KTR | వరంగల్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. చేతి గుర్తు పార్టీకి ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తిదారుల గొంతు కోసిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు సరిగ్గా ఏడాది క్రితం కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దానిలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. బీసీ వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క కొత్త పథకాన్ని మొదలుపెట్టకపోగా కేసీఆర్ పెట్టిన వాటినీ తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, అందుకే ఆ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కులగణనపైనా ప్రజలకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. కులగణన చేస్తున్న వారిని ప్రజలు నిలదీయడానికి కారణం ఇదేనని చెప్పారు.
‘కేసీఆర్ పాలనలో 2014 నుంచి 2023 బీసీల కోసం ఎన్నో పథకాలను అమలు చేశాం. అవి బలహీన వర్గాల పిల్లలకు ఫలాలను అందించాయి. ముదిరాజులు, గొల్లకురుమలు.. ఇలా అన్ని వర్గాల బీసీల కోసం కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ హారాన్ని అమలు చేసింది. దళితబంధు తర్వాత బీసీల కోసం బీసీబంధు ప్రవేశపెట్టింది. రేవంత్‌రెడ్డి రాగానే ఈ పథకానికి పాతరేశారు. బీసీ కుటుంబాలకు వ్యాపారం కోసం వడ్డీలేని రుణమిస్తామని, ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చుపెడతామని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్‌లో చెప్పింది. బడ్జెట్లో రూ. 8 వేల కోట్లు పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా ఎవరికీ ఏమీ చేయలేదు. జిల్లా కేంద్రాల్లో రూ. 50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తామని బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. కనీసం పునాది వేయలేదు. 33 జిల్లా కేంద్రాల్లో ఒకటంటే ఒక్కటీ ప్రారంభించలేదు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ భవనం నిర్మిస్తామని కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలో లబ్ధి కోసమే కులగణన
బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కులగణనపైనా అనేక అనుమానాలు ఉన్నాయని, అందుకే అధికారులపై ప్రజలు తిరగబడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ‘కుల గణన గురించి ప్రజలు అడిగితే అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. కులగణనకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. కులగణనలో 75 ప్రశ్నలు పెట్టారు. ప్రశ్నలు తగ్గిస్తే బాగుంటుంది. కులం, ఉప కులం అడిగితే సరిపోతుంది. అంతేగానీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఏసీ ఉందా? మీకు రాజకీయ నాయకులు తెలుసా.. ఇలాంటి ప్రశ్నలు ఎందుకు? ఏసీ, ఫ్రిజ్ లేకుంటే రేవంత్‌రెడ్డి ఇస్తడా? ఇవన్నీ చెబితే సంక్షేమ పథకాలు ఏం చేస్తరో అని ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం అన్నింటిపైనా స్పష్టత ఇయ్యాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హకు ప్రజలకు ఉన్నది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ప్రభుత్వాధికారులపై ఉన్నది. రేవంత్‌రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలపై, ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కులగణన మహారాష్ట్ర ఎన్నికల కోసం రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్‌లో చెప్పింది.
ఏడాది అయినా ఇప్పటి వరకు రిజర్వేషన్లను తేల్చలేదు. సర్పంచ్, జిల్లా పరిషత్, మండల పరిషత్… ఏ ఎలక్షన్లు అయినా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్దరామయ్య కామారెడ్డికి వచ్చినప్పుడు 6 నెలల్లో 42 శాతం రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్తామని చెప్పారు. తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్లు ఎలా అమలవుతుందో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం అధ్యయనం చేసి వచ్చింది. అక్కడ బీసీలకు 68 శాతం అమలు చేస్తున్నారని, ఇక్కడా చేసేలా కాంగ్రెస్‌ను నిలదీయాలని ప్రతినిధి బృందం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్‌కు మొదటి నుంచి బీసీల గురించి పట్టదు. కేంద్రంలో ఆరు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీ మంత్రిత్వశాఖను పెట్టలేదు. ఉద్యమనేతగా కేసీఆర్ యూపీఏ సర్కారులో మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా శాఖ ఉండాలని 2004 డిసెంబర్ 17న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కోరారు. ప్రతి రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉన్నదని, కేంద్రంలో తప్పకుండా ఉండాలని కేసీఆర్ చెప్పారు. ఎంత అడిగినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలాంటి పార్టీ బీసీల కోసం ఏమీ చేయదు. ఆ పార్టీ మోసాలను ప్రజలు గమనించాలి. జనవరిలో సర్పంచ్ ఎన్నికలు పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నడు. బీసీ డిక్లరేషన్‌లో చెప్పినట్లుగా 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఏం చేశారని విజయోత్సవాలు
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలోని వైఫల్యాలపై వారోత్సవాలు నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్లో చర్చించి దీనిపై కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు. ఏడాదిలో వాళ్లు ఏం పీకి పందిరేసిండ్లని విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు చేసిన చిన్నచిన్న పనుల బిల్లులను ఇవ్వడంలేదని, అడిగితే సర్పంచులను అరెస్టు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘వారోత్సవాలు, విజయోత్సవాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. కేసీఆర్ నిరాహారదీక్ష చేపట్టిన నవంబర్ 29 నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టిన డిసెంబర్ 7 వరకు ప్రభుత్వ వైఫల్యాల వారోత్సవాలు నిర్వహిస్తాం. ఈ విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పాదయాత్ర గురించి తర్వాత చెప్తాం’ అని కేటీఆర్ వివరించారు.
