KTR | కాళేశ్వరం నీళ్లను గండి పేటలో కలిపి మూసీలోకి పంపిస్తారంట.. దీనికోసం రూ. 5,500 కోట్లు ఖర్చు చేస్తారంట.. ఇది మరొక కుంభకోణమని కేటీఆర్ ఆరోపించారు. కొండ పోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను హైదరాబాద్ తెచ్చేందుకు రూ. 11 వందల కోట్లతో ఖర్చుతో అన్ని సిద్ధం చేశామని తెలిపారు. కానీ పెద్ద ఎత్తున కుంభకోణం చేసేందుకే దీన్ని రూ. 5,500 కోట్లకు పెంచారని అన్నారు. ఈ ప్రాజెక్ట్ను కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న మేఘా సంస్థకే ఇవ్వటానికి అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారు. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు రేవంత్ రెడ్డి చెప్పినట్లు సంతకం పెడితే మేము అధికారంలోకి వచ్చాక విచారణ తప్పదని.. వాళ్ల ఉద్యోగాలు ఊడటం ఖాయమని హెచ్చరించారు. ఎక్కడ బిడ్ లు చేస్తున్నారో ఆ సంస్థ పేరు కూడా మాకు తెలుసని చెప్పారు..
ఆరు గ్యారంటీలకు, హామీలు అమలు చేసేందుకు, ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు కూడా పైసలు లేవని రేవంత్ రెడ్డి అన్నారని కేటీఆర్ తెలిపారు. కానీ మూసీ ప్రాజెక్ట్ కోసం మాత్రం ఆగమేఘాల మీద పనులు చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దాన్ని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అయిన మేఘా ఇవ్వటానికి అన్ని సిద్ధం చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికే మన వద్ద నుంచి మహారాష్ట్ర కు మూటలు పోయాయని.. ఢిల్లీకి కూడా ఈ కంపెనీ ద్వారా మూటలు పంపిస్తారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు అన్న సంస్థ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం కుంభకోణాలను ముందే ప్రజలకు వివరిస్తున్నానని తెలిపారు. ఎందుకు మీరు ఈ దోపిడీలు చేస్తున్నారో మాకు తెలుసని అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు చేస్తే అధికారుల ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఉద్యోగం పోయినట్లు పోతుందని హెచ్చరించారు.
🔎 రేవంత్ రెడ్డి చేస్తున్న రూ.4,500 కోట్ల స్కాం బయటపెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/3ni0eliPVp
— BRS Party (@BRSparty) November 6, 2024
కేబినెట్లో కూర్చున్న మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీకి ఈ పనులు ఇస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందన్న విషయమన్న అసలు తెలుసా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రి అయిన బండి సంజయ్ ఎందుకు దీని మీద మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మోదీ ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు ఉండవని విమర్శించారు. బావమరిదికి అమృత్ టెండర్లు.. మేఘా, రాఘవ సంస్థలకు ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ దేశంలో చట్టాలు ఉన్నాయా? ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తుంటే ఈడీ లు విజిలెన్స్ లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మీదికి మాత్రమే ఈడీ, విజిలెన్స్ అంటూ వస్తారా అని నిలదీశారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సంబంధించి వాళ్లు మాట్లాడారు.. వీళ్లు మాట్లాడారు ఎందుకు అని ప్రశ్నించారు. కోహినూర్ హోటల్ లో అదానీ కాళ్లు మొక్కి ఏం కాకుండా పొంగులేటి బతిమిలాడుకున్నాడని వ్యాఖ్యానించారు. అమృత్ టెండర్లను సీఎం తన బావమరిదికి ఇచ్చిన విషయంలో కేంద్రం సంస్థలు ఎందుకు విచారణ జరపటం లేదు.. సీవీసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మేఘా సంస్థ చేసిన పనికి దేశమంతా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అన్నారు .
