రేవంత్‌రెడ్డీ.. ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే బయటపెట్టు! ప్రజలకు కూడా తెలుస్తది! ఏ ఊరిలో ఎంత మంది భూ యజమానులు, కౌలురైతులు ఉన్నరో స్పష్టంగా చెప్పాలి. ఏ ఊరిలో ఎంతమందికి బోనస్ ఇచ్చావో బయటపెట్టు. రైతు కూలీలు ఎంత మంది ఉన్నరో బయటపెట్టు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు అఫిడవిట్లు దేవుండ్ల వద్ద పెట్టారు.. మేం రాగానే అమలు చేస్తామని డిక్లరేషన్ల పేరిట బిల్డప్లిచ్చారు. ఇప్పుడు దికుమాలిన విధానాలు తెస్తున్నరు. -కేటీఆర్
KTR | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ తెచ్చిన విప్లవాత్మకమైన రైతుబంధు పథకాన్ని ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు (సెల్ఫ్ డిక్లరేషన్లు) ఇవ్వాలి? అని ప్రశ్నించారు. ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సింది రైతులు కాదని, రేవంత్‌రెడ్డి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని దేవుళ్లపై ఒట్టేసిన రేవంత్‌రెడ్డి, నేడు కొందరికే కొన్ని ఇస్తామని కోతలు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. ‘ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే జాబితా బయటపెట్టు. ఏ ఊరిలో బోనస్ ఎంత మందికి ఇచ్చావో చెప్పు. ఒక్కో గ్రామంలో కౌలు రైతులు, రైతు కూలీలు ఎంత మంది ఉన్నారో బయటపెట్టు. రైతు వేదిక వద్ద లిస్టుపెట్టు. రూ.22 వేల కోట్ల రైతుబంధు నిధులు ఎక్కడ పక్కదారి పట్టినవో చెప్పు.
ఏ రైతు, ఏ లబ్ధిదారుడు అక్రమంగా పొందాడో, ప్రతి ఊరిలో ఇందుకు సంబంధించిన లిస్టు పెట్టు. రైతులను దొంగలుగా చిత్రీకరిస్తే ఊరుకోబోం. మంత్రిమండలిలో రైతుబంధుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి. రైతుల పక్షాన ప్రభుత్వం మెడలు వంచేందుకు రెండు మూడురోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తం’ అని హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, పద్మాదేవేందర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వచ్చాక ప్రజాపాలన పేరిట కోటీ 6 లక్షల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించిందని, ఈ సమాచారం అంతా ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడు కొత్తగా రైతుల నుంచి ఎందుకు ప్రమాణ పత్రాలు అడుగుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
మేము జమచేసిన డబ్బులే
‘ఎన్నికల్లో చెప్పకున్నా, హామీ ఇవ్వకున్నా రైతుల కోసం కేసీఆర్ రైతుబంధును అమలుచేశారు. రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చిన ఏకైక నాయకుడు దేశ చరిత్రలో కేసీఆర్ ఒకరే. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా, ఎలాంటి దరఖాస్తులు తీసుకోకుండా రైతుబంధు అందించాం. 11 సీజన్లలో రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశాం. 12వ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన డబ్బు సిద్ధంగా పెట్టాం. కానీ, ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఉత్తరం రాసి ఆపించింది. సంవత్సరం దాటిపోయినా ఇప్పుడు రూపాయి కూడా రైతుభరోసా రూపంలో రైతులకు ఇవ్వలేదు. ఆ రోజు మేము జమచేసిన రూ.7,500 కోట్లనే రైతు భరోసా పేరుతో ఇచ్చారు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
ఎకరానికి 15 వేలు ఏవీ?
