KTR | ఆదివాసీ యోధుడు.. తిరుగుబాటు వీరుడు.. గోండు బెబ్బులి కుమ్రం (కొమురం) భీమ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు. బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ నేతృత్వంలో కుమ్రం భీమ్ ఇచ్చిన జల్, జంగల్, జమీన్ నినాదమే స్ఫూర్తిగా పాలన అందించామని గుర్తుచేశారు. వారి ఆశయాల సాధన దిశగా పయనించామని తెలిపారు.
ఎస్టీ గురుకులాలు, కాలేజీల సంఖ్య పెంచడం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించడం, సీఎంఎస్టీఈఐ స్కీం ద్వారా గిరిజన బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం.. కుమ్రం భీమ్ స్ఫూర్తిగా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీమ్ పేరు పెట్టుకున్నందుకు, జోడేఘాట్‌లో సుందరమైన స్మృతి వనాన్ని ఏర్పాటు చేసినందుకు, హైదరాబాద్ మహానగరంలో కుమ్రం భీమ్ పేరిట ఆదివాసీ భవనాన్ని నిర్మించినందుకు గర్విస్తున్నామన్నారు. అస్తిత్వ పోరాటాలకు ప్రతీకగా నిలిచిన కుమ్రం భీమ్‌కు జోహార్లు తెలిపారు.