హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): మంత్రి శ్రీధర్‌బాబు చెప్తున్న లాజిక్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంకా టీడీపీలోనే ఉన్నట్టేనా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘అతి తెలివి మంత్రీ.. మీ ‘చిట్టినాయుడు’ ఇంకా టీడీపీలోనే ఉన్నారా?’ అని ఎక్స్ ద్వారా నిలదీశారు. మంత్రి దుద్దిళ్ల చెప్తున్నది నిజమే అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కాంగ్రెస్ కండువాలు
కప్పుతున్న సన్నాసి ఎవరని మండిపడ్డారు. పార్టీలో చేర్చుకోవడం ఎందుకు? ఆపై పదవులు పోతాయన్న భయంతో నాటకాలు ఎందుకని ప్రశ్నించారు. అతి తెలివితో కోర్టును మోసం చేద్దాం అనుకున్నా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగలను జైల్లో పెట్టేందుకు ఎవరు అడ్డుపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్ముంటే చోటేభాయ్.. బడాభాయ్ బండారాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి బీజేపీ సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని అయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ను జైల్లో పెట్టేవాళ్లమన్న బండి వ్యాఖ్యలపై ఆయన ఎక్స్‌వేదికగా స్పందించారు. బడేభా య్.. చోటేభాయ్ బండారం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఓటు నోటు కేసులో అన్ని అధారాలతో అడ్డంగా దొరికిన దొంగకు బడేభా య్ ఏవిధంగా సహకరిస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన చోటేభాయ్ను జైల్లో ఎందుకు వేయడం లేదని నిలదీశారు. ఎవరు ఎవరిని కాపాడుతున్నారో అందరికీ తెలుసని పేర్కొన్నారు.
గురుకులాలపై చిన్నచూపు ఎందుకని కాంగ్రెస్ సర్కారును కేటీఆర్ ప్రశ్నించారు. ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తామని అబద్ధాలు ప్రచారం చేసి సమయానికి జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు గడిచేదెలా అని ప్రశ్నించారు. గురుకులాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణలేదని, వారి ప్రాణాలకు భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వక వారి కుటుంబాలను రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఒక్కరోజూ విద్యా వ్యవస్థపై సమీక్ష లేదని విమర్శించారు. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తంగలపల్లి గిరిజన గురుకుల పీఈటీనీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ నీతిమాలిన చర్యలను ధైర్యంగా ఎండగట్టిన విద్యార్థులకు తాము అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
డ్రామాల కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంతోపాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో మూడుసార్లు పాల ధర పెంచిదని, హిమాచల్ ప్రభుత్వం ఏకంగా గంజాయిని అమ్మడానికి పర్మిషన్ కావాలని అర్జీ పెట్టుకున్నదని, ఇక మన రాష్ట్రంలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నీ అమలు చేస్తామని డ్రామాలు ఆడి చివరికి ఏం చేస్తున్నదో ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రాగానే వ్యవసాయానికి కౌంట్‌డౌన్ షురూ అయిందని కేటీఆర్ విమర్శించారు. పదేండ్లు పచ్చగా ఉన్న తెలంగాణలో వ్యవసాయ చిచ్చుమొదలైందని విమర్శించారు. వ్యవసాయ విప్లవం సాధించిన తెలంగాణలో సాగువిస్తీర్ణం తగ్గడం కౌంట్‌డౌన్‌కు తొలి ప్రమాద హెచ్చరిక అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలసాగులో పంజాబ్‌నే తలదన్నే స్థాయికి అనతికాలంలోనే ఎదిగామని ఆనందపడ్డాం. దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ రైతన్న దేశం కడుపునింపే ఎత్తుకు ఎదిగాడని గర్వపడ్డాం. ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతల బతుకులు వ్యవసాయ విప్లవంతో బాగుపడ్డాయని సంబురపడ్డాం. కానీ, కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి కౌంట్ డౌన్ షురూ అయింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.