హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) భౌతికకాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ (KTR) నివాళులర్పించారు. కుమారుడు హిమాన్షు రావుతో కలిసి మాదపూర్లోని ఆయన నివాసానికి చేరుకున్న కేటీఆర్.. గోపీనాథ్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా సోదరుడు గత కొంత కాలంగా అస్వస్థతతో ఉన్నారని చెప్పారు. ఈరోజు ఉదయాన్నే డాక్టర్లు మరణ వార్త చెప్పారు. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆదివారమే అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నాం. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పారని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
కాగా, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంతిమ సంస్కారాలను అధికారిక లాంచనాలతో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా ఏఐజీలో గోపీనాథ్ చికిత్సకు అయిన ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది.