KTR | హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే బొగ్గు గనులను ఆ సంస్థకు కేటాయించకుండా వేలం వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. కేసీఆర్ అధికారంలో ఉండగా బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీజేపీకి సహకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు 16 మంది ఎంపీలు ఉండి ఉంటే నామినేషన్‌పై బొగ్గు గనులు సింగరేణికి వచ్చి ఉండేవని పేర్కొన్నారు.
తెలంగాణ ఎంపీలు దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గతంలో వీటిపై ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని నిలదీశారు. గురువారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేది మళ్లీ బీఆర్ఎస్సేనని, అప్పుడు వాటిపై నిర్ణయం తీసుకుంటాం కాబట్టి వేలంలో పాల్గొనేవారు ఇబ్బందులు పడొద్దనిముందే హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. సింగరేణికి నాలుగు బొగ్గు గనులు కేటాయించాలని, వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు క్యాపిటివ్ మైనింగ్ లేకుండా చేసి నష్టాల్లోకి నెట్టారు. ఆ తర్వాత నష్టాల పేరుతో అమ్మేయాలని చూస్తున్నారు. ఇప్పు డు అచ్చం అదే పాలసీని సింగరేణికి ఆపాదించాలని చూస్తున్నారు.
-కేటీఆర్
సింగరేణిని ఖతం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ
తెలంగాణ రాష్ర్టానికి, అస్థిత్వానికి బీఆర్ఎస్ మాత్రమే రక్షణ కవచమని, శ్రీరామ రక్ష అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ వేలసార్లు చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకశక్తిగా ఉంటామని కేసీఆర్ చెబితే, 16 సీట్లతో ఏం చేసుకుంటారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారని మండిపడ్డారు. ఏపీలో 16 సీట్లు గెలుచుకున్న టీడీపీ వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నదని, కానీ చెరో 8 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, బీజేపీ సింగరేణిని ఖతం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం పెట్టి దుర్మార్గమైన కొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్నారని మండిపడ్డారు. వేలంపాట ద్వారా గనులు కేటాయించవద్దంటూ 8 డిసెంబర్ 2021న కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణిలో రాష్ర్టానికి 51శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నదని తెలిపారు.
కేసీఆర్ లేఖ రాసిన వెంటనే డిసెంబర్ 11న అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా కోల్‌బ్లాక్‌లను వేలం వేయవద్దని, వాటిని సింగరేణికి కేటాయించాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. అంతలోనే ఇప్పుడు ఏం మార్పు వచ్చిందని, గనుల వేలానికి ఇప్పుడు ఎందుకు మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. కేసుల భయమా? లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అని నిలదీశారు.
2028లో మేం అధికారంలోకి వచ్చాక వేలం నిర్ణయాన్ని సమీక్షిస్తాం. కాబట్టి వేలంలో పాల్గొనే ప్రైవేటు కంపెనీలు తొందరపడొద్దని ఇప్పుడే చెప్తున్నం. ఆ తర్వాత మమ్మల్ని తప్పుబట్టవద్దు.
-కేటీఆర్
స్లీల్‌ప్లాంట్ ప్లానే.. సింగరేణికి
నష్టాల పేరుతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైతే ప్రైవేటీకరిద్దామని అనుకున్నారో, సింగరేణిని కూడా అలాగే చేద్దామని అనుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ కోసమే గనులు కేటాయించకుండా వేలాన్ని ముందుకు తీసుకొచ్చారని ఆరోపించారు. 23 ఫిబ్రవరి 2016లో ఒడిశాలోని నైవేలి లిగ్మైట్ కార్పొరేషన్‌కు అప్పటి మోదీ ప్రభుత్వం రెండు గనులు, 2015లో గుజరాత్‌లోని రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు నాలుగు కోల్‌బ్లాక్‌లను కేటాయించినట్టు గుర్తుచేశారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభ్యంతరంతో వేలం లేకుండా మూడు లిగ్మైట్ గనులను కేటాయించారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి స్వయంగా తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పేర్కొన్నారని తెలిపారు. మరి సింగరేణికి మాత్రం గనులు ఎందుకు కేటాయించరని ప్రశ్నించారు. దీనివెనక సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్ర దాగి ఉన్నదన్న అనుమానాన్ని వ్యక్తంచేశారు.
గనుల వేలం వద్దని పీసీసీ హోదాలో లేఖ రాసిన రేవంత్‌లో అంతలోనే ఏం మార్పు వచ్చింది. వేలానికి ఇప్పుడెందుకు మద్దతునిస్తున్నారు. వేలానికి స్వయంగా మంత్రి భట్టిని పంపుతున్నరు. కేసుల భయమా? లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?
-కేటీఆర్
సింగరేణి బలపడితే రాష్ర్టానికి బలం
తొమ్మిదేండ్లు తమ మెడపై కత్తిపెట్టినా వేలం జరగకుండా అడ్డుకున్నామని కేటీఆర్ తెలిపారు. సింగరేణి బలపడితే కార్మికులు బలపడతారని, సింగరేణి బలపడితే రాష్ట్రం బలపడుతుందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు 36 రోజులు సమ్మె చేస్తే దక్షిణభారతదేశం మొత్తం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు.
సింగరేణిని బీఆర్ఎస్ తప్పకుండా కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే మనకు ఏదైనా ప్రాజెక్టు రావాలి కానీ, ఉన్నది అమ్మే పరిస్థితి తెచ్చారని దుమ్మెత్తి పోశారు. బీజేపీకి 8 సీట్లు ఇస్తే ప్రజలకు వారిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అని ప్రశ్నించారు. శుక్రవారం నాటి వేలంలో డిప్యూటీ సీఎం ఎందుకు పాల్గొంటున్నారని, వేలంలో పాల్గొనడం అంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇస్తున్నట్టేనని పేర్కొన్నారు.
బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకశక్తిగా ఉంటామని కేసీఆర్ చెబితే, 16 సీట్లతో ఏం చేసుకుంటారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో 16 సీట్లు గెలుచుకున్న టీడీపీ వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నది. చెరో 8 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, బీజేపీ సింగరేణిని ఖతం చేస్తున్నాయి.
-కేటీఆర్
సింగరేణిని కాపాడేది బీఆర్ఎస్సే
సింగరేణిని కాపాడేది, కాపాడగలిగేది కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణిపై కేంద్రం కత్తిపెడితే కాంగ్రెస్ ఆ కత్తికి సానపెడుతున్నదని దుయ్యబట్టారు. కార్పొరేట్ గద్దలకు బొగ్గు గనులు కేటాయించేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
2028లో తాము అధికారంలోకి వచ్చాక ఈ నిర్ణయాన్ని సమీక్షించి అడ్డుకుంటామని, కాబట్టి వేలంలో పాల్గొనే ప్రైవేటు కంపెనీలను తాము ఇప్పుడే హెచ్చరిస్తున్నాని, అప్పుడు తమను తప్పుబట్టవద్దని సూచించారు. బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండుమూడు రోజుల్లో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ వివరించారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, హరిప్రియానాయక్, ఆనంద్‌కుమార్, చందర్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు.
రాష్ట్రం నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే మనకు ఏదైనా ప్రాజెక్టు రావాలి. కానీ, ఉన్నది అమ్మే ప్రయత్నం చేస్తున్నరు. బీజేపీకి 8 సీట్లు ఇస్తే ప్రజలకు వారిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?
-కేటీఆర్