వడ్లకు బోనస్‌పై రేవంత్ బోగస్ మాటలు
రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చి అడ్డమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని, ఆ తర్వాత అందరినీ మోసం చేస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రేవంత్‌రెడ్డి రాగానే బీసీబంధు, దళితబంధు అన్ని బంద్ అయినయ్. అందుకే అందరూ కాంగ్రెస్‌ను నిలదీస్తున్నరు. సోషల్ మీడియాలో అంతా ఇదే ఉన్నది. సర్వే కోసం అధికారులు ఇంటికి పోతే ప్రజలు నిలదీస్తున్నరు. అడ్డగోలు హామీలు ఇచ్చి వచ్చిన రేవంత్‌రెడ్డిని, ఆయన మంత్రివర్గాన్ని అడ్డమైన మాటలు చెప్పి నోటికొచ్చినట్టు తిడుతున్నారు. బీసీ కులగణనపై, ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకంలేదు. సర్వే కోసం ఇంటింటికీ వెళ్తున్న అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికి వెళ్లిన ప్రతి అధికారిని 6 గ్యారెంటీల ఏమయ్యాయని, 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు అడుగుతున్నారు. పథకాలను అమలు చేయాలని అడిగితే ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారు. అంబేద్కర్ అభయహస్తం కింద దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇచ్చి చూపించు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది.
రేవంత్‌రెడ్డి ఇప్పటికీ ప్రభుత్వంలోని 18 మంత్రి పదవులను నింపలేకపోయిండు. ఈయన బీసీలకు ఏదో చేస్త అంటున్నడు. నిన్న మహారాష్ట్రలో ముఖ్యమంత్రి హోదాలో దగుల్బాజీ మాటలు మాట్లాడుతన్నడు. మాకు హిందీ రాదనుకున్నడో, అక్కడ మాట్లాడితే ఇక్కడ ఇనరనుకున్నరో. ఏం మాట్లాడుతున్నడు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్న అని బోగస్ మాటలు మాట్లాడుతున్నడు. రూ.500 బోనస్ ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా ఇచ్చినవా? రుణమాఫీ మొత్తం చేసిన అని చెబుతున్నడు. రైతుబీమా, రైతు భరోసా ఫుల్ పేజీ యాడ్స్ ఇస్తడా? తెలంగాణ రైతాంగం పక్షాన అడుగుతూనే ఉంటం. నిన్ను నిలదీస్తునే ఉంటం. యువతకు మాటిచ్చిన్. విద్యార్థులకు రిజర్వేషన్లు అన్నవు. యూత్ డిక్లరేషన్ అన్నవ్. మహిళా డిక్లరేషన్ అన్నవు. ఈ డిక్లరేషన్లీ పాములై నీ మెడకు చుట్టుకుంటుయ్. ఇయన్నీ మోసకారి మాటలని ప్రజలకు అర్థమైనయి. మేం వదిలిపెట్టం. నీ 420 హామీలు, నీ ఆరు గ్యారెంటీలు, నీ మొత్తం డిక్లరేషన్లు మొత్తం అమలు చేసేదాకా నీ ఎంబడిబడుతూనే ఉంటం. నువ్వు కేసు పెట్టుకుట్టవా? పాసుల పెట్టుకుంటవా? ఏం పెట్టుకుంటవా? పెట్టుకో. వదిలిపెట్టం. అడుగడునా వెంటాడుతునే ఉంటం’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సారు ఉంటేనే మంచిగుండే సారు
యాదగిరిగుట్ట, నవంబర్10: ‘కేసీఆర్ సారు ఉన్నప్పుడే మంచిగుండే సార్. యాళ్లకు పింఛన్, రైతుబంధు పడేది. ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పడు ఏం పడ్తలేవు. ఊర్లు కూడా మంచిగుండే. కానీ ఇప్పుడు ఊర్లో ఏం జరిగినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయిండు. కేసీఆర్ లేక ఊర్లన్ని చిన్నపోయినయ్ సార్. మళ్ల మళ్లీ కేసీఆర్ సారే రావాలి’ అంటూ ఓ వృద్ధురాలు కేటీఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. వరంగల్ పర్యటనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి బై పాస్ వద్ద కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలోని చొల్లేరు గ్రామానికి చెందిన తోటకూరి వెంకటమ్మ అనే వృద్ధురాలు కేటీఆర్‌ను కలిసేందుకు వచ్చింది. కేటీఆర్ వెంటనే ఆమెను తన దగ్గరికి పిలిపించుకుని సంభాషించారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో భావోద్వేగానికి గురైన వెంకటమ్మ తన మనసులోని మాటలను కేటీఆర్‌తో పంచుకుంది. మళ్లోసారి కేసీఆరే రావాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుబంధు, పింఛన్‌తోపాటు కరెంటు సరిగ్గా రావడం లేదని ఆవేదన వెలిబుచ్చింది. దీంతో స్పందించిన కేటీఆర్ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హామీనిచ్చారు. దీంతో వెంకటమ్మ సంతృప్తి చెంది నా ఓటు కారు గుర్తుకేనని తెలిపింది.
