సబితమ్మ, వారి ముగ్గురు కొడుకులకు ఫాంహౌస్‌లు ఉన్నయని రేవంత్ అబద్ధాలు చెప్తున్నడు. నిజంగా వారికి ఫాంహౌస్లుంటే కూల్చివేయించేందుకు మేమే సిద్ధంగ ఉన్నం. నీ కడుపు చల్లబడాలంటే పెద్దోళ్ల ఇండ్లను కూల్చండి.. అంతేగాని పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపద్దు.
– కేటీఆర్
KTR | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దొబ్బి ఢిల్లీకి మూటలు పంపేందుకే మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిండ్రు.. ఇది బ్యూటిఫికేషన్ ప్రాజె క్టు కాదు..పక్కా లూటిఫికేషన్ ప్రా జెక్టు.. మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతల నోళ్లలోనే ఉన్నది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ప్రమాణస్వీకారం చేసి న వెంటనే డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తానని, ఆ ఫైల్‌పైనే మొదటి సంతకం చేస్తానని గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి, అధికారం చేపట్టి పదినెలలైనా నెరవేర్చకుండా మోసం చేస్తున్నడు..’ అంటూ నిప్పులు చెరిగారు. ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తానని, దొడ్డు వడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తానని బోగస్ మాటలు చెప్పిండని మండిపడ్డారు. రైతులు తలుచుకుంటే ఈ రేవంత్‌రెడ్డి ఉంటడా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్రధాని మోదీనే ఎదిరించిన మాకు ఈ చిట్టినాయుడు రేవంత్ ఓ లెక్కనా?’ అని హెచ్చరించారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు హాజరై రైతులనుద్దేశించి ప్రసంగించారు.
‘మొన్నటి ఎన్నికల్లో ఓట్ల కోసం రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి, వరంగల్ భద్రకాళి అమ్మవారిపై ఒట్టేసి మాట తప్పి దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనుడు మన చిట్టినాయుడు’ అని దెప్పిపొడిచారు. అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయిన చందంగా రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్నడని విమర్శించారు. ఒకే ఇంట్లో ఇద్దరు ముసలోళ్లు, ఆడబిడ్డలకు కూడా నాలుగు వేల చొప్పున పింఛన్ ఇస్తానని చెప్పి నట్టేట ముంచాడని మండిపడ్డారు. రెండు వేలు అదనంగా ఇస్తానని జనవరి, ఆగస్టు రెండు నెలలు ఎగ్గొట్టాడని చెప్పారు. ఆరు గ్యారెంటీలను నూరు రోజుల్లో అమలు చేస్తానని చెప్పి 420 హామీలు ఇచ్చి మోసం చేసిండని దుయ్యబట్టారు. ‘ఇప్పుడు ఆఖరి వంద రోజుల్లో అమలు చేసేలా ఉన్నట్టున్నడు..’అని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ పథకం తెచ్చి ఇండ్లు కట్టిస్తానని చెబితే నమ్మి అధికారం కట్టబెడితే, ఇప్పుడు కూలగొట్టుడే పనిగా పెట్టుకున్నాడని చురకలంటించారు.
లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన ఎందుకు?
ఆడబిడ్డల పెండ్లిళ్లకు తులం బంగారం కోసం, ఆసరా పింఛన్ల పెంపునకు పైసల్లేవని చెప్తున్న ముఖ్యమంత్రి.. లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన ఎందుకు చేపడుతున్నాడో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దొబ్బి ఢిల్లీకి మూటలు పంపేందుకే ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చాడని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టుతో ఎన్నెకరాలకు నీళ్లిస్తావో చెప్పాలని నిలదీశారు. చెరువులు, కుంటలు కాపాడతాననే నెపంతో హైడ్రాను తెచ్చి నగరజనాన్ని ఆగం చేస్తున్నాడని విమర్శించారు. హైడ్రాను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలను బద్నాం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. సబితమ్మతో పాటు, వారి ముగ్గురు కొడుకులకు ఫాంహౌస్‌లు ఉన్నాయని అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు. నిజంగా వారికి మూడు ఫాంహౌస్‌లు ఉంటే తామే కూల్చివేయించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘నిజంగా ఈ ముఖ్యమంత్రి కడుపు చల్లబడాలంటే మా లాంటి పెద్దోళ్ల ఇండ్లను కూల్చండి.. అంతేగాని పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపవద్దు’ అని సూచించారు.
