హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అవినీతి, అక్రమాలు, స్కాంలతో తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కాపాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను సోమవారం ఎక్స్ వేదికగా ఎండగట్టారు. తాము అడిగే ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బదులివ్వాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పార్టీకి ఏటీఎంలా మారితే ఎన్డీఏ సర్కారు ఎందుకు రక్షిస్తున్నది? బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధాని చేసిన ఆరోపణలపై చర్యలెందుకు తీసుకోవడంలేదు? రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా రూ.1137 కోట్ల విలువైన అమృత్ కాంట్రాక్ట్ అప్పగింతపై ఫిర్యాదు చేసినా విచారణకు ఆదేశించడం లేదెందుకు? కంచ గచ్చిబౌలి అటవీ భూమిలో ఆర్థిక మోసంపై దర్యాప్తు చేయాలని కేంద్ర సాధికార కమిటీ చేసిన సిఫార్సులను ఏం చేశారు? నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో పేరున్న రేవంత్‌ను ఎందుకు కాపాడుతున్నరు?’ అంటూ అమిత్‌షాకు ప్రశ్నాస్ర్తాలను సంధించారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ను ఏటీఎం సర్కారు అని గొంతు చించుకున్న అమిత్‌షా.. తానే హోమంత్రిననే విషయాన్ని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నదన్న సోయిని మరిచి ‘నయా గజిని’లా మారారని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ అవినీతి, అరాచకాలకు బీజేపీ అగ్రనేతలు వంతపాడుతున్నారని విమర్శించారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఇందుకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయని వివరించారు. కంచ భూముల వ్యవహారంలో భారీ కుంభకోణం ఉన్నది.. సమగ్ర దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ చేసిన సిఫారసులను కూడా కేంద్రం బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీకి రూ.4,400 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ కట్టబెట్టడంలో అవినీతి బహిరంగంగా కనిపిస్తున్నా మోదీ సర్కారు చోద్యం చూ డటం విడ్డూరంగా ఉన్నదని, పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులపై కేంద్రం ఇప్పటి వరకు ప్రకటన చేయకపోవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో సోనియా, రాహుల్‌తో పాటు రేవంత్‌రెడ్డి పేరు ఉన్నా ఆయనను విచారించకపోవడం రెండు పార్టీల మధ్య అనుబంధాన్ని బట్టబయలు చేస్తున్నదని చెప్పారు. కర్ణాటక వాల్మీకి కుంభకోణంలో ఓ తెలంగాణ కాంగ్రెస్ నేత బ్యాంకు ఖాతాల్లోకి రూ.45 కోట్ల నగదు బదిలీ జరిగిందని ఆధారాలున్నా బీజేపీ ప్రభుత్వం మౌనం వహించడంలోని ఉద్దేశమేమిటని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ బూటకపు నాటకాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో కర్రుకాల్చి వాతలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
మలబార్ గోల్డ్ బీఆర్ఎస్ ఘనతే
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మలబార్ గోల్డ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధం కావడం ఆనందంగా ఉన్నదని కేటీఆర్ తెలిపారు. ఈ కంపెనీని రాష్ర్టానికి తెచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని స్పష్టంచేశారు. 2021 సెప్టెంబర్‌లో ఎంవో యూ కుదుర్చుకున్నామని, 2022 అక్టోబర్‌లో ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందని గుర్తుచేశారు. ఈ కంపెనీ ఏర్పాటుతో 2 వేల మందికి పైగా యువతకు ఉపాధి దొరకడం గర్వకారణమని పేర్కొన్నారు.
యూనిఫాంలకు డబ్బుల్లేవా?
గురుకుల విద్యార్థుల యూనిఫాంలకు కాంగ్రెస్ సర్కారు డబ్బులివ్వకపోవడం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు. అందా ల పోటీలకు మాత్రం రూ. 200 కోట్లు దుబారా చేసిందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఘనకార్యాలు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టికి వెళ్లకపోవడం దురదృష్టకరమని, తన ట్వీట్‌తోనైనా కండ్లు తెరిచి సీఎం రేవంత్‌కు సూచనలు చేయాలని డిమాండ్ చేశారు.