Farmers | (సూర్యాపేట నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ వేళ వరంగల్‌లో తలపెట్టిన భారీ సభ విజయవంతం కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇది ముఖ్య కార్యకర్తల సమావేశం కానీ, వారికంటే రైతులే ఎకువగా సమావేశానికి తరలిరావడం ఆశ్చర్యమనిపించింది.
హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో జాతీయ రహదారిపై పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల, నారట్పల్లి, నకిరేకల్ తదితర రాస్తాల వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సూర్యాపేట కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి కనురెప్ప వాల్చకుండా ఆయన వైపే చూస్తున్నడు. ‘నువ్వు బీఆర్ఎస్ కార్యకర్తవా?’ అని కదిలిస్తే..‘కాదు సారు.. రైతును’ అన్నడు. ఊరు, పేరు అడిగితే తీగల యాదగిరి అని, ఆత్మకూరు మండలం ఎనుబాముల ఊరని చెప్పిండు. ఇటెందుకు వచ్చినవ్ అని మాట కలిపితే ‘కేసీఆర్ కొడుకు వస్తాండని మా ఊళ్లె అనుకుంటుంటె విని వచ్చిన’ అని చెప్పిండు.
‘ఆ సారుతో నీకేం పని?’ అని ప్రశ్నిస్తే ‘రేవంత్ పాలన ఇంకా మూడేండ్లు ఉన్నదట.. అన్నేండ్లు ఉంటే రైతులు బతకరయ్యా. నీళ్లందక పంటలు ఎక్కడియక్కడ ఎండుతున్నయి. కేసీఆర్ వస్తేనే మళ్ల నీళ్లు జూస్తం. నన్ను సారు దగ్గర దాక పోనిస్తే ఎట్టనన్న జేసి నాయినను గద్దె మీదికి తీస్కరమ్మని సెప్పాలె అని వచ్చిన’ అని వివరించాడు. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 60 వేల ఎకరాల్లో వరి ఎండినట్టు రైతులు చెప్తున్నారు. బత్తాయి, నిమ్మతోటలను కాపాడుకునేందుకు బోర్లమీద బోర్లు వేయడమే కాకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.
తెల్లని బుర్ర మీసాలతో, తలకు రుమాలు చుట్టుకున్న రైతు ఈర్యా నాయక్ సమావేశ ప్రాంగణం బయట తిరుగుతూ కనిపించాడు.. ఆయనను పలకరిస్తే ‘నిరుడు ఈ యాళ్లప్పుడు కళకళలాడిన సెరువులు ఇయ్యాల జూడు ఎట్టున్నయో! ఓటేసిన పాపానికి కప్పల పెండ్లిళ్లు జెయ్యవడితిమి. కేసీఆర్ ఉన్నప్పుడు మండు టెండకాలం మత్తళ్లు దుంకినయి. అగో ఆ సెర్వు (సూర్యాపేట ఆంచునే ఉన్న నల్ల చెరువును చూపిస్తూ) పచ్చారబోసినట్టుండేది. పంట సేన్లు నెత్తులిరబోసుకొని పచ్చందాలతో పకపకా నవ్వినట్టుండేటియి. రేవంత్‌రెడ్డి వచ్చిన కాంచి సెరువు ఎనుకబడె’ అని తన అనుభవాన్ని చెప్పిండు.
‘పదేండ్లు సకగ సాగిన ఎవుసం, కాంగ్రెస్ వచ్చిన నుంచే ఆగమైంది’ అని తుంగతుర్తి మండలం బండరామారానికి చెందిన తాటికొండ సీతయ్య చెప్పిండు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా సుక నీళ్లు తెస్తలేరు. పొట్టమీది సేండ్లను పశువులకు ఇడిసిపెడుతున్నం’ అని ఆవేదనచెందాడు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఎల్-27 లిఫ్ట్‌కు ఉన్న మోటర్లను పన్ను కట్టలేదని లషర్లు తీసుకెళ్లినట్టు పెన్ పహాడ్ మండలం లింగాల రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడేనికి చెందిన మట్టపల్లి శ్రీశైలం, సింహాద్రి మాట్లాడుతూ రైతులు, కూలీల సేతుల సిల్లు గవ్వ లేకుండైంది. ఇది చూసి మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లు ఊర్ల మీద పడ్డరు. కొందరితోటి గ్రూపులు కట్టి అప్పులిస్తున్నరు. నూటికి 5 శాతం కంటే ఎక్కువ వడ్డీకి అప్పులిచ్చి బలవంతంగా వసూళ్లు చేస్తున్నరు’ అంటూ చెప్పారు.
‘కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది? అగో.. ఆ సెర్వెనుక (నల్ల చెరువు దికు చూపిస్తూ) పచ్చారబోసినట్టుండేది. పంట సేన్లు నెత్తులిరబోసుకొని పచ్చందాలతో పకపక నవ్వినట్టుండేవి. నిరుడు ఈ యాళ్లకు సెరువులు మత్తళ్లు దుంకినయి. ఇప్పుడు కాల్వల నీళ్లు రాక కండ్లళ్ల రావట్టే. చెరువులు ఎండి.. బోర్లు నీళ్లు పొయ్యక ఆగమయ్యే కాలమచ్చె. రేవంత్ పాలన ఇంక మూడేండ్ల దిన పొద్దు ఉన్నదట! అన్నేండ్లుంటే రైతులు బతకరయ్యా’
– సూర్యాపేట జిల్లా రైతుల కన్నీటి వ్యథ ఇది!