KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరుతో పేదల బతుకులను రోడ్డున పడేస్తున్నారని, పేదోళ్ల గూడు కూల్చుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. గరీబోళ్లకు ఒక న్యాయం, సీఎం అన్న తిరుపతిరెడ్డికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. పేదల ఇండ్లను కూల్చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు. వారికి అండగా ఉంటామని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన శేరిలింగంపల్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ర్టాన్ని పంచుకొని దోచుకుంటున్నదని ఆరోపించారు. మాదాపూర్‌లో తిరుపతిరెడ్డి దుకాణం తెరిచాడని గతంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అన్నారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదనే ఆటోడ్రైవర్లు, బస్తీవాసులు, పేదలపై సీఎం పగబట్టాడని విమర్శించారు. బీఆర్ఎస్ వాళ్లు అడుగుతున్నారని తిరుపతిరెడ్డికి ఒక నోటీసు ఇచ్చినట్టు డ్రామా ఆడి స్టే తెచ్చుకునేటట్టు చేశారని పేర్కొన్నారు. కానీ, గరీబోళ్లు సామాన్లు, పుస్తకాలు తీసుకుంటామంటే మాత్రం వారికి సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఈయన (రేవంత్‌రెడ్డి) డిస్ట్రక్షన్ చేస్తున్నాడని విమర్శించారు. తాము డబుల్ బెడ్రూంలు, ఫ్లై ఓవర్లు, ఎస్టీపీలు కడితే ముఖ్యమంత్రి 9 నెలల్లో బెదిరింపులు, కూలగొట్టుడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ. 12వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తుచేశారు.
సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన నిర్మాణాన్ని కూల్చివేయడం మంచిదే కానీ, దానికి అనుమతులు ఇచ్చినదెవరని కేటీఆర్ ప్రశ్నించారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి అనుమతులు ఇచ్చిందని తెలిపారు. అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో చెరువులను మాయం చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. ఆక్రమణలను బీఆర్ఎస్ ప్రోత్సహించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇండ్లు, ఫామ్‌హౌస్‌లు కూలగొట్టాలని సవాలు విసిరారు. పేదలకు అండగా ఉండేందుకు త్వరలోనే హైదరాబాద్ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతామని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికీ తిరిగి వారి కాళ్లు పట్టుకుని పార్టీలో చేర్చుకున్న సన్నాసి ఎవరో శ్రీధర్‌బాబు చెప్పాలి. కాంగ్రెస్‌లో చేరిన పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండ్ అయింది. హైకోర్టు తీర్పుతో వారి గుండెల్లో దడ మొదలైంది.
ప్రతిపక్షంలో ఉన్నా శేరిలింగంపల్లి కార్యకర్తల్లో ఎంతో కసి కనిపిస్తున్నదని, ఇక్కడ వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఏం తక్కువ చేసిందని పార్టీ మారావని గాంధీని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని మంత్రి శ్రీధర్‌బాబు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని, మరి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ కండువా కప్పిందెవరని ప్రశ్నించారు. మనమూ కాదని, వారూ కాదని.. చివరికి పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు ఎటూ కాకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికీ తిరిగి వారి కాళ్లు పట్టుకుని పార్టీలో చేర్చుకున్న సన్నాసి ఎవరో చెప్పాలని శ్రీధర్‌బాబును ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరి న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండ్ అయిందని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుతో వారికి దడ మొదలైందని తెలిపారు. అందుకే నీతి బాహ్యమైన పనులు చేస్తున్నారని, దమ్ము, ధైర్యముంటే తాము ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని చెప్పాలని సవాలు విసిరారు. ఉప ఎన్నికలు రాకుం డా చేస్తున్న దిక్కుమాలిన రాజకీయాలను ప్ర జలు, ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవ్వాతాతల పెన్షన్‌ను రూ.4 వేలు చేస్తానని చెప్పారని, కానీ ఉన్న రెండువేలకే దిక్కులేకుండా పోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. గెలిచిన మరుసటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తానని, 49 వేల కోట్ల రుణమాఫీని రూ.12 వేల కోట్లతో సరిపెట్టే ప్రయత్నం చేసున్నాడని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా అన్నాడని, కానీ అసలు సీఎం కుర్చీకే భరోసా లేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఖమ్మం బాంబో.. నల్గగొండ బాంబో.. ఏది వచ్చి మీదపడుతుందో తెలియక భయంతో బతుకుతున్నాడని పేర్కొన్నారు. ఆడపిల్లల పెండ్లికి తులం బంగారం అన్నాడని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండ్లి చేసుకున్న ఆడపిల్లలందరికీ బంగారం ఇవ్వలని డిమాండ్ చేశారు. యువకులకు తాము ఉద్యోగాలు ఇవ్వలేదన్నట్టుగా ఒకే అబద్ధాన్ని వందలసార్లు చెప్పి యువతను నమ్మించాడని, రాహుల్‌గాంధీని అశోక్‌నగర్‌కు తీసుకొచ్చి ఏటా 2 లక్షల ఉద్యోగాలంటూ నమ్మబలికారని, కానీ బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చామంటూ నోటికి వచ్చిన సంఖ్య చెబుతున్నాడని పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చావంటే కేసీఆర్‌ను తిడుతూ దబాయించి బెదిరిస్తున్నాడని తెలిపారు.
చిట్టినాయుడు అన్నదమ్ములు ఏడుగురు మొత్తం తెలంగాణను పంచుకున్నారు. చిట్టినాయుడుకు సంబంధించిన వారంతా తెలంగాణలో స్వైరవిహారం చేస్తూ దోచుకుంటున్నారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని మాట్లాడుతున్నారని, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ సెంటర్, 36 ఫె్లై ఓవర్లు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఇలా ఎకడ చూసినా కేసీఆర్ ఆనవాళ్లే కనిపిస్తాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ కనిపిస్తూనే ఉంటాడు బాబూ చిట్టినాయుడూ అని ఎద్దేవా చేశారు. అయ్యప్ప సొసైటీలో తిరుపతిరెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, 500 గజాలకు రూ.10 లక్షలు, 1000 గజాలకు రూ.18 లక్షలు వసూలు చేస్తున్నారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గతంలో చెప్పాడని గుర్తు చేశారు. తిరుపతిరెడ్డి ఆఫీసుకు వెళ్తే కమిషన్లు, సెటిల్మెంట్ల దందా నడిపిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పాడని అన్నారు. చిట్టినాయుడు అన్నదమ్ములు ఏడుగురు మొత్తం తెలంగాణను పంచుకున్నారని, చిట్టినాయుడుకు సంబంధించిన వాళ్లంతా తెలంగాణలో స్వైరవిహారం చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి బంధువులు, సీఎం చేస్తున్న దౌర్జన్యాలతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ఘాతుకాలు, భూదందాలు , బిల్డర్లను బెదిరించడం, హైడ్రా పేరు మీద వసూళ్లు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఈ సీఎం ఢిల్లీకి 22 సార్లు పోయాడని, రాష్ట్రంలో మాత్రం ఒక కొత్త పథకం కూడా పెట్టలేదని, వందరోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తానని చెప్పాడని, మరి ఒకటైనా చేశాడా అని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి దమ్ముంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇండ్లు, ఫామ్‌హౌస్‌లు కూలగొట్టాలి. పేదలకు ఎవరూ అండగా లేరని వారిపై దౌర్జన్యాలు చేస్తారా?
శేరిలింగంపల్లి కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదని, శేరిలింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తదని, మీ దాంట్లో నుంచే ఒకరు ఎమ్మెల్యే అవుతారని, కొత్తగా ఎవరు రారని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులకు ఏ బాధ వచ్చినా ఒక ఫోన్‌కాల్‌తో వస్తామని, కొత్తగా కమిటీలు వేసుకుందామని, పార్టీ మారిన వాళ్లు బాధపడుతూ మళ్లీ వస్తామని చెబుతున్నారని, కేసీఆర్ యాదికి వస్తున్నాడని అని ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతున్నాడని తెలిపారు. జేసీబీ వచ్చి ఇండ్లు కొట్టేస్తుంటే కేసీఆర్ నువ్వు రావాలని మరొక సోదరుడు అంటున్నాడని చెప్పారు. రాష్ట్రం మొత్తం మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని, ఆ సం దర్భం ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. పదేండ్లు మత కల్లోలాలు లేకుండా, పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకున్నామని చెప్పారు.
‘అనుముల తిరుపతిరెడ్డి గారు.. ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా హైడ్రా ఇవ్వలేదు. 50 ఏండ్ల కస్తూరిబాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితమే కొన్న ఇల్లు నేలమట్టమైంది. వారం ముందు గృహ ప్రవేశం చేసుకున్న ఇల్లు అన్ని కాగితాలు ఉన్నా పేక మేడలా కూలింది. తిరుపతిరెడ్డి గారు.. క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా మీ విషయంలో నోరు మెదపలేదు. వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది. కోర్టులో స్టే సంపాదించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో! మీ సోదరుడి బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి! నాకు తెలిసి అతీతశక్తి మీకేదైనా ఉందా? లేక ఏదైనా రహస్య ఆయుధాన్ని కలిగి ఉన్నారా అనుముల తిరుపతిరెడ్డి గారు! మీకు ఉన్న అతీంద్రియ శక్తుల గురించి పేదలకు కూడా చెప్పండి. ఇప్పటికైతే ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగమే అత్యంత శక్తివంతమైందని మేము మాత్రం బలంగా విశ్వసిస్తున్నాం’ అని కేటీఆర్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
పేదవాళ్లకు ఎవరూ అండగా లేరని వారిపై దౌర్జన్యం చేస్తారా? ఆ పేదలే దిక్కులేక నాలాలపై ఇండ్లు కట్టుకుంటారు. మానవత్వం ఉన్న ప్రభుత్వమైతే తొలుత వారికి నోటీసులు ఇవ్వాలి. లేదంటే వారికి వేరే చోట ఇండ్లు ఇవ్వాలి. తెలంగాణలో శిఖం పట్టాలు, ఏక్ ఫస్లా పట్టాలు ఉంటాయి. హైదరాబాద్ పరిధిలో మేం లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిచ్చినం. అందులో 40 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా బాధిత పేదలకు వాటిని ఇవ్వాలి.