రవీంద్రభారతి, సెప్టెంబర్ 21: పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయ నేతల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలిచిన నిబద్ధత గల ఆదర్శ నాయకుడు సీతారాంఏచూరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ఎవరు ఏ సమయంలో ఏ పార్టీ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన నాయకుడు సీతారాం ఏచూరి అని కొనియాడారు. నేటి తరం రాజకీయ నాయకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.
ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాద్ బిడ్డ ఏచూరి అంటూ నివాళులర్పించారు. ఇటీవల ఢిల్లీలో కన్నుమూసిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభను శనివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షత వహించిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ఏచూరి హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ స్కూల్ చదువుకున్నారని, ఆ పాఠశాల పక్కనే ఉన్న గ్రామర్ స్కూల్లో చదివానని తెలిపారు. తామిద్దరం నిజాం కాలేజీలోనే డిగ్రీ పూర్తి చేశామని చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. ఓట్ల రాజకీయాల్లో వెనుకబడ్డాం.. ప్రజల కోసం చేసిన పోరాటాలలో ముందున్నామని ఏచూరి అనేవారని గుర్తుచేశారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన ఏచూరి ప్రశ్నించే గొంతుకగా ఎదగడం చాలా గొప్ప విషయమని అన్నారు. పోరాటాల నుంచే వచ్చే నాయకునికి ప్రజల కష్టాలు, సుఖ దుఃఖాలు తెలుసునని చెప్పారు. తిట్లు, రోత మాటలే రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి ఎంతో హుందాగా వ్యవహరించేవారని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో జేఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె ఎదుటే నిలిచి రాజీనామా చేయాలని డి మాండ్ చేసిన గుండెధైర్యం గల నాయకుడు ఏచూరి అని కొనియాడారు. సిద్ధాంతపరంగా తమ పార్టీలు వేరైనా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీపీఎం వ్యతిరేకించినా.. పోరాటాలపరంగా తమ రెండు పార్టీల రక్తం ఒక్కటేనని వ్యాఖ్యానించారు.
ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించి.. పేద ప్రజల పక్షాన గళం విప్పిన సీతారాం ఏచూరి మృతి దేశానికి తీరని లోటని అన్నారు. ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్పనాయకుడని కొనియాడారు. దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డికి సమకాలికుడుగా ఉండేవారని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పేదలకు ఉపయోగపడే కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. ఏచూరిని రాహుల్‌గాంధీ మార్గానిర్దేశకుడిగా భావిస్తారని చెప్పారు. దేశంలో జమిలి ఎన్నికల ముసుగులో ఆధిపత్యం చేలాయించాలన్న కుట్ర జరుగుతున్నదని మండిపడ్డారు. రాష్ర్టాల హక్కులను కాపాడాల్సిన ఇలాంటి సందర్భంలో ఏచూరి లేకపోవడం భారీ లోటు అని అన్నారు.
వివిధపార్టీల నాయకులు తొలుత ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, సీపీఎం నేత బీవీ రాఘవులు, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఉమ్మడి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా తదితరులు పాల్గొన్నారు.