హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలోనే రాష్ట్రం వందేండ్ల విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. రాష్ట్రంలో చేపడుతున్న కులగణన అంశంపై మంగళవారం సాయంత్రం కులసంఘాలతో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ‘రాహుల్‌గాంధీ.. పచ్చగా ఉన్న తెలంగాణ.. మీ ఏడాది పాలనలో ఏవిధంగా వందేండ్ల విధ్వంసానికి గురైందో.. మీ రాక సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాను’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘తెలంగాణలో ఏ పిల్లాడికి ఏ కష్టమొచ్చినా సరే.. ఇలా పిలుస్తే అలా వస్తాను’ అని చెప్పి, తీరా గద్దెనెకిన తర్వాత ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైడ్రా బాధితులు ఇలా అన్ని వర్గాలను నయవంచనకు గురిచేశారని మండిపడ్డారు. ఒకటంటే ఒక్కమాట కూడా నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేశారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను హింసించే పులకేసి మాదిరిగా వ్యవహరిస్తున్నా ఏవీ తెలియనట్టు ఢిల్లీలో గప్‌చుప్‌గా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వస్తే అభయహస్తం అందిస్తామంటూ నమ్మబలికి భస్మాసుర హస్తంతో తెలంగాణ ప్రజలను నిండా ముంచారని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీల అమలు బాధ్యత తనదేనని చెప్పిన రాహుల్‌గాంధీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువైపు తొంగి కూడా చూడలేదని విమర్శించారు. 300 రోజులైనా పరిమిత ఉచిత బస్సు మినహా ఒక గ్యారెంటీని కూడా అమలు చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ, రైతుభరోసాను ఎగ్గొట్టి బోనస్‌ను బోగస్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దద్దమ్మ మాదిరిగా సర్కార్ తయారైందని మండిపడ్డారు.
మూసీ, హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ పేద, మధ్య తరగతి ప్రజల పొట్ట కొడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా, మూసీ పేరు చెప్తేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు గూడు కట్టిస్తామంటూ నమ్మబలికి వాళ్ల గూడును చెదరగొట్టిన గొప్ప పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. ఇండ్లను కూలగొడుతుంటే పేద, మధ్య తరగతి ప్రజలు చేసిన ఆర్తనాదాలు మీకు వినబడలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచినా వస్తానని బీరాలు పలికిన రాహుల్‌గాంధీ ఇంతకాలం ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.
అశోక్‌నగర్‌కు వచ్చి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలకు నాది భరోసా అని చెప్పి ఆ నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు సిగ్గు అనిపించడం లేదా? అంటూ రాహుల్‌గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అశోక్‌నగర్‌లోని నిరుద్యోగులు, విద్యార్థులు, రైతుల వద్దకు వెళ్లేందుకు రాహుల్‌గాంధీకి దమ్ముందా? అని సవాల్ చేశారు. మీకు రక్షణ కల్పిస్తున్న పోలీసుల దగ్గరకు వెళ్లేందుకు? మూసీ, హైడ్రా బాధితులను పరామర్శించేందుకు? ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాల దగ్గరకు, వీధినపడ్డ ఆటో డ్రైవర్ల దగ్గరకు వెళ్లేందుకు? అసలు తెలంగాణ ప్రజల ముందుకు వచ్చేందుకు దమ్ముందా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం అంచనా వేయకుండా నేల విడిచి సాము చేసిన కారణంగా తెలంగాణ భవిష్యత్తు తలకిందులుగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి హామీలు ఇస్తే ఆ రాష్ట్రం దివాళా తీస్తుందని స్వయంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు. అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చిన పాపంలో ప్రధాన భాగస్వామి రాహుల్ గాంధీయేనని దుయ్యబట్టారు. తెలంగాణ ఆగమయ్యేందుకు ప్రధాన కారణం రాహుల్‌గాంధీయేనని, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.