హైదరాబాద్, జూలై 11 (నమస్తేతెలంగాణ): షాబాద్‌లో ఆరుగురి హత్యలకు కాంగ్రెస్ సర్కార్‌దే బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. పోక్సో కేసులో నిందితుడికి బెయిల్ రావడం వల్లే ఈ దారుణం జరిగిందని విమర్శించారు. న్యాయమూర్తి వద్ద సర్కార్ పటిష్టమైన వాదనలు వినిపించకపోవడంతోనే ఈ ఘోరమైన ఘటన చోటుచేసుకున్నదని, హోంశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని ధ్వజమెత్తారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. షాబాద్ ఘటనపై భావోద్వేగంతో స్పందించారు. షాబాద్ హత్యాకాండ తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. బాలికపై లైంగికదాడి జరిగిన తర్వాత ఆ దుర్మార్గుడికి బెయిల్ ఇవ్వవద్దని అమ్మాయి తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు. సర్కార్ తరఫున జడ్జికి సరైన పద్ధతిలో నివేదించకపోవడంతోనే షాబాద్ హత్యాకాండ జరిగిందని స్పష్టంచేశారు. ఇందులో రాష్ట్ర హోంశాఖతో పాటు నిందితుడికి బెయిల్ రాకుండా చూడటంలో విఫలమైన న్యాయవాదుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ‘ఇలాంటి దుర్మార్గులకు బెయిల్ ఎందుకు ఇస్తున్నారు? మానవమృగాలను సమాజంపైకి ఎందుకు వదులుతున్నారు? ఆరుగురి ప్రాణాలకు ఎవరు బాధ్యులు? దీనికి హోంమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి ఆఘాయిత్యం జరిగితే అప్పటి ప్రభుత్వం ఎలా స్పందించిందో, నిందితులను ఎలా శిక్షించిందో తెలంగాణ సమాజానికి తెలుసని గుర్తుచేశారు.
ఫిర్యాదుచేసేందుకు భయపడుతున్నరు
కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణ కరువైందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. సర్కార్ పెట్టిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదించకుండా, ఇలాంటి దుర్మార్గులకు బెయిల్ ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్తులో జరిగే అఘాయిత్యాలకు రేవంత్‌రెడ్డే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ‘ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నా.. అఘాయిత్యం జరుగడమే ఘోరమంటే..దారుణం జరిగిన తర్వాత పబ్లిక్‌గా చెప్పుకోవడం ఒక భయంకరమైన పరిస్థితి అంటే.. ఇక మానవమృగాలకు బెయిల్ ఇచ్చి, జైలు నుంచి బయటకు తీసుకువచ్చి, వాళ్లు దారుణాలకు ఒడిగడుతుంటే..నిందితుల తరఫున వారి పలుకుబడికి, వారిచ్చే డబ్బులకు ఆశపడి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నోర్లు మూసుకొని చేష్టలుడిగి చూస్తుంటే భవిష్యత్తులో ఆడపిల్లలు ఫిర్యాదు చేసేందుకు ఎలా ముందుకొస్తారు? వారు ఎవరికి చెప్పుకోవాలి? వారి తల్లిదండ్రులు భయపడరా?’ అంటూ నిలదీశారు. ఇప్పటికైనా సిగ్గుమాలిన ప్రభుత్వం కండ్లు తెరువాలని హితవుపలికారు.