బీసీల సంఖ్యను కావాలనే తగ్గించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో, రేషన్‌కార్డుల్లో, ఇండ్ల కేటాయింపుల్లో, ఆరు గ్యారెంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనతో ఉన్నారు. శాస్త్రీయంగా మళ్లీ రీసర్వే చేయాలి. సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వకుండా సర్కారు చూడాలి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక, అశాస్త్రీయం, అర్థరహితం అని, అది చిత్తుకాగితంతో సమానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. 15 నుంచి నెల రోజుల్లో శాస్త్రీయంగా మళ్లీ రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వకుండా తామంతా సర్వేకు సహకరిస్తామని స్పష్టంచేశారు. బీసీల జనాభాను కావాలనే తగ్గించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం పార్టీ బీసీ నేతలతో సమావేశమైనఅనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వేలో బీసీల జనాభాను దాదాపు ఐదున్నర శాతం తకువగా చూపించి బలహీనవర్గాల గొంతు కోయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామనే హామీని కాంగ్రెస్ తొంగలో తొక్కిందని విమర్శించారు. దీనిపై శాసనసభ, మండలిలో బీఆర్ఎస్ నిరసన తెలిపిందని గుర్తుచేశారు. ‘కులగణన తప్పుల తడక. చిత్తుకాగితంతో సమానం. బలహీనవర్గాల గొంతుకోసిన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ వైఖరిని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకోవడం లేదని అసెంబ్లీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎండగట్టాం. మండలిలో మధుసూదనాచారి, అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్‌యాదవ్ నాయకత్వంలో బీఆర్ఎస్ సభ్యులు తమవాదన వినిపించారు. బీసీ జనాభాను తగ్గించి చూపెట్టి, బలహీనవర్గాలను తక్కువ చేసి చూపిస్తున్నారని నిరసన తెలిపాం’ అని కేటీఆర్ వివరించారు.
ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టుగా..
బీసీలకు న్యాయం చేయడానికి వెంటనే రీ సర్వే చేయాలని కోరితే.. దున్నపోతు మీద వాన పడినట్టుగా రేవంత్ సర్కారు స్పందించ డం లేదని కేటీఆర్ విమర్శించారు. ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అన్నట్టుగా రేవంత్ ప్రభు త్వం బీఆర్ఎస్ను విమర్శిస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఒక్కరోజులోనే జరిపిన సమగ్ర కుటుంబ సర్వే మీదే అనుమానాలు లేవనెత్తేలా కాంగ్రెస్ నేత లు మాట్లాడుతూ బీసీలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ను ఆహ్వానించి బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డి సభలో కాంగ్రెస్ హామీలిచ్చింది. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని, వచ్చే ఐదేండ్లలో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ సబ్‌ప్లాన్ తెస్తామని చెప్పింది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, ప్రొక్యూర్మెంట్లలో 42% బీసీలకే ఇస్తామని చెప్పింది. అధికారం చేపట్టి 15 నెలలు అవుతున్నా 15 పైసలు కూడా బీసీలకు కేటాయించలేదు. కొత్తగా 16 కార్పొరేషన్లు బీసీ కులాలకు ఏర్పాటు చేస్తామని, ఒకో కార్పొరేషన్ రూ.50 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి 50 పైసలు కూడా ఇవ్వలేదు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
22 లక్షల మంది బీసీల తగ్గింపు
తెలంగాణలోని బలహీనవర్గాల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు ముఠా గోపాల్ అధ్యక్షతన విస్త్రృతస్థాయి సమావేశం నిర్వహించినట్టు కేటీఆర్ చెప్పారు. ఐదున్నర శాతం బీసీ జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని లేనట్టుగా చిత్రీకరించిన దుర్మార్గానికి రేవంత్‌రెడ్డి పాల్పడ్డారని విమర్శించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీలను క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన అశాస్త్రీయం.. అసంబద్ధం. బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే కులగణన సర్వేను చిత్తుకాగితంతో సమానమని కాలబెట్టిండు. మళ్లీ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సర్వే లెక్కలు తేల్చండి. సాకులు వెదకడానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకుండా మేమంతా సర్వేకు సహకరిస్తాం. ఈసారి కులగణనలో మేమంతా పాల్గొంటాం. కోరిన వివరాలిస్తాం. రీసర్వేకు వెంటనే ఆదేశించాలి. బీసీలకు అన్యాయం చేయవద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న మాటను రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలి. దీనిపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తారని భావించాం. కానీ బిల్లు తేలేదు సొల్లు మాత్రం చెప్పారు. బీఆర్ఎస్ మాత్రమే 50 శాతానికిపైగానే బీసీలకు పార్టీ పరంగా అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది. అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 12 జనరల్ సీట్లకుగాను 6 స్థానాల్లో, అంటే 50 శాతానికిపైగా బీసీలకు టికెట్లు ఇచ్చింది. శాసనసభ ఎన్నికల్లో 34 సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. కానీ, కేవలం 19 సీట్లే ఇచ్చారు. అందులో పాతబస్తీలో ఐదు సీట్లు ఉన్నాయి. చెప్పకుండానే బీఆర్ఎస్ బీసీలకు 34 సీట్లు ఇచ్చింది. మాకు ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు. బీసీల ఆందోళన, ఆవేదనను అర్థం చేసుకున్నాం’ అని కేటీఆర్ చెప్పారు.
అద్భుతంగా సమగ్ర కుటుంబ సర్వే
2015లో 25 లక్షల మంది ఎన్యూమరేటర్లతో ఇంటింటికి తిరిగి 30 గంటలలోపు అద్భుతంగా సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేని కేటీఆర్ గుర్తుచేశారు. దేశ, విదేశాల నుంచి వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఆ సర్వే లెక్కలు ఉన్నాయి కాబట్టే బీసీ సంక్షేమ పథకాలు పెద్ద మొత్తంలో అమలుచేశామని చెప్పారు. ఎస్కేఎస్లో హిందూ బీసీలు 51% ఉన్నట్టు తేలిందని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కారు జరిపిన కులసర్వేలో 46% అని చెప్తున్నారని, పదేండ్లలో బీసీల జనాభా తగ్గిందా? అని నిలదీశారు. నాడు 19 బీసీ గురుకుల పాఠశాలలు ఉంటే, వాటిని 327కు పెంచి మన పిల్లలకు చదువు చెప్పించే ప్రయత్నం చేశామని తెలిపారు. పూలే విద్యాలయాలు, ఉచితంగా గొర్రెలు, చేపపిల్లల పంపిణీ వంటి పథకాలు చేపట్టినట్టు గుర్తుచేశారు. పద్మశాలి సోదరులకు, చేనేతమిత్ర, బతుకమ్మ చీరలు వంటి అనేక ప్రోత్సాహక పథకాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. చట్టసభల్లో ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లను బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన డాటా ప్రకారం.. బీసీలకు ఇంకా మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్కేఎస్తోపాటు బీఆర్ఎస్ బీసీ పాలసీ, పథకాల వివరాలను అందిస్తామని చెప్పారు. బీసీల కోసం బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అదే సందర్భంలో కాంగ్రెస్ డిక్లరేషన్లు, బీసీలకు ఇచ్చిన హామీలు, ప్రజావంచనపై విస్త్రృత ప్రచారం కల్పించాలని సూచించారు. 30 మంది బీసీ నాయకులు తమిళనాడుకు వెళ్లి బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను ఈ సందర్భంగా కేటీఆర్‌కు అందజేశారు.
02
42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: తలసాని
చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని సవాల్ చేశారు. తప్పుల తడక సర్వేను తిరిగి సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణ రాష్ట్ర జనాభా 3,68,76,544 ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కులగణన సర్వేలో 3,70,77,554 ఉన్నట్టుగా ప్రకటించిందని వివరించారు.
బొందలు చూపించు: బండ ప్రకాశ్
పదేండ్లలో బీసీల జనాభా తగ్గినట్టుగా కాంగ్రెస్ సర్కారు చెప్తున్నదని, మనుషులను చూపించాలి లేదంటే వారి బొందలు చూపించాలని శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని మండిపడ్డారు. ధనిక రాష్ర్టాన్ని దివాలా రాష్ట్రంగా అభివర్ణించిన రేవంత్‌రెడ్డి.. జనాభా పెరుగుదల రాష్ర్టాన్ని తగ్గిన రాష్ట్రంగా చిత్రీకరించడం తగదని హితవు పలికారు. బీసీ ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు.
మోదీ బీసీగా మార్చుకున్నరు: శ్రీనివాస్‌గౌడ్
ప్రధానమంత్రి మోదీ పుట్టుకతోనే ఓసీ అని, తమ వర్గాన్ని బీసీలో కలుపాలని 30 ఏండ్లు పోరాటం చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు. చివరికి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తమ కులాన్ని బీసీవర్గంలో కలుపుకున్నారని తెలిపారు. బీసీల ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ వివిధ రూపాల్లో ప్రజల్లోకి వస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచింది బీసీలేనని చెప్పారు. కేసీఆర్‌కు బీసీలంటే ప్రేమ ఎక్కువ అని, అందుకే పదవుల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు.
ఓట్లు మావి.. సీట్లు మీకా?: వద్దిరాజు
వెనుకబడినవర్గాల ప్రజల ఓట్లతో గెలిచి అగ్రకులాల వారు సీట్లు పొందడంపై రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్పొరేషన్ పదవులు కూడా బీసీలకు ఇవ్వరా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జనాభా ప్రకారం రాష్ట్ర క్యాబినెట్లో తొమ్మిది మంత్రి పదవులు బీసీలకు రావాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తే బీఆర్ఎస్ తరఫున వచ్చి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని సూచించారు.
రీ సర్వే చేయాలి: స్వామిగౌడ్
ఎస్సీ, ఎస్టీలతోపాటు వెనుకబడిన బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని డాక్టర్ అంబేద్కర్ కోరారని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తూ వస్తున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఒక్క సర్వేతో బీసీ జనాభాను తగ్గించేశారని, రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. పెరియార్, జయలలిత, ఎన్టీఆర్, కేసీఆర్ బీసీలు కాకపోయినప్పటికీ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీలను మింగేస్తున్నాయని స్వామిగౌడ్ విమర్శించారు.
కేసీఆర్ హయాంలోనే బీసీలకు న్యాయం
కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మిగతా పార్టీలతో పోలిస్తే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టంచేశారు. కేసీఆర్ 2003లోనే బీసీ పాలసీని రూపొందించారని గుర్తుచేశారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించాలని 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని చెప్పారు. తెలంగాణభవన్‌లో ఆదివారం బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం ఆ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షత నిర్వహించారు. సమావేశంలో శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, జోగు రామన్న, పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, కేవీ వివేకానందగౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, నోముల భగత్, కోరుకంటి చందర్, నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, తుల ఉమ, రవీందర్‌సింగ్, ఆంజనేయగౌడ్, రాకేశ్, కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ రోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో సమావేశమయ్యామని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయం, కేసీఆర్ హ యాంలో జరిగిన న్యాయం, ఇచ్చిన ప్రాధా న్యం గురించి చర్చించుకోవాల్సిన ఉన్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ఏమిచేయాలో 2003లోనే ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి కేసీఆర్ బీసీ పాలసీని రూపొందించారని చెప్పారు. ఆ పాలసీలపై ప్రజల్లో వ్యాప్తి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 10 రోజుల్లోనే అసెంబ్లీలో కేసీఆర్ నేతృత్వంలో బీసీల కోసం రెండు తీర్మానాలు ప్రవేశపెట్టినట్టు గుర్తుచేశారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, దేశంలోని చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించాలని తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించినట్టు చెప్పారు. కేంద్ర బడ్జెట్లో 5% నిధులు బీసీలకు కేటాయించాలని తీర్మానించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేట్టాలని 2021 అక్టోబర్ 8న అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినట్టు తెలిపారు.
పొలిమేరల దాకా తరిమికొట్టాలి: మధుసూదనాచారి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఊళ్లలోకి వచ్చే కాంగ్రెస్ నేతలను గ్రామ పొలిమేరల దాకా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలు ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణింపబడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండోశ్రేణి పౌరులుగానే చద్దామా? మన పిల్లలకు ఇదే గతి పట్టాల్నా? అని ప్రశ్నించారు. అందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంలోనే బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా సాధిస్తామని చెప్పారు.
రాజ్యాంగ సవరణ సాధ్యమే
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే రాజ్యాంగ సవరణ సాధ్యమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇద్దరూ కూర్చొని చాయ్ తాగే లోపు రాజ్యాంగ సవరణ జరుగుతుందని తెలిపారు. ఇందిరాగాంధీ జమానాలో ములీ రూల్స్‌ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా? అని ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేస్తలేరని నిలదీశారు.
కులగణన సర్వేతో కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాల గొంతు కోసింది. దీన్ని ఏ బీసీ బిడ్డా ఒప్పుకోరని అసెంబ్లీలోనే స్పష్టంచేశాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం నుంచి నియోజకవర్గాలవారీగా, మండలాలవారీగా, జిల్లా కేంద్రాలవారీగా భావజాల వ్యాప్తిని ప్రారంభిస్తాం. ప్రజలను జాగృతం చేస్తాం.
– కేటీఆర్
ఒకవేళ ప్రభుత్వం మొండి వైఖరితోనే ఉంటే, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా వారి గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే, ఏం చేయాలన్న దానిపై విసృ్తతంగా చర్చిం చాం. బీసీ నేతల అభిప్రాయాలను పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడతం.
– కేటీఆర్