KTR | నవభారత నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు భారతదేశానికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. భారత ప్రధానిగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంస్కరణశీలిగా, బహుభాషా కోవిదుడిగా భారతరత్న పీవీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నివాళులర్పించారు.
ఆధునిక భారత నిర్మాణానికి బాటలు వేస్తూ.. పీవీ నరసింహా రావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు చరిత్రాత్మకమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. పీవీ నరసింహా రావును బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని గుర్తుచేశారు. పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని.. నెక్లెస్ రోడ్‌కి, వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టింది.. వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపిందన్నారు. పీవీ కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించిందన్నారు.