హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కపటంగా వ్యవహరించవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చురకలేశారు. ‘జేపీ నడ్డా.. మీ బీజేపీ పాలిత కర్ణాటకలో అవమానకర పరిస్థితి. సీఎం కావడానికి ఒక ఎమ్మెల్యే రూ.2,500 కోట్లు ఇస్తానన్నారటగా.. మరి మీ మిత్రపక్షాలు సీబీఐ, ఈడీ అప్పుడు ఎక్కడ ఉన్నాయి?’ అని కేటీఆర్ ట్విట్టర్లో ప్రశ్నించారు. విద్యలో 40%, కాంట్రాక్టర్ల నుంచి 40%, టూరిజంలో 40%, మఠాలకు గ్రాంట్ల జారీలో 30% కమీషన్లు కర్ణాటక ప్రభుత్వానికి ఇచ్చామంటూ పలువురు చేసిన ప్రకటనలు, పలు పత్రికల్లో వచ్చిన కథనాలను కేటీఆర్ పోస్ట్ చేశారు.
మోదీ ఇచ్చిన మెడికల్ కాలేజీలు సున్నా
ప్రధాని మోదీ తెలంగాణకు మంజూరు చేసిన మెడికల్ కాలేజీలు సున్నా అని మరో ట్వీట్లో మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య విద్యలో చరిత్ర లిఖించారని తెలిపారు. తెలంగాణలో 2014కు ముందు 67 ఏండ్లలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేస్తే, ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేశారని వివరించారు. జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 వైద్య కళాశాలలను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. సంగారెడ్డి, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తికావొచ్చిందని పేర్కొన్నారు. వనపర్తి, రామగుండం, జగిత్యాలలో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయని, త్వరలో కొత్తగూడెం మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని వెల్లడించారు. మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.