KTR | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు, విషాద ఘటనల నేపథ్యంలో ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకులబాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్టు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. 30 తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యాసంస్థలతో పాటు కేజీబీవీ, మోడల్ సూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలను, కాలేజీలను పరిశీలిస్తామని చెప్పారు. గురుకుల బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొంటారు. బాలికల విద్యాసంస్థల్లో పార్టీ తరఫున విద్యార్థి విభాగం మహిళా నాయకులు, పార్టీ మహిళా నాయకులు సందర్శిస్తారని తెలిపారు. జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మహిళా సీనియర్ నాయకులు గురుకుల విద్యాసంస్థలను సందర్శించి బాలికల సమస్యలను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని వివరించారు.
ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవడం, కీలకమైన విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకొని నిర్లక్ష్యం చేస్తుండటం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని కేటీఆర్ దుయ్యబట్టారు. మొదటి సంఘటన జరిగినప్పుడే స్పందించి ఉంటే ఇంతమంది విద్యార్థుల ప్రాణాలు పోయి ఉండేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రికి ఆ పిల్లల తల్లిదండ్రుల కడుపుకోత కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీకి 28 సార్లు వెళ్లడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చనిపోతుంటే కనీసం ఒకసారి కూడా సమీక్ష నిర్వహించాలన్న సోయిలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు సరైన అన్నం పెట్టడం, వారి బాగోగులు చూసుకోవడం కూడా చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలు పరిషరించాలని కోరితే బీఆర్ఎస్వీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, విద్యార్థులను పొట్ట పెట్టుకుంటున్న పాపపు పాలన అని మండిపడ్డారు. విద్యార్థుల చావులను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుతుందన్నారు. నిర్వహణ చేతకాక ఈ ప్రభుత్వం గురుకుల, పాఠశాల విద్యను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను చదవుకు దూరం చేసే కుట్రలో భాగంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదా? అని ప్రశ్నించారు.
01
గురుకుల విద్యాసంస్థల నిర్వహణలో అపారమైన అనుభవమున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు. కమిటీలో డాక్టర్ ఆంజనేయులుగౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజారాంయాదవ్, వాసుదేవరెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసిన ప్రవీణ్‌కుమార్‌కు విద్యా సంస్థల నిర్వహణ, అకడి సమస్యలపై సమగ్ర అవగాహన ఉందన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే గురుకుల బాటలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాసంస్థలతోపాటు కస్తూర్బా కేజీబీవీలు, మోడల్ సూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్, రెసిడెన్షియల్ కాలేజీలను సందర్శించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల విద్యాలయాల్లో స్థితిగతులు, సౌకర్యాలు సహా అన్ని పరిస్థితులను కమిటీ ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు పరిశీలిస్తుందన్నారు.
గురుకులాల్లో విద్యార్థులు మరణించడం, విషాహారం కారణంగా విద్యార్థులు దవాఖానల పాలవుతున్న ఘటనలపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. పాలనను గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల చావులకు ఈ ముఖ్యమంత్రే కారణమవుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రాష్ట్రవ్యాప్తంగా 48 విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు. విద్యాసంస్థల్లోని దుర్భర పరిస్థితులను తట్టుకోలేక 23 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, 8 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, నలుగురు విషాహారం తిని, మరో 13 మంది ఆనారోగ్యంతో చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది కాలంలో 38 సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని, 886 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై దవాఖానల పాలు కాగా, నలుగురు విద్యార్థులు మరణించారన్నారని వివరించారు. వాంకిడిలో విషాహారం తిని శైలజ అనే విద్యార్థిని చనిపోయిన ఘటన మరవకముందే మహబూబ్‌నగర్ జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం చూస్తుంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని మండిపడ్డారు.
కమిటీ అందించే నివేదిక ఆధారంగా గురుకుల విద్యాసంస్థల సమస్యలను గుర్తించి వాటి పరిషార మార్గాలను ప్రభుత్వానికి సూచిస్తామని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిషరించకుంటే వివిధ రూపాల్లో ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ అంశాన్ని తాము రాజకీయం చేయాలని ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల మరణాలను నివారించడంలో విఫలం కావడం, వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతుండటంపై ప్రభుత్వమే ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కమిటీ నివేదికలో ప్రస్తావించే అంశాలను తాము శాసనసభలో లేవనెత్తుతామని కేటీఆర్ పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 27 : పాఠశాలలు, వసతిగృహాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవాఖానల పాలవుతుంటే కలెక్టర్లు, అధికారులు ఏం చేస్తున్నారని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. మాగనూరు పాఠశాల, మహబూబ్‌నగర్ ఎస్సీ బాలికల వసతిగృహం ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న మాగనూర్ పాఠశాల విద్యార్థులను బుధవారం ఆయన పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. విద్యార్థులు దవాఖాన పాలైతే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఫుడ్‌పాయిజన్‌కు గురై బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితోపాటు ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ఎక్స్ వేదికగా ఎండగట్టారు. ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే మీద నోరు జారిన సబ్‌కలెక్టర్‌పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడంలేదని, మానవత్వం లేకుండా వ్యవహరించడం చాలాబాధ కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.