హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ యోధుడు, తిరుగుబాటు వీరుడు, గొండు బెబ్బులిగా కీర్తిగడించిన కుమ్రంభీం జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఘనంగా నివాళులర్పించారు. కుమ్రంభీం ఇచ్చిన జల్, జంగల్, జమీన్ నినాదమే స్ఫూర్తిగా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నేతృత్వంలో పాలననందించామని ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. మహనీయుడి ఆశయ సాధనే లక్ష్యంగా ఎస్టీ గురుకులాలు, కాలేజీల సంఖ్య పెంపు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, సీఎంఎస్టీఈఐస్కీం ద్వారా గిరిజన బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రంభీం పేరు పెట్టి, జోడెఘాట్‌లో సుందరమైన స్మృతివనాన్ని ఏర్పాటు చేసి, హైదరాబాద్ మహానగరంలో అద్భుతమైన ఆదివాసీ భవనాన్ని నిర్మించి సముచిత గౌరవమిచ్చారని తెలిపారు.
భీం గొప్పతనాన్ని చాటింది కేసీఆరే: మాజీ మంత్రి హరీశ్
కుమ్రంభీం గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కుమ్రంభీం జయంతిని పురస్కరించుకొని ఆయన పోరాటాన్ని ఎక్స్ వేదికగా ఆయన గుర్తు చేసుకున్నారు. భీం ఖ్యాతిని భావితరాలకు అందించేందుకు పోరుగడ్డ జోడెఘాట్‌ను గొప్ప స్మారకక్షేత్రంగా తీర్చిదిద్దడంతో పాటు హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించారని గుర్తుచేశారు. పోరాట యోధుడి అడుగుజాడల్లో మనమందరం ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.