‘ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్‌గాంధీని తీసుకొచ్చి రైతులను ఉద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ పోజులు కొట్టింది. ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని చెప్పింది. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రకటించింది. వ్యవసాయ రంగానికి అనేక హామీలిచ్చింది. ఇప్పుడు రైతులతో మళ్లీ ప్రమాణపత్రాలు తీసుకోవడం సిగ్గుచేటు..వానకాలం పంట పెట్టుబడి ఎగ్గొట్టారు. వదిలిపెట్టం’ అని కేటీఆర్ హెచ్చరించారు. ప్రమాణ పత్రాల పేరుతో రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టాలని చూస్తున్నదని విమర్శించారు. ప్రజల సొమ్మును రైతులు తింటున్నారన్న దుష్ప్రచారాన్ని ఆపాలని, రైతులను దొంగలుగా చిత్రీకరించి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. హామీలు అమలుచేసే సత్తా లేకుంటే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. గతంలో ప్రధాని మోదీ సైతం తన తప్పును తెలుసుకొని రైతులకు క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు.
ఎక్కడ దుర్వినియోగమైందో చెప్పండి
‘కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తానని చెప్పినట్టే.. రేవంత్‌రెడ్డి రైతుబంధును కూడా మింగేస్తాడని రైతులు గ్రహించాలి. రైతుబంధులో రూ.22 వేల కోట్లు పకదారి పట్టాయని సీఎం, అధికారులు బద్నాం చేస్తున్నరు. మరి రూ.22 వేల కోట్లు ఎవరి ఖాతాల్లోకి పోయాయో ప్రజలకు తెలియాలి. దమ్ముంటే ఏ ఊర్లో ఎంత మేర రైతుబంధు దుర్వినియోగమైంది. గ్రామ గ్రామాన జాబితా ప్రచురించాలి. రైతుబంధు దుర్వినియోగం చేసిన రైతుల పేర్లను కూడా పెట్టండి. అప్పుడు తెలుస్తది నిజంగానే కాంగ్రెస్ చెప్పింది అబద్ధమా? నిజమా? ఇసాబ్.. కితాబ్ మొత్తం తేలుస్తరు. కేవలం రైతులను ప్రజల ముందు పలుచన చేసే కుట్ర చేస్తున్నది’ అని కేటీఆర్ మండిపడ్డారు. ‘పత్తి, కంది, చెరుకు, పసుపు వంటివి ఏటా రెండుసార్లు పండవు. అయినా ఆయా రైతులకు, పంట్ల తోటల రైతులకు రైతుబంధు ఇచ్చినం. రైతుబంధు దుబారా అయిందని ఈ ప్రభుత్వం అడ్డగోలు అబద్ధాలు ఆడుతున్నది. ఇది పచ్చి దొంగమాట. రైతు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే నాడు రెండో పంట కింద పసుపు, కంది, చెరుకు రైతులకు కూడా రైతుబంధు వేశాం. ఇప్పుడు అడ్డమైన మాట లు మాట్లాడుతున్నారంటే రైతుబంధుకు బొందపెట్టడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తున్నది. ఇప్పుటిదాకా కొన్న పంట వివరాలు, ఇచ్చిన బోనస్ వివరా లను గ్రామంలో పెట్టాలి’ అని డిమాండ్ చేశారు.
ఊరూరా నిలదీయండి
‘రైతన్నలూ ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చినం.. మళ్లీ ప్రమాణపత్రం ఎందుకని నిలదీయండి. 70 లక్షల ఖాతాలు నీ ద గ్గర ఉన్నయి.. పొలం వివరాలు అన్నీ తెలుసు.. తెలి సీ ఈ ప్రయత్నం చేస్తున్నావంటే కటింగ్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నవ్.. కాబట్టి రైతులు ఊరురా కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీయాలి. ఊరికి వచ్చే అధికారులను అడగండి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘వరంగల్ రైతు డిక్లరేషన్‌ను సంపూర్ణంగా అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. రాష్ట్రంలోని 22 లక్షల కౌలు రైతులకు రేవంత్‌రెడ్డి నాడు ఉత్తరం రాశారు. నేడు రైతుబంధు, రైతు భరోసాను కుదించే కుట్రను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉన్నది. రేపటి నుంచి పలు రకాల కార్యక్రమాల రూపంలో రైతులను చైతన్యవంతం చేస్తాం. సంక్రాంతిలోగా రైతు భరోసాను అమలుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం’ అని కేటీఆర్ వెల్లడించారు.
