కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రచారం చేస్తూ కుట్రలకు తెరలేపినయ్. ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. దేశంలోని చట్టాలు, న్యాయవ్యవస్థ మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. మీరు ఎన్ని నోటీసులిచ్చినా, డ్రామాలు చేసినా ముమ్మాటికీ న్యాయం, ధర్మం గెలుస్తయి.
నల్లగొండ ప్రతినిధి, మే 21(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్లు, దందాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విచారణ కమిషన్లు, నోటీసులు అంటూ డ్రామాలాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాపాలన అంటూనే పర్సంటేజీల పాలనగా మార్చేశారని దుయ్యబట్టారు. స్వయంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు సైతం ప్రభుత్వ పెద్దల 20 శాతం, 30 శాతం కమీషన్ల గురించి నిజాలు బయటపెడుతున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడానికి ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తే కారణమని విమర్శించారు.
ఇలాంటివన్నీ కప్పిపుచ్చుకొనేందుకే కమిషన్ల పేరిట నాటకాలు ఆడుతున్నారని, ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎన్ని డ్రామాలాడినా అవన్నీ దూది పింజల్లా తేలిపోవడం ఖాయమని చెప్పారు. నల్లగొండలో బుధవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు, బీఆర్ఎస్వీ మాజీ నాయకుడు జిల్లా శంకర్ వివాహానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలు ప్రతి పనిలో వసూలు చేస్తున్న కమీషన్ల మీద రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతున్నదని విమర్శించారు. చిన్న చిన్న పనులు చేసుకునే కాంట్రాక్టర్లు సైతం ఏకంగా సచివాలయంలో ధర్నాకు దిగి 20 శాతం, 30 శాతం కమీషన్ల వ్యవహారాన్ని బట్టబయలు చేశారని గుర్తుచేశారు. చివరికి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కమీషన్లు లేనిది, పైసలు లేనిది ఈ ప్రభుత్వంలో పనులు కావడం లేదని బహిరంగంగానే చెప్తుండటం పట్ల సిగ్గు పడాలని నిప్పులు చెరిగారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి పోయి కార్మికులు ప్రాణాలు కోల్పోతే ఇప్పటికీ బాధ్యలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నల్లగొండ రైతుల తరఫున, ప్రజల తరపున రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నానని కేటీఆర్ చెప్పారు. ‘మీ కమీషన్ల కకుర్తితో ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే అందులో చికుకుపోయిన వారి శవాలను కూడా తీయలేకయిండ్రు. కనీసం ఆ పనుల్లో ఏం జరిగిందో ప్రజలకు చెప్పే పరిస్థితి కూడా లేదు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు అందుకు కారణమైన సంస్థపై విచారణ లేదు. చర్యలు లేవు’ అని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రచారం చేస్తూ కుట్రలకు తెరలేపాయని, ప్రజలకు వాస్తవాలు తెలుసునని, దేశంలోని చట్టాల మీద, న్యాయవ్యవస్థ మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉన్నదని కేటీఆర్ తెలిపారు. ‘మీరు ఎన్ని నోటీసులిచ్చినా, డ్రామాలు చేసినా ముమ్మాటికీ న్యాయం, ధర్మం గెలుస్తాయి. తెలంగాణకు మేలు చేసిన వారిని ఆ దేవుడే కాపాడుతాడు’ అని స్పష్టం చేశారు. .‘మీరు త్రీడీ మంత్రంగా భావిస్తున్న డిసెప్షన్, డిస్ట్రెక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచనలు ఎకువ రోజులు నడువవు.
కమిటీల పేరిట, కమీషన్ల పేరిట కాలయాపన చేస్తూ ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తూ 420 హామీల అమలును పట్టించుకోవడం లేదు. ఇచ్చిన ప్రతి అడ్డగోలు హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు. ముమ్మాటికీ తెలంగాణ ప్రజలు తిరగబడి సాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేటీఆర్ వెంట మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, తిప్పన విజయసింహారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
చిన్న చిన్న కాంట్రాక్టర్లు సైతం ఏకంగా సచివాలయంలో ధర్నాకు దిగి మీ కమీషన్ల వ్యవహారాన్ని బట్టబయలు చేసిండ్రు. చివరికి మీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కమీషన్లు లేనిది, పైసలు లేనిది ఈ ప్రభుత్వంలో పనులు కావని బహిరంగంగానే చెప్తున్నరు. మీ కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాళేశ్వరం కమిషన్ పేరిట డ్రామాలాడుతున్నరు.
-కేటీఆర్
నల్లగొండ ప్రతినిధి, మే 21(నమస్తే తెలంగాణ) : రెండేండ్ల నుంచి ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడంలేదని ఓ వైద్య విద్యార్థిని.. కేటీఆర్‌తో మొర పెట్టుకున్నది. బుధవారం నల్లగొండలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్ వివాహానికి కేటీఆర్ హాజరయ్యారు. సమాచారం తెలుసుకున్న ఎంబీబీఎస్ విద్యార్ధిని మేకల వర్షిణి కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. నల్లగొండకు చెందిన వర్షిణి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. తన అక్క మేకల కౌశికి కూడా ఈ ఏడాది నార్కట్‌పల్లి కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్నది. ఎస్సీ విభాగానికి చెందిన మెడికల్ విద్యార్థులకు నిబంధనల ప్రకారం ఏడాదికి రూ.60వేల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే నేరుగా కాలేజీలకు చెల్లించాల్సి ఉన్నది. గత రెండేండ్లకు సంబంధించిన రీయింబర్స్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదు. ఇటీవల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న కౌశికి తన సర్టిఫికెట్లు తీసుకుందామని కాలేజీకి వెళ్తే ఫీజు పెండింగ్ ఉంది. అది క్లియర్ చేస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని తేల్చిచెప్పారు. ఇప్పటికిప్పుడు ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకునే స్థోమత లేని కౌశికి కుటుంబసభ్యులు కేటీఆర్‌కు తమ పరిస్థితిని వివరించారు. కేటీఆర్ స్పందిస్తూ… రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.