ఖమ్మం రూరల్, జూలై 25 : ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం పశు సంపదపై సైతం కనపడుతుందని ఎల్ నినో ప్రభావం తగ్గించి పశు సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఖమ్మం రూరల్ మండల పశు వైద్యుడు అనంతుల హరీష్ అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం గ్రామంలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం పశువులపై సైతం చూపెట్టడం ప్రారంభం అయిందన్నారు. భవిష్యత్లో ఈ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పశువులకు సంబంధించిన మేత నిలువలు, అవసరమైన త్రాగునీరు, ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
మామిడి తోటలలో అంతర పంటలుగా అలసంద, పిల్లి పెసర పంటి పంటలు సాగు సాగు చేసుకోవాలన్నారు. ఏక వార్షిక, బహు వార్షిక పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఉష్ణోగ్రత పరిస్థితులను అంచనా వేసి పశువులకు అవసరమైన చల్లవ నీడ షెడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చూడి పశువులు, పశువులకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భావిస్తే సమీప పశు వైద్యశాలను సంప్రదించాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే పాడు దిగుబడి తగ్గకుండా చూసుకోవడంతో పాటు కాపాడుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు మామిళ్ల శ్రీనాథ్ రెడ్డి, దండి శ్రీజ, ఊరడి హైమావతి, పాలేరు నియోజకవర్గ ఉద్యాన అధికారి అపర్ణ, ఏఈఓ ఆదర్శ్, పలువురు రైతులు పాల్గొన్నారు.