హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం క్షీరాభిషేకం చేశారు. సచివాలయం ఎదురు గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్డడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, నాయకులతో కలిసి తెలంగాణ భవన్లో ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ‘జైతెలంగాణ, జైజై తెలంగాణ’.. ‘జోహార్లు జోహార్లు తెలంగాణ అమరవీరులకు జోహార్లు’, ‘సిగ్గు చేటు సిగ్గు చేటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సిగ్గు చేటు’, ‘సిగ్గు సిగ్గు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు సిగ్గు సిగ్గు’.. ‘వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీఆర్ఎస్ వర్ధిల్లాలి’.. అంటూ గులాబీ శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు చేయడంతో తెలంగాణ భవన్, దాని పరిసరాలు దద్దరిల్లాయి.
సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పాటిస్తూ తెలంగాణభవన్ లో కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ శ్రేణులంతా కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ,జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ కవిత పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వర కు పోలీస్ స్టేషన్లలో ఉంచి వదిలేశారు. జా తీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారని, ఆ కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పినా వినకుండా పోలీసులు అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు, పడాల సతీశ్ తెలిపారు. వీరిని వేర్వేరు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించా రు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ పదేపదే ప్రజాపాలన అని చెప్పుకొంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, అన్ని వర్గాలపై నిర్బంధాలకు పాల్పడుతున్నదని విమర్శించారు.
సెప్టెంబర్ 17ను స్వేచ్ఛగా జరుపుకొనే హక్కులేదా? అని ప్రశ్నించారు. సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటును నిరసి స్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేయాలని చూసిన బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేశారని, తెలంగాణ తల్లి విగ్రహాలకు కూడా క్షీరాభిషేకం చేయనివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పోలీసులతో పాలన సాగిస్తున్నారని విమర్శించా రు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పోలీసులతో అధికారం చెలాయించిందో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు తథ్యమని స్పష్టంచేశారు.
నమస్తే తెలంగాణ నెటవర్క్, సెప్టెంబర్ 17 : సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రేవంత్‌రెడ్డి సర్కారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలు, చిత్రపటాలను పాలతో అభిషేకించాయి. నాయకులతో కలిసి వనపర్తి నుంచి గోపాల్పేట వరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బైక్ ర్యాలీ తీశారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలతో శుద్ధిచేసి నిరసనలో పాల్గొన్నారు. సూర్యాపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య, దేవరకొండలో పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి తెలంగాణ తల్లికి క్షీరాభిషేకాలు చేశారు.
సిరిసిల్లలో టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ జిల్లా, పట్టణ అధ్యక్షుడు తోట ఆగయ్య, పెద్దపల్లిలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, గోదావరిఖనిలో రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకాలు చేశారు. జగిత్యాలలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మెట్పల్లిలో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, హనుమకొండలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మహబూబాబాద్‌లో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ మండల కేంద్రం-లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం చేశారు.