కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారు పదేండ్ల పాలన రైతు కేంద్రంగా సాగితే, దుర దృష్టవశాత్తు కాంగ్రెస్ సర్కార్ రైతులకు ద్రోహం చేయడమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నది. ఈ వైనాన్ని పల్లెపల్లెనా పార్టీ శ్రేణులు ఎండగట్టాలి. పంట కాలానికి ముందే విత్తనాలు, యూరియాను కేసీఆర్ రైతుల ముంగిట ఉంచితే, రేవంత్ పాలనలో మళ్లీ అన్నదాతలు పడిగాపులు కాస్తూ రేయింబవళ్లు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి నెలకొన్నది.
-కేటీఆర్
హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని, 20 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ మేరకు ఎక్కడికక్కడ కార్యక్షేత్రాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కోర్టు ఆగ్రహించి ఆదేశిస్తేగాని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే స్పృహ ఈ సర్కారుకు లేకుండా పోయిందని సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాల నిర్వహణకు బీఆర్ఎస్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలని జిల్లా అధ్యక్షులను కేటీఆర్ ఆదేశించారు. వారంలోనే సమావేశాలు నిర్వహించాలని, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, జడ్పీ మాజీ అధ్యక్షులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ సీనియర్లు పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.
20 నెలలుగా రేవంత్ సర్కారు అనుసరిస్తున్న ప్రజాకంటక విధానాలను ప్రజల ముందు పెట్టేందుకు ఎక్కడికక్కడ గులాబీ సైనికులు సిద్ధంగా ఉండాలి. ఆ మేరకు నియోజకవర్గస్థాయి సమావేశాలు దోహదమయ్యే రీతిలో కార్యాచరణ రూపొందించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ వారంలోనే సమావేశాలు నిర్వహించాలి.
-కేటీఆర్
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, రేవంత్ ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలను, వైఫల్యాలను పల్లెపల్లెనా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్నదాతలు సహా అన్ని వర్గాల వారికి 20 నెలలుగా కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ఎండగడుతూనే ఉన్నాయని, బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే ప్రభుత్వం రైతుభరోసా వేసిందనే విషయాన్ని రైతులు ఇప్పటికే గుర్తించారని, ఇదే విషయాన్ని ప్రతీ రైతుకు చేరేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారు పదేండ్ల పాలన రైతు కేంద్రంగా సాగితే, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ సర్కార్ రైతులకు ద్రోహం చేయటమే పాలనగా సాగిస్తున్న వైనాన్ని ఎండగట్టాలని సూచించారు. పంట కాలానికి ముందే విత్తనాలు, యూరియాను కేసీఆర్ రైతుల ముంగిట ఉంచితే, రేవంత్ పాలనలో రైతులు వాటికోసం పడిగాపులు కాస్తూ రేయింబవళ్లు క్యూలో నిలుచోవాల్సిన దుస్థితిని ప్రజలకు గుర్తుచేయాలని చెప్పారు.
రేవంత్ ప్రభుత్వ చేతకానితనంతో పాలన అస్తవ్యస్తంగా మారి గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందనే విషయం ప్రతీ ఒక్కరికి చేరేలా కార్యాచరణ రూపొందించుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. కేసీఆర్ హయాంలో అమలైన పల్లెప్రగతితో కళకళలాడిన పల్లెల్లో ఇవ్వాళ చిన్న చినుకుపడితే వణికిపోయే పరిస్థితి దాపురించిందని, గ్రామాల్లో శానిటేషన్ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోవడం లేదని మండిపడ్డారు. ట్రాక్టర్ల డీజిల్ ఖర్చులు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో పల్లెల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నదని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీసీలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధిలేని కాంగ్రెస్ సరారు.. ఆర్డినెన్స్ పేరుతో ఆడుతున్న డ్రామాలను ప్రజలకు వివరించి చెప్పాలని కేటీఆర్ సూచించారు. డిక్లరేషన్ల పేరుతో వివిధ వర్గాలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆయా వర్గాలను, రంగాలను ఎలా మోసం చేసిందో ఆధారాలతో వివరించాలని పేర్కొన్నారు. ఆరుగ్యారెంటీల పేరుతో అనేకవర్గాలను కాంగ్రెస్ ద్రోహం చేసిందని, ఈ అంశాలపై ప్రజలకు వివరించి చెప్పాలని శ్రేణులకు కేటీఆర్ సూచించారు.
కేసీఆర్ హయాంలో అమలైన పల్లెప్రగతితో కళకళలాడిన పల్లెల్లో ఇవ్వాళ చిన్న చినుకుపడితే వణికిపోయే పరిస్థితి దాపురించింది. గ్రామాల్లో శానిటేషన్ అస్తవ్యస్తంగా మారి ప్రజలు రోగాల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోతలేదు. ట్రాక్టర్ల డీజిల్ ఖర్చులు కూడా సకాలంలో చెల్లించక పల్లెల్లో చెత్త పేరుకుపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న పల్లెలు, రేవంత్ సర్కారు చేతగానితనంతో కునారిల్లుతున్నయి.
-కేటీఆర్
20 నెలలుగా బీఆర్ఎస్ బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలిచి, ప్రజాగొంతుకై వినిపించిన వైనాన్ని ప్రజలకు వివరించాలని శ్రేణులకు కేటీఆర్ సూచించారు. కృష్ణాజలాలను ఆంధ్రాకు అప్పగించేందుకు రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకోవడం, పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి, నల్లగొండలో బహిరంగ సభ పెట్టి సర్కారును హెచ్చరిస్తే ఆ దెబ్బకు అసెంబ్లీ సమావేశంలో ‘కేఆర్ఎంబీకి అప్పగించం’ అని తీర్మానం చేసిన వైనాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా నిలిచిన తీరును వివరించాలని తెలిపారు. గురుకులాల్లో కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న విద్యార్థుల తరపున చేసిన పోరాటాన్ని ప్రజలకు తెలపాలని సూచించారు. హైడ్రా, లగచర్ల బాధితులను బీఆర్ఎస్ కడుపులో పెట్టి చూసుకున్న సందర్భాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ వారంలోనే సమావేశాలను నిర్వహించాలని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నేత ఓరుగంటి వెంకటేశంగౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. సోమవారం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నందినగర్‌లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఓరుగంటి వెంకటేశంగౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం లేదని ధ్వజమెత్తారు. బలహీనవర్గాలకు ఆ పార్టీలో గుర్తింపులేదని విమర్శించారు. కేవలం డబ్బున్నవారికి, పెట్టుబడిదారులకే పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమని విశ్వాసం వ్యక్తంచేశారు.