హైదరాబాద్ : రైతు తుడుం గణపతిది(Farmer Ganapathi) ముమ్మాటికి ప్రభుత్వ హత్యనేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. గణపతి ఆత్మహత్యపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో నానాకష్టాలు పడుతున్న రైతన్నల గోడు తెలుసుకునేందుకు గత నవంబర్ 18న నేను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌కు వెళ్లానని గుర్తు చేశారు. అంతకు ముందురోజే మీడియాతో ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ)కి గ్రామానికి చెందిన తుడుం గణపతి తన కష్టాలు చెప్పుకుంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యాడు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డులో ఉంటున్నా తన సోయాబీన్ పంటను కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాంగ్రెస్ సర్కారు ఇట్లాగే పంటను కొనకుండా వేధిస్తే తనకు మరణం తప్ప మరోమార్గం లేదని రోదించాడన్నారు. రుణమాఫీ కాక, రైతుభరోసా రాక, అప్పుల బాధ తీవ్రమై మూడు రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యనేనని మండిపడ్డారు. కాగా, రేవంత్ సర్కారు దుర్మార్గపు పాలనవల్ల తాజాగా మరో రైతు బలయ్యాడు. ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లి (బి) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి ఓ వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కిండు. తాను 14 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, దాదాపు 5 లక్షల రూపాయలు పెట్టుబడితే.. సాగునీరు సరిగా లేక, ఎరువులు సమయానికి దొరకక, పంట దిగుబడి తగ్గిందని.. పండిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే కొనేవాళ్లు లేరని పసిబిడ్డలా వెక్కివెక్కి ఏడ్చిండు.
ఈ అమ్ముడుపోని పంటను ఓ లీటర్ పెట్రోల్ తెచ్చి తగులబెట్టి, తాను తగులబడుడే మేలంటూ విలపించిండు. ఈ పంట అమ్ముడుపోకపోతే పరిస్థితి ఏందని వీడియో తీసిన వ్యక్తి ప్రశ్నిస్తే.. ‘ఏముంది సారూ.. ఇగ ఇంత పురుగుల మందు తాగి సచ్చుడే’ అని దుఃఖంతో వణుకుతున్న గొంతుతో చెప్పాడు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో చెప్పినట్టే రైతు తుడుం గణపతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుండు.