మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రియల్ ఎస్టేట్ లూటీకి తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ హోటల్లో ‘పవర్’ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట ఫక్తు రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించింది. నిర్వాసితులను కాకుండా వైట్ కాలర్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలిచి అబ్రకదబ్ర గారడీతో రంగుల ప్రపంచాన్ని ‘తెర’పై చూపింది. ధనార్జనే ధ్యేయంగా భావించేవాళ్లు పాలకులుగా ఉంటే జరిగే విధ్వంసాన్ని కండ్లకుగట్టింది.
మరోవైపు మానవత్వం ఉన్న నాయకులు అధికారంలో ఉంటే ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ప్రజలకు మేలు కలిగిస్తుందనే వాస్తవం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ‘పబ్లిక్ పాయింట్’ ప్రజెంటేషన్‌తో సుస్పష్టమైంది.
మూసీ డీపీఆర్‌లో కనీసం నిర్వాసితుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోకుండా రేవంత్ సర్కార్ నియంతృత్వానికి పోతే.. నదీ పరీవాహక ప్రాంత బాధితుల గోడు స్వయంగా వారి నోటి వెంటే కేటీఆర్ ప్రపంచానికి వినిపించారు. ప్రాజెక్టుతో ఎవరైతే సర్వస్వం కోల్పోతున్నారో వారి మధ్యకే వచ్చి వాస్తవాలు బయటపెట్టారు.
లక్షలాది మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ‘మూసీ పునరుజ్జీవ’నాన్ని ఒక్క ఇటుక కూడా కూల్చకుండా ఎలా చేసి చూపించాలో.. ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేం చేసిందో కూలంకశంగా వివరించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇంటినీ కూల్చకుండా.. పేదోడి గుంట భూమి తీసుకోకుండా.. చుక్క మురుగునీరు మూసీలో కలువకుండా వరల్డ్ క్లాస్ డిజైన్లతో రూ.16,634 కోట్లతో మూసీ సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మూసీ వెంబడి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిన సీఎం రేవంత్‌రెడ్డి, చేప పేరు చెప్పి చెరువును మింగే కుట్రలు చేస్తున్నడు.
రెండు వేల కిలోమీటర్ల మేర ప్రవహించే గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే ప్రాజెక్టుకు రూ.42వేల కోట్లు ఖర్చుపెడితే.. కేవలం 55 కిలోమీటర్ల పొడవైన మూసీ నది సుందరీకరణకు లక్షన్నర కోట్ల ఖర్చు ఎట్లయితది?
మేధా పాట్కర్ లాంటి మేధావులు, మహాత్ముడి మునిమనుమడైన తుషార్ గాంధీ లాంటి వ్యక్తులే గాంధీ సరోవర్.. మూసీ పేరిట జరిగే విధ్వంసానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నరు. అయినా మహాత్ముడి పేరుతో లక్షల కోట్ల విలువ చేసే భూములు కొల్లగొట్టి, లక్షలాది మందిని రోడ్డున పడేసే కుట్రలకు రేవంత్‌రెడ్డి తెరలేపుతున్నడు.
– కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14(నమస్తే తెలంగాణ): మూసీ వెంబడి ఉన్న ఇంటికి జీరో వాల్యూ ఉన్నదంటూనే రేవంత్‌రెడ్డి సర్కార్ సేకరించే మూడు వేల ఎకరాల భూముల విలువే రూ.లక్షన్నర కోట్లు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. పేదల ఇండ్లు కూల్చి, ఖజానా నింపుకొనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళికలను, కాంగ్రెస్ అవినీతిని అడ్డుకుంటామని మరోసారి స్పష్టంచేశారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, అయితే, ప్రాజెక్టు పేరిట వేల ఎకరాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. శనివారం మూసీ పరీవాహక ప్రాంత బాధితులతో హిమాయత్‌సాగర్‌లో ఏర్పాటు చేసిన ‘పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్’ చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి, పాలనలో కూలిన ఇండ్లు, మూసీ పేరిట కూల్చబోయే నిర్మాణాలు, బఫర్ జోన్ పేరిట పేదలను ఆగం చేస్తున్న విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేటీఆర్ వివరించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మూసీ పునరుజ్జీవానికి కేసీఆర్ చేపట్టిన నిర్మాణాత్మక ప్రణాళికలు, బడ్జెట్ వివరాలు, ప్రతిపాదనలు, అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన డిజైన్ల వివరాలను బాధితుల ఎదుట ప్రదర్శించారు. 400 ఏండ్ల్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరానికి, మూసీ నదితో ఉన్న బంధం ఎన్నటికీ విడదీయలేనిదని కేటీఆర్ పేర్కొన్నారు. నిజాం కాలంలో జీవనదిలా నగరంలో ప్రవహించిన మూసీని, ఆ తర్వాత కాలంలో కాలుష్య కాసారంగా, ఆక్రమణలకు వేదికగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యమే ఆ తర్వాత వచ్చిన ముంపు ఘటనలకు కారణమని పేర్కొన్నారు. జీవనది మూసీని మొదటి నుంచి 2013 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా మార్చుకుని, పునరుజ్జీవం పేరిట మనుగడ లేకుండా చేసిందని ఆరోపించారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాతే కేసీఆర్ హయాంలో నీళ్లు, నిధులు, ప్రాజెక్టులకు ఆదరణ వచ్చిందని వివరించారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో ప్రజాధనం దుర్వినియోగానికి తావు లేకుండా అతి తక్కువ అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ నగరం నెత్తిన ఉన్న జంట జలాశయాలకు తీసుకొచ్చే ప్రణాళికలు వేశారని వివరించారు.
మూసీ నిర్వాసితులు లేకుండా కేవలం వైట్ కాలర్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేదిక తరహాలో ఫైవ్ స్టార్ హోటళ్లలో మూసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. అసలు మూసీ బాగు కోసం చూస్తున్నారా? లేక మూసీ వెంట విస్తరించి ఉన్న భూముల కోసం పనిచేస్తున్నారా?
– కేటీఆర్
కేసీఆర్ హయాంలో కేవలం రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతోనే నిత్యం 2 టీఎంసీల నీటిని గ్రావిటీలా మార్చితే… అవే ప్రతిపాదనలను రూ.10వేల కోట్లకు రేవంత్‌రెడ్డి పెంచారని విమర్శించారు. నగరంలో రూ.16,634 వేల కోట్లతో, ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా, పేదోడి గుంట భూమిని కూడా తీసుకోకుండా, చుక్క మురుగు నీరు మూసీలో కలువకుండా వరల్డ్ క్లాస్ డిజైన్లతో మూసీ సుందరీకరణ కోసం సిద్ధం చేసిన ప్రణాళికలను కాంగ్రెస్ సర్కార్ పక్కనపెట్టిందని దుయ్యబట్టారు. మూసీ వెంబడి రియల్ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిన సీఎం రేవంత్‌రెడ్డి, మూసీ బఫర్ జోన్ పేరిట రూ.లక్షన్నర కోట్ల విలువ చేసే భూములను తీసుకునే కుట్రకు తెరలేపారని ఆరోపించారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్‌రెడ్డి… అందాల పోటీలకు వందల కోట్లు, ఫుట్‌బాల్ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశారని కేటీఆర్ విమర్శించారు. హామీలు అమలు చేసేందుకు రూపాయి పుడ్తలేదని, అప్పు కోసం పోతే దొంగల్లా చూస్తున్నారని చెప్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌కు.. మూసీ సుందరీకరణ కోసం లక్షల కోట్ల నిధులు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు. పేదల భూములను తీసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి… వారికి పరిహారం ఎక్కడి నుంచి ఇస్తారని నిలదీశారు.
మూసీకి రూ.16,634 కోట్లతో పునరుజ్జీవం పోసేలా కేసీఆర్ పనులు చేపట్టి.. కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలా రేవంత్‌రెడ్డి చేతిలో పెడితే.. ఆయన మాత్రం తొలి దశలోనే 3,320 ఎకరాల భూముల స్వాధీనం చేసుకుంటున్నడు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరి కొంపలు కూల్చాలని చూస్తున్నడు?
– కేటీఆర్

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మూసీ ప్రక్షాళనకు ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఈ నదిపై ఇన్నాళ్లు జరిగిన దోపిడీని నిలువరించేలా, ప్రణాళికాబద్ధమైన విధానంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని కేటీఆర్ వివరించారు. దీనికి ప్రత్యేక నిధులు కేటాయించి, అసలు మూసీ నదిని ఎలా డెవలప్ చేయాలనే నిర్మాణాత్మకమైన ఆలోచనతో బీఆర్ఎస్ అడుగులు వేసిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదీ పరీవాహక ప్రాంతాలను సందర్శించి, అక్కడ జరిగిన అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని, ఒక ప్రత్యేక విధివిధానాలతో మూసీ పునరుజ్జీవానికి బీజం వేశామని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ డిజైన్ సంస్థలను గ్లోబల్ టెండర్ల ద్వారా ఆహ్వానించి, అత్యుత్తమ డిజైన్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు.
సుదీర్ఘ చర్చలు, అధ్యయనాల తర్వాత… మూసీ నది జలావరణం దెబ్బతినకుండా, మూసీ రివర్ బెడ్లో ఉండే నిర్మాణాలకు తప్ప.. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉండే ఏ ఒక్క ఇంటికి ఇబ్బంది లేకుండా గ్లోబల్ డిజైన్లు తయారు చేశామని చెప్పారు. మూసీపై 15 చెక్‌డ్యామ్‌లు, బ్రిడ్జీలు, రిక్రియేషనల్ జోన్లు, 57 కిలోమీటర్ల పొడవునా ఉండే ఎక్స్‌ప్రెస్ వేలూ, వాకింగ్ ట్రాక్‌లు, మురుగునీరు చేరకుండా మూసీ పార్కులతో పొందుపరిచామని వివరించారు. నాగోల్-ఉప్పల్ మార్గంలో 5 కిలోమీటర్ల పొడువున రూ.6 కోట్లతో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన మూసీ సుందరీకణలో భాగంగా కూలగొట్టే పరిస్థితి వస్తే ముందుగా నాగోల్-ఉప్పల్ మధ్యన 5 కిలోమీటర్ల మేర పైలట్ ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు.
ఒకనొక సందర్భంలో పేదోడి ఇంటికి నష్టం లేని డిజైన్లు రూపొందించాలని, లేదంటే ఆ మూసీ అభివృద్ధి పేరిట విధ్వంసం చేయాల్సిన అవసరం లేదని కేసీఆర్ అప్పట్లోనే స్పష్టం చేశారని పేర్కొన్నారు. ‘మురుగు నీటి శుద్ధికి రూ.4వేల కోట్లతో 31 సీవరేజ్ ప్లాంట్లు నిర్మించాం. రూ.543 కోట్లతో 15 బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్‌లూ నిర్మించేలా చర్యలు తీసుకున్నాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా రూ.16,634 కోట్ల అంచనా వ్యయంతో 2016-17లో మూసీ పునరుజ్జీవానికి పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాం. మంచిరేవుల నుంచి ఓఆర్ఆర్ వరకు 57 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ వేలను ఒక్క ఇంటిని కూడా కూల్చకుండానే నిర్మించే డిజైన్లు బీఆర్ఎస్ రూపొందించింది’ అని కేటీఆర్ వివరించారు.

మూసీ పరీవాహకంలోని బస్తీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల భూములకు జీరోవాల్యూ అని నిర్వాసితులను రేవంత్‌రెడ్డి భయభ్రాంతులకు గురిచేస్తున్నడు. పాకిస్థాన్ నిషేధించిన ఓ కంపెనీకి మూసీ డిజైన్లు తయారు చేసే కాంట్రాక్టు కట్టబెట్టి ఏకంగా రూ.160 కోట్లు ముట్టజెప్పిండు. అసలు రేవంత్‌రెడ్డి మాటలకే వాల్యూలేదు.
– కేటీఆర్
రెండు వేల కిలోమీటర్ల మేర ప్రవహించే గంగా నది ప్రక్షాళనకు ‘నమామి గంగే’ ప్రాజెక్టు కింద రూ.42వేలు కోట్లు ఖర్చుపెడితే… 55 కిలోమీటర్ల పొడవున మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లు ఎలా ఖర్చు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు మొత్తానికి రూ.16,634 కోట్లతో పునరుజ్జీవం పోసేలా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తొలి దశలోనే 3,320 ఎకరాల భూముల స్వాధీనం, లక్షన్నర కోట్లు ఖర్చు చేసే ప్రణాళికలతో ఎవరి కొంపలు కూల్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
మూసీ బాధితులు లేకుండా, కేవలం వైట్‌కాలర్ ప్రతినిధులు, రియల్ఎస్టేట్ వ్యాపార వేదిక తరహాలో ఫైవ్‌స్టార్ హోటళ్లలో మూసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి… అసలు మూసీ కోసం చేస్తున్నారా? లేక మూసీ వెంబడి విస్తరించి ఉన్న భూముల కోసం పనిచేస్తున్నారా? అనే విషయం ఇప్పటికీ అంతు చిక్కడం లేదని దుయ్యబట్టారు. మేధాపాట్కర్ లాంటి మేధావులు, మహాత్మా గాంధీ మునిమనుమడైన తుషార్‌గాంధీ లాంటి వ్యక్తులే మూసీ పేరిట జరుగబోయే విధ్వంసానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, గాంధీజీ విగ్రహాన్ని పెట్టి రూ.లక్షల కోట్ల విలువ చేసే భూములు, లక్షలాది కుటుంబాలను రోడ్డునపడేసే కుట్రలకు రేవంత్‌రెడ్డి తెరలేపుతున్నారని విమర్శించారు.
మూసీ నదికి దశల వారీగా పునరుజ్జీవం కల్పిస్తామంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించిన సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం వేరే ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. మొదటి ఫేజ్‌లోనే 22 కిలోమీటర్ల పరిధిలో 3,320 ఎకరాలను స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారని తెలిపారు. ఎకరం రూ.50 కోట్ల చొప్పున 3,320 ఎకరాల భూముల విలువ రూ.లక్షన్నర కోట్లు దాటుతుందని, అందుకే బస్తీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల భూములను జీరో వాల్యూ పేరిట భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.
పాకిస్తాన్ నిషేధించిన ఓ కంపెనీకి మూసీ డిజైన్లను కట్టబెట్టి రూ.160 కోట్లు ఖర్చు చేసిన రేవంత్‌రెడ్డి… మూసీ ప్రాజెక్టు ద్వారా వేల కోట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గోదావరి నీళ్లను నగరానికి తరలించేందుకు 2023లోనే బీఆర్ఎస్ క్యాబినెట్ రూ.1,100 కోట్లకు ఆమోదం తెలిపితే… అదే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పదింతలు పెంచి రూ.10వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తున్నదని దుయ్యబట్టారు.
మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని, కేవలం రేవంత్‌రెడ్డి దోపిడీ ఆలోచన విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. మూసీ వెంబడి ఉన్న ఆస్తులకు జీరో వాల్యూ ఉన్నదంటున్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలకే విలువ లేదని ఎద్దేవా చేశారు. అమాంతం నిర్మాణ వ్యయాన్ని ఎందుకు పెంచారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

దశాబ్దాల కింద కట్టుకున్న ఇండ్లను ఇప్పుడొచ్చిన రేవంత్‌రెడ్డి బఫర్‌జోన్‌లో ఉన్నాయని కూల్చే ప్రయత్నం చేస్తున్నడు. మరి కోస్గిలోని రెడ్డి కుంట ఎఫ్టీఎల్లో రేవంత్‌రెడ్డి సొంతిల్లు సంగతేంది? రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉన్నది వాస్తవం కాదా? జంట జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న పొంగులేటి ఫామ్ హౌస్, మంత్రి గడ్డం వివేక్, పట్నం మహేందర్ రెడ్డి కట్టుకున్న ఇండ్ల సంగతేంది?
– కేటీఆర్
మూసీ పరీవాహక ప్రాంతంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం ఇస్తామంటున్న సీఎం రేవంత్‌రెడ్డి… కనీసం భూసేకరణ చట్టం-2013 గురించి ముందుకు తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు. కోల్పోతున్న భూములకు ఏ విధంగా పరిహారం ఇవ్వాలో కూడా తెలియని ముఖ్యమంత్రి, మూసీ పరిహారంగా టీడీఆర్ ఇస్తామంటున్నారని మండిపడ్డారు.
టీడీఆర్‌కు ఎలాంటి విలువ లేకుండా చేసిన కాంగ్రెస్ సర్కార్… తిరుపతిరెడ్డి వద్దనున్న టీడీఆర్‌లకు మాత్రమే విలువ ఉన్నదని, ఇప్పుడు టీడీఆర్ అంటేనే తిరుపతిరెడ్డి అనే చందంగా పరిస్థితి మారిందని ఎద్దేవా చేశారు. డీపీఆర్ లేకుండా, పర్యావరణంపై ప్రభావం అంచనాలు లేకుండా ఏవిధంగా మూసీకి పరిహారాన్ని చెల్లిస్తారని ప్రశ్నించారు. మీరిచ్చే టీడీఆర్‌లకు ఆయన సోదరుడి చేతికి వచ్చేంత వరకూ విలువ రాదని పేర్కొన్నారు.
అపార్ట్మెంట్ వాళ్లను విభజిస్తూ… కొంతమందికి పక్కనే ఏడెకరాల్లో అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఇస్తామంటున్న సీఎం రేవంత్‌రెడ్డి… మూసీ వెంబడి భూములు, ఇండ్లు కోల్పోతున్న మిగతావారికి అదే పరిహారం ఇస్తారా? అని ప్రశ్నించారు. పేదల ఇంటిని కూల్చబోమని చెప్తూనే, 500 మీటర్ల దూరంలోని ఇండ్లు, బస్తీలకు ఎందుకు రెడ్‌మార్క్ వేశారని ప్రశ్నించారు.
గాంధీ వారసులు, మేధావులు వ్యతిరేకిస్తున్న మూసీ ప్రాజెక్టును గాంధీ విగ్రహం పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి గోల్మాల్ చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మధుపార్క్ రిడ్జ్ బఫర్ జోన్లో ఉంటే, మరీ గాంధీ సరోవర్‌ను ఎక్కడ కడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ కట్టే నిర్మాణాలకు బఫర్ జోన్ నిబంధనలు వర్తించవా? ఒక్క ఇంటిని కూడా కట్టని రేవంత్‌రెడ్డి వేల ఇండ్లను కూల్చి, లక్షలాది మందిని ఎలా రోడ్డునపడేస్తారని ప్రశ్నించారు. మూసీ విషయంలో ఐక్యంగా ఉంటేనే రేవంత్ ఆగడాలకు కళ్లెం పడుతుందని చెప్పారు. రెం డేండ్లు ఓపిక పట్టి, బుల్డోజర్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ తర్వా త వచ్చే బీఆర్ఎస్ సర్కార్ మీ ఇంటి మీద ఉన్న సున్నాన్ని కూడా ముట్టుకోకుండా మూసీ సుందరీకరణ చేసి చూపిస్తుందని చెప్పారు.
మూసీ పేరిట 10 వేల నిర్మాణాలను కూల్చివేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, కానీ, కేసీఆర్ పాలనలో ఒక్క ఇటుక కూడా కదల్చకుండానే మూసీ సుందరీకరణ, నాలాలు అభివృద్ధి చేశామని కేటీఆర్ వివరించారు. ఒక్క ఇంటిని కూడా కూల్చకుండానే ముషీరాబాద్ నియోజకవర్గంలో 400 కుటుంబాలను వరద ముంపు నుంచి బయటపడేశామని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో, నాలాల వెంబడి భారీ రిటైనింగ్ వాల్స్‌ను నిర్మించడంతో ఏ ఒక్క ఇంటికీ వరద ముంపు లేదని పేర్కొన్నారు.
నగరంలో 13 కాలనీలను వరద ముంపు నుంచి బయటపడేసిన ఎస్ఎన్డీపీ రెండో దశను రద్దు చేసి, మూసీ పేరిట రూ.లక్షల కోట్లు దోచుకునే రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని అడ్డుకుంటామని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ చేసిన సుందరీకరణలో చుక్క మురుగు నీరు కూడా మూసీలో కలిసే అవకాశమే లేదనీ, నగరంలో నిత్యం ఉత్పత్తయ్యే రెండు వేల ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేసుకునేలా, నాలాలు, మూసీ వెంబడి ఎస్టీపీలను నిర్మించామని వివరించారు. వాటిని పూర్తి చేయకుండా వేల కోట్ల భూముల కోసం మూసీ సుందరీకరణ అంటే సహించేది లేదని హెచ్చరించారు.
‘దశాబ్దాల కిందట కట్టుకున్న ఇండ్లను… సీఎం రేవంత్‌రెడ్డి బఫర్ జోన్లో ఉన్నాయంటూ కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి, కోస్గి మండల కేంద్రంలోని రెడ్డికుంట ఎఫ్టీఎల్లో ఆయన నిర్మించిన సొంత ఇంటి సంగతేమిటి? సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి సొంతిల్లు దుర్గం చెరువులో ఉన్నది వాస్తవం కాదా? జంట జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో విస్తరించి ఉన్న మంత్రి పొంగులేటి ఫామ్‌హౌస్, మంత్రి గడ్డం వివేక్, పట్నం మహేందర్‌రెడ్డి కట్టుకున్న ఇండ్ల సంగతేమిటి?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే అమీన్పూర్ చెరువు శిఖంలో వందలాది ఇండ్లు ఉన్నాయంటూ రాత్రికిరాత్రే కూలగొట్టిన హైడ్రా… దుర్గం చెరువులో కట్టుకున్న తిరుపతిరెడ్డి ఇంటిని కూలగొట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. 20 ఏండ్ల కిందట కట్టుకున్న మధుపార్క్ రిడ్జ్ భవనాన్ని కూల్చివేసి, వందలాది మంది జీవితాలను మూసీలో కలిపే కుట్రలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా మూసీ వెంబడి నిర్మించిన ఫామ్‌హౌస్‌లు, ప్యాలెస్‌లను కూలగొట్టాలని సవాల్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి నమూనాతో పరిపాలిస్తే, కాంగ్రెస్ మా త్రం విధ్వంస నమూనాతో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ పేరిట బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ సృష్టించిన విధ్వంసాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు.
ప్రజలను రోడ్డున పడేసి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనుకుంటారా? ప్రజల జీవితాల కంటే ప్రభుత్వానికి టూరిజమే ముఖ్యమా? ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ప్రాజెక్టులు కడతామనడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. డీపీఆర్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతున్నామంటే, మాకు ఏమైనా భరోసా కల్పించేలా సీఎం మాట్లాడుతారని ఆశగా ఎదురు చూశాం. కానీ, ఏఐ గ్రాఫిక్స్ చూపించి, మా ఇండ్లు, స్థలాలకు జీరో వాల్యూ మాత్రమేనని చెప్పి వెళ్లిపోయారు. వేల మంది ప్రజలు రోడ్డున పడ్డా పర్వాలేదు, తాము అనుకున్నదే చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారు. -రమ్య, మూసీ బాధితురాలు
కష్టపడి పైసాపైసా కూడబెట్టుకుని అన్ని అనుమతులతో ఇండ్లు కట్టుకుంటే కూల్చేసి టీడీఆర్ ఇస్తామంటున్నారు. టీడీఆర్ పేరుతో ఒక సర్టిఫికెట్ ఇస్తే దాన్ని మేం ఏం చేసుకోవాలి? రూ.కోటి విలువైన టీడీఆర్‌కు రూ.10 లక్షలు కూడా రావడం లేదు. మేం అన్ని అనుమతులతో కట్టుకున్న ఇండ్లను కూల్చి ఒక పేపరు చేతిలో పెడితే దాన్ని అమ్ముకోవడానికి మేం ఎక్కడ తిరగాలి. 2016లో పట్టా భూముల్లో మేం అన్ని అనుమతులు పొంది విల్లా కొనుక్కున్నాం. ఇప్పుడు వచ్చి దాని స్థానంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామంటే మేం ఎక్కడికి పోవాలి? ఇచ్చే పరిహారం గురించి ఒక్కమాట కూడా మాట్లాడకుండా సీఎం వెళ్లారు.
– శరత్‌బాబు, సైంటిస్ట్, రిచ్మండ్ విల్లాస్