KTR | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ఆఫర్ చేస్తున్నదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మీరు నిర్ణయించిన రేటెంత రాహుల్జీ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ అడిగారు.
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేస్తున్నదని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆరోపించిన వార్తను కేటీఆర్ ట్యాగ్ చేశారు. కర్ణాటకలో బీజేపీ ‘ఆపరేషన్ కమల’ను అమలు చేస్తున్నదని, అందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేసి రమ్మంటున్నదని, ఉప ఎన్నికల్లో వారికి నిధులను సమకూరుస్తామని హామీ ఇస్తున్నదని సిద్దరామయ్య ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎంతమొత్తం ముట్టజెప్తున్నదని కేటీఆర్ పరోక్షంగా నిలదీశారు. తెలంగాణలో ఆర్ఆర్ (రేవంత్ రెడ్డి) టాక్స్ కలెక్షన్లు త్రిపుల్ ఆర్, కల్కి2898 సినిమాల కలెక్షన్లు మించిపోయాయి కదా? అంటూ ఎద్దేవా చేశారు.