హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాళులు అర్పించారు. మగ్దూం భవన్లో ఉన్న ఆయన పార్థీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సురవరం సుధాకర్ రెడ్డి మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విద్యార్థినాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యాదర్శిగా ఏడేండ్ల పాటు బాధ్యతలు నిర్వహించమంటే సామాన్యవిషయం కాదని చెప్పారు. సామాన్యుని నుంచి అసాధారణ నేతగా ఎదిగారని చెప్పారు. నిబద్ధతతో ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో క్రియాశీలకంగా వ్యహరించింన సురవరం మన మధ్య లేకపోవడం ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతిఒక్కరికి తీరని లోటని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు సీపీఐ మద్దతులో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు మద్దతు కూడగట్టడంలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. కేసీఆర్ వారితో ఉన్న అనుభవాలను గుర్తుచేసుకున్నారని, వారి తరపున సువరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పిస్తున్నామని చెప్పారు. సురవరం సుధాకర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని, వారి కుటుంబసభ్యులకు, కమ్యూనిస్ట్ పార్టీకి, ప్రజా ఉద్యమాలు చేసిన వారికి మా నాయకుడి తరపున, తమ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.
కేటీఆర్‌తోపాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే తక్కళ్లపల్లి రవిందర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, మధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన భౌతిక కాయాన్ని సీపీఐ ప్రధాన కార్యాలయం మఖ్దూం భవన్లో (Makhdoom Bhavan) ఉంచనున్నారు. అనంతరం ఆయన పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి (Gandhi Medical College) అప్పగించనున్నారు. అదేవిధంగా ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ నేత్రాలయానికి దానం చేయనున్నారు.
Live: BRS Working President @KTRBRS pays tribute to Former MP Suravaram Sudhakar Reddy.
📍Makdoom Bhavan, Himayatnagar https://t.co/kVzwN8TcNP— BRS Party (@BRSparty) August 24, 2025