హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో శేరిలింగపల్లి నియోకవర్గానికి చెందిన పలువురు నాయకులు వివిధ పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను మోసం చేసిందని అన్నారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా ఈ రేవంత్ సర్కారు నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడి పోయినయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యకుండా నిరుద్యోగులను మోసం చేసిండ్రని ఆరోపించారు.
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారని కేటీఆర్ చెప్పారు. నిన్న దిల్‌సుఖ్‌నగర్‌లో, ఇవాళ అశోక్‌నగర్‌లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. జాబ్ నోటిఫికేషన్లు ఎక్కడ రాహుల్‌గాంధీ అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సెమీఫైనల్ లాంటివని, ఈ ఎన్నికల్లో చాకుల్లాంటి కుర్రోళ్లను అభ్యర్థులుగా నిలబెడుతామని, గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.