హైదరాబాద్‌లోని శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు సిరిసిల్ల వాసుల పార్థివ దేహాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీ వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సర్దార్‌నగర్‌కు చెందిన బొల్లి శివకుమార్ (40), బొల్లి లాస్య (35) దంపతులకు కూతురు రిషిక (8) ఉన్నారు. వీరు హైదరాబాద్ సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. శివకుమార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, లాస్య సివిల్సప్లై శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో సిరిసిల్లలో ఉంటున్న శివకుమార్ సోదరి కోడం తేజశ్రీ (శ్వేత) (36), భర్త శ్రీనివాస్ (41), పిల్లలు కృష్ణచంద్ర (14), మాధవ్ (11)తో కలిసి గురువారం హైదరాబాద్‌కు వెళ్లారు. శుక్రవారం రెండు కుటుంబాలు యాదగిరిగుట్ట, స్వర్ణగిరిలో దైవదర్శనానికి వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఓఆర్ఆర్పై 16వ ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా ఢీకొన్నది. దీంతో కారు లారీలో ఇరుక్కొని నుజ్జునుజ్జయింది. అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కారులో నుంచి మృతదేహాలను అతికష్టం మీద వెలికితీశారు.
శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు సిరిసిల్ల వాసుల పార్థివ దేహాలకు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీ వద్ద నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. pic.twitter.com/Atuq7qCEZ3
— BRS Party (@BRSparty) May 2, 2026
ఈ ప్రమాదంలో శివకుమార్, లాస్య, శ్రీనివాస్, చిన్నారులు రిషిక, కృష్ణచంద్ర, మాధవ్ మృత్యువాతపడ్డారు. కోడం తేజశ్రీ(శ్వేత) చావు బతుకుల్లో ఉండగా హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించారు. అనంతరం కిమ్స్‌కు తరలించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ సోదరుడు బొల్లి రాజు కొడుకు, కోడలు, అల్లుడి కుటుంబాలు మృత్యువాతపడటంతో తీవ్ర విషాదం నెలకొన్నది. విషయం తెలుసుకున్న శంషాబాద్ డీసీపీ యోగేశ్‌గౌతం ఘటనాస్థలానికి చేరుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అలసిపోయి రెప్పవాల్చడంతో వేగంగా వెళ్లి కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఉంటుందని డీసీపీ వెల్లడించారు. దర్యాప్తులో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. సూర్యాపేట నుంచి నూకల లోడ్‌తో నంద్యాలకు వెళ్తుండగా లారీపై ఉన్న తాడిపత్రి సరిగాలేకపోవడంతో, సరిచేసేందుకు పక్కకు ఆపుకొన్నట్టు డ్రైవర్ శ్రీనివాస్ తెలిపారు. తాను డ్రైవింగ్ సీట్లోనే ఉన్నానని, క్లీనర్ లారీపైకి ఎక్కి తాడిపత్రి సరిచేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు.. లారీని ఢీకొట్టిందని వెల్లడించారు.