హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ బాధితులకు ‘స్పర్శ్ హాస్పిస్’ సంస్థ అందిస్తున్న సేవలు, చొరవను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. బంజారాహిల్స్లో రోటరీ క్లబ్ ఏర్పాటుచేసిన ఈ ధర్మశాల.. క్యాన్సర్ రోగులకు ఇతోధికంగా సేవలు అందిస్తున్నదని గురువారం ఎక్స్ వేదికగా కొనియాడారు. సంస్థ సేవలను కొనసాగించాలని తన వంతుగా రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.
‘కొత్త వసతులు, అధునాతన హంగులతో నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకున్నందుకు స్పర్శ్ హాస్పిస్ బృందానికి నా అభినందనలు. క్యాన్సర్తో బాధపడుతున్న వారికోసం మీరు చేస్తున్న అద్భుతమైన పనిని కొనసాగించండి. రూ.10 లక్షల విరాళంతో నా మద్దతు అందిస్తున్నా. మీ అందరినీ రోగులకు సాయం చేయాలని కోరుతున్నా. జీవితం ముగిసే సమయంలో ప్రతి ఒక విరాళం గొప్ప అవకాశంగా ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు.