సిరిసిల్ల రూరల్/సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 10: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి, కంపెనీ వేధింపులతో నరకయాతన పడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన ఎర్రోల్ల భరత్(28)ను స్వగ్రామానికి తీసుకొస్తానని కేటీఆర్ భరోసా కల్పించారు. భరత్ నెల రోజుల క్రితం దుబాయ్ వెళ్లాడు. వెళ్లిన 15 రోజులకే అనారోగ్యం బారినపడ్డాడు. ఇంతలో భరత్ పనిచేస్తున్న కంపెనీని మరో కంపెనీ కొనుగోలు చేసింది. నెలకు అక్కడి 900 దిర్హమ్లకు బదులు 500 దిర్హమ్లు ఇస్తామని కొత్త యాజమాన్యం చెప్పింది. ఆరోగ్యం మరింత చెడిపోవడంతో ఇంటికి వెళ్తానని కోరితే, పాస్‌పోర్టు తీసుకొని డబ్బులు కడితేనే స్వదేశానికి పంపిస్తామని చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యాడు.
బుధవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను భరత్ భార్య భవాని, తల్లి లింగవ్వ కలిసి వేడుకోగా.. భరత్‌ను స్వదేశానికి తీసుకువస్తానని ధైర్యం చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుంటుపల్లి చెరువుతండాకు చెందిన గుగులోల్ రవి ఉపాధి నిమిత్తం సౌదీకి వెళ్లాడు. రవి ఐదు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేటీఆర్‌ను కలిసి తమ గోడువెళ్లబోసుకున్నారు. తాను ఖర్చులు భరించి రవి మృతదేహాన్ని తీసుకువచ్చే ఏర్పాట్లు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు.