రాజన్న సిరిసిల్ల, మే 2 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్, హైదరాబాద్ సిటీబ్యూరో, సుల్తాన్‌బజార్: ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లవాసులు ఆరుగురు మృతిచెందడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మృతదేహాలకు ఉస్మానియా దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించగా కేటీఆర్ అక్కడికి వెళ్లి నివాళులర్పించారు. తీవ్ర బాధలో ఉన్న మృతుల కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్, ఆయన సోదరుడు రాజు తదితరులను ఓదార్చారు.
కుటుంబసభ్యుల రోదనలను చూసి కేటీఆర్ కూడా కన్నీరు కార్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ కోడం తేజశ్రీ (శ్వేత) కిమ్స్‌లో చికిత్స పొందుతుండగా, ఆమె అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, అండ గా ఉంటామని ధైర్యం చెప్పారు. మృతదేహాలను అంబులెన్స్‌లో సిరిసిల్లకు తరలించేవరకు కేటీఆర్ అక్కడే ఉన్నారు.