మోసం చేసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టబోం
‘స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులకు 90 శాతం రాయితీతో పరికరాల అందజేస్తానని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటికీ ఇవ్వలేదు. బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన 3 లక్షల రూపాయల ఆదాయమున్న ప్రతి బీసీ కుటుంబానికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఎకడపోయిందో రేవంత్‌రెడ్డి చెప్పాలి. ప్రతి మండలంలో గురుకులం, ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ పెడతామని అన్నారు. ఒక్కటీ పెట్టలేదు. బీసీలకు రూ.10 లక్షల వడ్డీలేని రుణమిస్తామని చెప్పారు. ఒక బీసీ బిడ్డకు అయినా రుణం ఇచ్చారా? చేతివృత్తుల వారికి 50 ఏండ్లకే ఆసరా పెన్షన్లు అన్నారు. అందరికీ రూ. 4 వేల పెన్షన్లు అన్నారు. కొత్త పెన్షన్లు వదిలేసి ఉన్న పెన్షన్లు కూడా సరిగా ఇస్తలేరు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏకి మారుస్తామని చెప్పిన హామీ ఏమైంది? 100 రోజుల్లో గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ముదిరాజులకు, గొల్ల కురుమలకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. గౌడన్నలకు 5 ఎకరాలు ఈత వనాల కోసం ఇస్తామన్నారు. ఈ హామీ ఏమైంది? పద్మశాలీలకు మెగా పవర్ లూమ్ ఇస్తామన్నారు. నేతన్నలను ఆత్మహత్యల పాల్జేస్తున్నారు. ఇప్పటిదాకా 34 మంది నేత కార్మికులు చనిపోయారు. సిరిసిల్లలో 20 మంది, 14 మంది ఇతర జిల్లాలో చనిపోయారు. బీసీలకు సబ్‌ప్లాన్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇప్పటి దాకా ఏమైంది? దుర్మార్గమైన సర్కారు ఏం చేస్తున్నది. దళితబంధు నిధులు ఇవ్వాలని మా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అడిగితే దాడులు చేసింది. ఎమ్మెల్యేలపై దాడులు కాదు.. ఇచ్చిన హామీ ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక భరోసా కార్యక్రమం వెంటనే ప్రారంభించాలి. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టలేది లేదు’ అని కేటీఆర్ హెచ్చరించారు.
బాంబుల శాఖ మంత్రి అనిపెట్టాలి
కాంగ్రెస్‌లో ఏ బాంబు ఎప్పుడు పేలుతుందో, ఏ బాంబులు పేలి కాంగ్రెస్ నేతలలో ఎవడు ఎగిరి పోతడో తెలియదని కేటీఆర్ అన్నారు. ‘అసలు ఆ మంత్రికి ఏ శాఖలు ఉన్నాయో తెల్వదు. ఆయనకు బాంబుల శాఖ మంత్రి అని పేరు పెట్టండి. ఆ బాంబు పేలుతది, ఈ బాంబు పేలుతదని అంటున్నడు. ఏ బాంబు పేలి కాంగ్రెస్‌లో ఎవడు ఎగిరి పోతడో? ఒక్కటి మాత్రం పక్కా. వాళ్లను వదిలపెట్టం’ అని హెచ్చరించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందరరావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోతు శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా? ఎనుమల వారి ఏడాది ఏలికలో తెలంగాణ బతుకు చీలికలు, పేలికలే. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు. ‘కుంభకోణాల కుంభమేళా’. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచన వారోత్సవాలు.
-కేటీఆర్
ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు. సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్‌పాలన. మరి ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారు. ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒకటంటే ఒక వాగ్దానం కూడా సరిగ్గా అమలుచేయకుండా జనం పైసలతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా?
-కేటీఆర్
ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నరకోట్ల మూటల వేట. కొడంగల్ లిఫ్టులో కోట్ల కాసుల వేట. బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేల కోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. ‘కరప్షన్ కార్నివాల్’.
-కేటీఆర్
రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దుఖంలో ఉంటే వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా? హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ చేసుకుంటారా? ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా? వృద్ధులు పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్‌లు చేసుకుంటారా?
-కేటీఆర్