‌వాల్ కూలిపోయిందని, ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్ చేయాలని, పక్కనపెట్టాలని హెచ్ఎండబ్ల్యూఎస్నే రిపోర్టు ఇచ్చిందని పత్రికల్లో కథనాలు వచ్చాయని గుర్తుచేశారు. అదే కంపెనీ కేరళలో ఎన్‌హెచ్-66ను నిర్మించిందని, అక్కడ కూడా స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కొలాప్స్ అయ్యిందని వివరించారు. ఎన్హెచ్ఐఏ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) సదరు ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిందని గుర్తుచేశారు.
కానీ, ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఆ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్ చేయడం లేదని, అదనంగా కాంట్రాక్టులను అప్పగిస్తున్నదని ధ్వజమెత్తారు. రూ.1,100 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.7,400 కోట్లకు పెంచి అదే ఏజెన్సీకి అప్పగించిందని, సీఎం సొంత నియోజకవర్గంలోని కొండగల్‌లో లిఫ్ట్ స్కీమ్ పనులను కూడా అప్పగించారని విమర్శించారు. సదరు ఏజెన్సీని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటూ గతంలో రేవంత్‌రెడ్డి హుంకరించారని, మరి నేడు అది బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి లేని మొహమాటం కాంగ్రెస్ సర్కార్‌కు ఎందుకు? ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్ ఎందుకు చేయడం లేదు? అని కేటీఆర్ నిలదీశారు. ఇది క్రిమినల్ కుట్ర అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు, ఢిల్లీకి పంపి సీటును కాపాడుకునేందుకు రేవంత్ ప్రయత్నమే తప్ప మరేమీలేదని, అందుకే మూసీలో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ బ్లాక్ చేసిన మరో సంస్థతో కూడా సీఎం సంప్రదింపులు చేస్తున్నారని, అదేవిధంగా ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో మంతనాలు సాగిస్తున్నారని, 300 ఎకరాలు ఇస్తామంటూ బేరాలకు దిగారని కేటీఆర్ వివరించారు. మూసీ ప్రాజెక్టుపై ఉన్న ఆత్రం ఆరు గ్యారెంటీల అమలుపై లేకుండా పోయిందని, ఎందుకంటే కమీషన్లు రావని చురకలంటించారు. కేంద్రంలోని బీజేపీని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా నిలదీశారు. రాష్ట్రంలో ఇన్ని స్కామ్‌లు జరుగుతున్నా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్, దోపిడీ అని బీజేపీ నేతలే ఆరోపిస్తున్నారని, కానీ మరెందుకు విచారణలకు ఆదేశించడం లేదని నిలదీశారు.
జ్ఞానమున్న ఎవరైనా సరే ఎక్కడినుంచి నీళ్లు తేవాలనుకుంటారో.. అక్కడే సదరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తలాతోక లేకుండా మల్లన్నసాగర్‌ను వదిలి గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు. ఎందుకంటే, మల్లన్నసాగర్ వద్ద శంకుస్థాపన చేస్తే అది కాళేశ్వరం కాదా? అని ప్రజలు, మీడియా అడుగుతుంది. ఇంతకాలం కాళేశ్వరంపై చేసిన లక్ష కోట్ల అవినీతి, కూలేశ్వరం అయిపోయిందంటూ సాగించిన ప్రచారమంతా అసత్యమని ప్రజలకు తెలుస్తుంది.
-కేటీఆర్
ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీపై కొన్ని పత్రికలు రాయకపోవచ్చు? వాటి పరిమితులు, యాడ్స్ అవస్థలు వాటికి ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ, సోషల్‌మీడియా ఉన్నదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ఓఆర్ఆర్ చుట్టూ రింగ్ మెయిన్‌లో 50 కిలోమీటర్లు పూర్తిచేశామని, మిగతా నిర్మాణం పూర్తి చేసేది రాబోయే కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. రింగ్ మెయిన్ పూర్తయితే ఏనాటికీ హైదరాబాద్‌కు తాగునీటికి కరువు లేకుండా గోదావరి, కృష్ణా జలాలు అందుబాటులో ఉంటాయని, రోజూ కాదు 24 గంటలపాటు నల్లా నీళ్లు ఇచ్చే బాధ్యత తమదేనని అభయమిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో ఏదీ కాదని, డబ్బుల సంపాదన తప్ప మరేదీ కాదని విమర్శించారు.
20వేల లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చి, కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ గతంలోనే రేవంత్‌రెడ్డి మనసులో మాట బయటపెట్టుకున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ఫ్రీ వాటర్ స్కీమ్‌ను తప్పక రద్దు చేస్తారని, ఇది ప్రతి ఒక్కరూ రాసిపెట్టుకోవాలని పేర్కొన్నారు. తాము గతంలో చేసిన ప్రయత్నాలను కొనసాగించడంతోపాటు ఈ ప్రభుత్వ దోపిడీని అడ్డుకుని తీరుతామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇదివరకు ఎలాగైతే హైదరాబాద్ దాహార్తిని తీర్చామో, అదే తరహాలో హైదరాబాద్‌కు న్యాయం చేసేది, రింగ్‌మెయిన్ పూర్తిచేసేది రానున్న కేసీఆర్ ప్రభుత్వమేనని వివరించారు. దోపిడీ, కుంభకోణాల విషయంలో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ బాధితులంతా తెలంగాణభవన్‌కు వచ్చి మొరపెట్టుకున్నారని, న్యాయపోరాటం కొనసాగుతున్నదని గుర్తుచేశారు. కుంభకోణాలపై కూడా న్యాయపోరాటం చేస్తామని స్పష్టంచేశారు.