బాకీపై ఊరూరా పోస్టర్లు వేస్తాం..
ప్రభుత్వం ఇప్పటికే ఒకో రైతుకు ఒకో ఎకరానికి రూ.17,500 చొప్పున మొత్తం రైతులకు రూ.26 వేల కోట్లకు పైగా బాకీ పడింది. ప్రభుత్వానికి దమ్ముంటే రైతులకు ఇచ్చిన డబ్బుల విషయంపై ప్రమాణ పత్రాలు ఇవ్వాలి. మేము రూపాయి దుర్వినియోగం కాకుండా కోటీ 52 లక్షల మందికి రైతుబంధు వేసినం. రైతులకు ఇవ్వాల్సిన బాకీ పోస్టర్లను ఊరూరా అంటిస్తాం’ అని కేటీఆర్ హెచ్చరించారు.
వండర్‌కిడ్ ఉపాసనకు కేటీఆర్ అభినందన
రెండున్నరేండ్ల చిన్నారి ఉపాసన ప్రతిభకు కేటీఆర్ అచ్చెరువొందారు. అద్భుత జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డులను నెలకొల్పి అందరి ప్రశంసలు అందుకుంటున్న తీరుకు ముచ్చటపడ్డారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన వండర్ కిడ్ ఉపాసన, ఆ చిన్నారి తల్లిదండ్రులు అనూష, శివప్రసాద్ శ్రీరంగం శుక్రవారం హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో కేటీఆర్‌ను కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉపాసన తన అద్భుత జ్ఞాపకశక్తి, ప్రతిభాపాటవాలతో నోట్‌బుక్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ టాలెంటెడ్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నది. కేటీఆర్‌ను కలిసిన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటోను తెలంగాణ పటం పజిల్‌గా అతివేగంగా పూరించి ‘ఔరా’ అనిపించింది. కేటీఆర్ తాతను కలిసి మాట్లాడుతానంటూ ఉపాసన తన ఆకాంక్షను వ్యక్తంచేసింది. ఉపాసన భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఉపాసన సాధించిన రికార్డుల పత్రాలపైన ఆ చిన్నారి తల్లిదండ్రులు కేటీఆర్ సంతకాన్ని జ్ఞాపకంగా తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వై సతీశ్‌రెడ్డి, రాకేశ్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీలిచ్చిండ్రు. ఇప్పుడేమో రైతుబంధు కోసం రైతులు ప్రమాణపత్రం ఇవ్వాల్నట! ఇంతకంటే చిత్రమైన ముచ్చట వినలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన, అభయహస్తం కింద అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కోసం కోటీ 6 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నరు. మరి ఈ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలె కదా? అవి ఎటు పోయినయ్? ఇప్పుడెందుకు కొత్తగా రైతులను ప్రమాణ పత్రాలు అడుగుతున్నరు? -కేటీఆర్
ప్రభుత్వానికి దమ్ముంటే గ్రామగ్రామాన రైతుభరోసా లబ్ధిదారుల జాబితా పెట్టాలి. గ్రామాల్లో కౌలు రైతులకు, రైతు కూలీలకు ఏ విధంగా రైతుబంధు ఇస్తదో కాంగ్రెస్ ప్రభుత్వమే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. గతంలో మా ప్రభుత్వం రైతులే శాసించేలా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారిని యాచించే దుస్థితికి తెచ్చింది. మేము రైతును రాజుగా చేస్తే ఈ ప్రభుత్వం వారిని బిచ్చగాళ్లుగా తయారు చేస్తున్నది. -కేటీఆర్