రియల్ ఎస్టేట్ కోసమే ఫోర్త్‌సిటీ..
కేసీఆర్ ప్రభుత్వం లక్షమంది తెలంగాణ బిడ్డలకు ఉపాధి కల్పించేందుకు తెచ్చిన ఫార్మాసిటీపై రేవంత్ సర్కారు రోజుకో నాటకమాడుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. బహిరంగ సభల్లో రద్దు చేశామని చెప్తున్న ప్రభుత్వం కోర్టులోనేమో కొనసాగిస్తున్నామని బుకాయిస్తున్నదని విమర్శించారు. గత ప్రభుత్వం కేంద్రం సహకారంతో చేపట్టిన ట్రిపుల్ ఆర్పైనా దుష్ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ మంత్రి, కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం, అస్మదీయుల భూములను కాపాడేందుకు అలైన్‌మెంట్‌ను మార్చేందుకు కుతంత్రాలు చేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ పాలనలోనే రైతులకు న్యాయం జరిగిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఆయన చేపట్టిన రైతు సంక్షేమ పథకాలతో దేశమంతా తెలంగాణ వైపు చూసిందని పేర్కొన్నారు. రేవంత్ సర్కారు ఇచ్చిన హామీలను తుంగ లో తొక్కి అన్నదాతను దగా చేస్తున్నదని మండిపడ్డారు. ధర్నాలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు నవీన్‌రెడ్డి, శంభీపూర్ రాజు, వాణీదేవి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, రంగారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పార్టీ యువనేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.
చెరువులోనే రేవంత్ ఇల్లు..
కొడంగల్‌లోని రేవంత్‌రెడ్డి ఇల్లేమో రెడ్డి చెరువులో, ఆయన అన్న తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గం చెరువు శిఖం భూమిలో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం వాళ్ల అక్రమ నిర్మాణాలను వదిలిపెట్టి పేదలపై ప్రతాపం చూపుతున్నదని విమర్శించారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందుగా వారి ఇండ్లను కూలగొట్టిన తర్వాతే మూసీ ప్రక్షాళనపై ముందుకెళ్లాలని సూచించారు.
రైతులను నాశనం చేసిన ఘనత కాంగ్రెస్‌దే
మాకు మూడు ఫాంహౌస్‌లు ఉన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. అవి ఎక్కడ ఉ న్నా యో ఆయనే చెప్పాలి. మాకు ఒక్కటే ఇల్లు ఉన్న ది. అధికారం రాకముందు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపి, ప్రభుత్వం వచ్చాక మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌దే. కేసీఆర్‌కు నదుల గురించి తెలిస్తే.. రేవంత్‌కు ఫాంహౌస్‌ల నుంచి మురుగు నీటి పారుగంత తెలిసినట్టుంది. కూల్చడం కాదు.. దమ్ము ధైర్యం ఉంటే ఫార్మాసిటీని ఏర్పాటు చెయ్యి. మెట్రో సదుపాయాన్ని కల్పించాలి. మెడికల్ కాలేజీని నిర్మించాలి. రేపు మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే.
-కార్తీక్ రెడ్డి, బీఆర్ఎస్ యువనేత
పింఛను రెండు వేలు పెంచి ఇస్తనని చెప్పి జనవరి, ఆగస్టు రెండు నెలలు ఎగ్గొట్టిండు. ఆరు గ్యారెంటీలను నూరు రోజుల్లో అమలు చేస్తనని చెప్పి 420 హామీలతో రేవంత్‌రెడ్డి మోసం చేసిండు. ఇప్పుడు ఆఖరి వంద రోజుల్లో అమలు చేస్తడేమో!
-కేటీఆర్
దేవుళ్లపై ఒట్టేసి రైతులను మోసం చేసిండు.. రైతులు తలుచుకుంటే ఈ రేవంత్‌రెడ్డి ఉంటడా? ఆయన కుర్చీ ఉంటదా? వారి సంఘటిత శక్తి ముందు ఈ ముఖ్యమంత్రి ఎంత?
-కేటీఆర్