హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరికాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో కలిసి కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. కాగా, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు కూడా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌తోపాటు ఆయన కూడా విచారణకు వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.
కేటీఆర్ విచారణకు వస్తున్న నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. కార్యలయం వద్దకు ఎవరినీ అనుమించడం లేదు. అదేవిధంగా తెలంగాణ భవన్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదే కేసులో ఏసీబీ పిలుపు మేరకు ఈ ఏడాది జనవరి 6న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌ను లాయర్‌తో రానివ్వమంటూ ఏసీబీ అధికారులు గేటు బయటే అడ్డుకున్నారు. తాను కచ్చితంగా లాయర్తోనే వస్తానని చెప్పడంతో 40 నిమిషాల పాటు ఆయనను కారులోనే కూర్చోబెట్టి హైడ్రామా సృష్టించారు. ఈ క్రమంలో ఆయన మొదటిరోజు విచారణకు హాజరైనట్టు లిఖిత పూర్వకంగా రాసివ్వడంతో ఏసీబీ అధికారులు మరోసారి రావాలని చెప్పారు. అదేరోజు సాయంత్రం మళ్లీ నోటీసులిచ్చి జనవరి 9న విచారణకు రావాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో లాయర్‌తో వచ్చిన కేటీఆర్‌ను జనవరి 9న నలుగురు విచారణాధికారుల బృందం 7 గంటల పాటు ప్రశ్నించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానమిచ్చారు. రేస్ నిర్వహణ వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకే.. ఫార్ములా ఈ-కార్ రేస్‌ను నిర్వహించామని, మంత్రిగా విధానపరమైన నిర్ణయానికి సంతకాలు చేశానని, పైసా అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది? అని కేటీఆర్ అధికారులకు చెప్పారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్‌ను విచారించింది.
కేటీఆర్ విచారణకు వస్తున్నారని తెలిసి తెలంగాణ వ్యాప్తంగా ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నదన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. బంజారాహిల్స్ చుట్టుపక్కల, నగరంలోని జూబ్లీహిల్స్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక్క బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం పరిధిలోనే సుమారు 500 మందికిపైగా సిబ్బందితో మోహరించింది. తెలంగాణ భవన్, నందినగర్, బీఆర్ఎస్ ప్రముఖ నేతల ఇండ్ల వద్ద ఉదయం నుంచే బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా సుమారు 1500 మందికిపైగా సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తారని తెలిసింది.