పొంగులేటి అరెస్ట్ అవుతాడంటూ అందరి జాతకాలు చెబుతున్నాడు. నువ్వు ఎప్పుడు జైలుకు వెళ్తావో చూసుకో అని కేటీఆర్ సెటైర్ వేశారు. నీ కంపెనీకి కనీసం ఆఫీస్ ఆఫ్ బెన్ ఫిట్ అని కూడా పట్టించుకోకుండా ఏ విధంగా పనులు కట్టబెడతారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. అమృత్ టెండర్లను కూడా పొంగులేటి కంపెనీకి ఇచ్చారని అన్నారు. రాఘవ కంపెనీని కూడా గతంలో రేవంత్ రెడ్డి తిట్టాడని.. ఇప్పుడు మాత్రం ఆ కంపెనీకి పనులు ఇస్తున్నాడని విమర్శించారు. మూసీని కూడా టెండర్లు కాకముందే మేఘాకు ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసేశారని అన్నారు. గోదావరి నీళ్లను హైదరాబాద్ కు తెచ్చేందుకు రూ. 11 వందల కోట్లతో అయిపోయే దానికి రూ. 5500 కోట్ల భారీ స్కాం చేయబోతున్నారని ఆరోపించారు.
ఎన్నికలప్పుడు మాట్లాడటం కాదని.. ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు కదా.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రధాని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక్కడ నిరాటకంగా ఆర్ ఆర్ ట్యాక్స్ తో పాటు బిల్డర్ల నుంచి గజానికి వంద వసూలు చేస్తున్నారని తెలిపారు. అయినా కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. ఇంత అరాచకంగా కుంభకోణాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈడీ సోదాలపై ఇప్పటి వరకు ఎందుకు బీజేపీ మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అదానీతో మీ సంబంధాలు ఏ విధంగా బలపడుతున్నాయో మాకు తెలుసని వ్యాఖ్యానించారు. మీ కుంభకోణాలను బయటపెడుతున్నందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తారని.. అయినా సరే ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులపై ఇప్పటి వరకు స్పందించకపోవటం అంటే బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యిందన్నది స్పష్టంగా తెలిసిపోతుందని కేటీఆర్ అన్నారు. సుంకిశాల ప్రమాదానికి సంబంధించిన కమిటీ రిపోర్ట్ ను బయట పెట్టటంతో ఇప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ ను రేవంత్ రెడ్డి తారుమారు చేసిన చేస్తారని ఆరోపించారు. వెంటనే ఆ రిపోర్ట్ ను బయటపెట్టాలని అన్నారు. లేదంటే ఆ కమిటీ రిపోర్ట్ ను ఏదో చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపోళ్లు నిద్రపోతున్నారా? నిజాయితీ ఉంటే ఎందుకు విచారణ జరపటం లేదని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ప్రయోజనం కోసం మేడిగడ్డలో ఓ పర్రెను పట్టుకొని లక్ష కోట్ల కుంభకోణం అన్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకు మేడిగడ్డ పర్రె విషయంలో ఈ అరాచక శక్తులే ఏదో కుట్ర చేశారని తన అనుమానం అని అన్నారు. మేడిగడ్డ వద్ద ఇప్పటికీ రిపేర్లు చేయకుండా అది కొట్టుకుపోవాలనే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్ టెండర్లను ముఖ్యమంత్రి బావమరిదికి రూ. 11 వందల కోట్ల పనులను ఎలా ఇస్తారంటూ కేంద్రమంత్రి నేను ఉత్తరం రాస్తే ఇప్పటి వరకు స్పందన లేదని తెలిపారు. గౌతమ్ అదానీ కొడుకుతో నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి ఇంట్లోనే చర్చలు జరిపారని తెలిపారు. మోదీ కోసం దామగుండం, అదానీకి సిమెంట్ ఫ్యాక్టరీ, మేఘా కృష్ణా రెడ్డికి అన్ని ప్రాజెక్ట్ లు ఇస్తున్నారని అన్నారు. రాయదుర్గంలో 84 ఎకరాలను కూడా ఆదానీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవ్వరు, ఎప్పుడు అరెస్ట్ అవుతారో మంత్రి చెబుతాడా ? వీళ్లు ప్రభుత్వం నడుపుతున్నారా.. సర్కస్ నడుపుతున్నారా అని మండిపడ్డారు. ఈ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల బాగోతాలను బట్టలిప్పి ప్రజల ముందు నగ్నంగా నిలబెడతామని స్పష్టం చేశారు. .